తెలంగాణ రాజకీయాల్లో నిజామాబాద్‌ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. అక్కడ ఎంపీగా ఉన్న బీజేపీ నేత అరవింద్‌ సమయం వచ్చినప్పుడల్లా బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తుంటారు. నేరుగా కేసీఆర్‌ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటారు. ముఖ్యంగా కవితపై ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్న టైంలో కామెంట్స్‌ స్థాయి పెరిగింది. అదే నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్‌లో డిస్కషన్ పాయింట్‌గా మారిపోయింది. 


నిజామాబాద్‌లో మరోసారి ఎంపీ అరవింద్‌, ఎమ్మెల్సీ కవిత మధ్య వర్డ్స్‌ వార్ నడుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీపై విమర్శలు చేసిన అరవింద్‌ హాట్ కామెంట్స్ చేశారు. జీవిత బీమా పేరుతో ప్రజలకు ఇవ్వడం ఏమో కానీ... కవితను ఉద్దేశిస్తూ నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా... మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా... మీ నాన్న చచ్చిపోతే అని మాట్లాడేశారు. 




చావు విమర్శలపై కవిత తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎమోషన్ అయ్యారు. ప్రజలారా! మీ ఇంట్లో ఆడబిడ్డలను అంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కవిత ఇంకా ఏమన్నారంటే..." తెలంగాణ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆడబిడ్డనైన నన్ను అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లలను అంటే మీకు సమ్మతమేనా? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి నన్ను ఏది అన్నా ఒప్పుకుందామా ? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా ? " అని ప్రజలను అడిగారు.


నిజామాబాదులో ఓడిపోయిన తర్వాత హుందాగా ఉన్నానని చెప్పుకొచ్చారు కవిత. తన స్థాయి తాను సేవ చేసుకొని వెళ్లాలనన్నారు. కానీ ఎంపీగా విజయం సాధించిన వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మానేసి తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. 


ప్రజాసేవలో ఉన్నప్పుడు పని చేయకపోతే ప్రజలు ప్రశ్నిస్తారని, ప్రతిపక్షాలు నిలదీయాలని కానీ చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా... మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా... మీ నాన్న ఇట్లా అనడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భాషాప్రయోగం రాజకీయాల్లో ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. 


తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ వారిని ఇలా అమర్యాదగా మాట్లాడలేదన్నారు. ఎప్పుడైనా ఇష్యూబేస్డ్‌గానే స్పందించామని గుర్తు చేశారు. అలాంటి మర్యాదతోనే రాజకీయాలు జరగాలని కోరుకునే వ్యక్తిగా ఓ వ్యక్తిని టార్గెట్‌ చేసే రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
ఆమె ఇంకా ఏమన్నారంటే..."ఇదేం సంస్కారం  అరవింద్! మీ లాంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన టైం వచ్చేసింది. మేము మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సమయంలో...  నిజామాబాద్ ఎంపీ మాట్లాడిన మాటలు మహిళలను రాజకీయాల్లోకి రాకుండా కట్టడి చేసేలా ఉన్నాయి." అన్నారు. 


ముగ్గురు కూడా బాధపడరు: అరవింద్


సానుభూతి కోసం కవిత ఎంత తాపత్రయ పడ్డా ప్రయోజనం లేదన్నారు ఎంపీ అరవింద్. వారి ఫ్యామిలీపై ఎలాంటి భాషతో తిట్టినా ప్రజలలో  కనీసం ముగ్గురు కూడా బాధపడబోరని అన్నారు. మోడీ నుంచి కిషన్ రెడ్డి, తమ వరకు అందరినీ ఇష్టమొచ్చినట్టు అడ్డమైన భాష వాడి తిట్టిన తిట్ల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం ఎలక్షన్ల టైంలో సుభాషితాలు చెప్తే సానుభూతి రాదన్నారు.