సిద్ధిపేట స్ఫూర్తితోనే తాను ముందుకు సాగుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ గడ్డతో అనుబంధమే తనను తెలంగాణ సీఎం అయ్యేంత ఎత్తుకు తీసుకెళ్లిందని చెప్పారు. సిద్ధిపేటలోని ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఇవాళ తెలంగాణ దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధి సాధించిందని, అలా పాలన సాగిస్తున్నామంటే అది సిద్ధిపేట గడ్డ తనకు అందించిన బలమేనని అన్నారు. ప్రతి సందర్భంలోనూ తనను విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని చెప్పారు.
సిద్ధిపేట అందించిన స్ఫూర్తే
దేశమే ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నానంటే అది సిద్ధిపేట అందించిన స్పూర్తే అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ గడ్డ నాకు అందించిన బలమే తనను నడిపిస్తుందని, ఈ ఊరి పేరు వింటే నా జన్మభూమి గొప్పదనే భావన కలుగుతుందని అన్నారు. 'ఈ గడ్డ నన్ను పెంచి పెద్ద చేసింది. చదువు చెప్పింది. రాజకీయంగా నాకు జన్మనిచ్చింది. నన్ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేసే స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సందర్భంలో నన్ను విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను.' అని పేర్కొన్నారు. 'నా చిన్నతనంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఓ ముదిరాజ్ తల్లి నాకు చనుబాలు ఇచ్చింది. తనకు ఈ గడ్డతో అంతటి అనుబంధం ఉంది.' అంటూ కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
మిషన్ భగీరథకు అదే పునాది
సిద్ధిపేట మంచినీళ్ల పథకమే, మిషన్ భగీరథ పథకానికి పునాది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామంటే దానికి కారణం సిద్ధిపేట స్ఫూర్తే అని చెప్పారు. ఈ ప్రాంతంలో కరువు వస్తే ట్యాంకర్లతో నీళ్లు తెప్పించామని గుర్తు చేశారు. ఆనాడే లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీరు తెచ్చి జల జాతర చేసుకున్నామని వివరించారు.
'హరీష్.. ఆరడుగుల బుల్లెట్'
తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది కూడా సిద్ధిపేట గడ్డమీదేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడాల్సి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, అప్పుడు కరీంనగర్ లో సమావేశమై కన్నీళ్లు పెట్టుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో ఆరడుగుల బుల్లెట్ హరీశ్ ను మీకు అప్పగిస్తే తాను ఊహించని దాని కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా పని చేశారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం, పథకం సిద్ధిపేటలో తీసుకొచ్చేందుకు హరీశ్ ఎంతో కృషి చేశారని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణలో సిద్ధిపేటకు ప్రత్యేక స్థానం ఉందని, ఈసారి భారీ మెజార్టీతో హరీశ్ రావును గెలపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'సస్యశ్యామలం చేసుకున్నాం'
సిద్ధిపేట ప్రాంతాన్ని ఇంతటి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. దశాబ్దం క్రితం రాష్ట్రంలో కరువు తాండవించగా ప్రస్తుతం తెలంగాణ 10 రాష్ట్రాలకు అన్నం పెడుతుందన్నారు. కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసుకుని సిద్ధిపేటను సస్యశ్యామలం చేసుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చినా, కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.