Pravalika Death News: ప్రవళిక మృతి పై బీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రవళిక మృతి పై ప్రభుత్వం, కేటీఆర్, పోలీసుల అసత్య ప్రచారం పై నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం తో పాటు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్, AICC స్పోక్స్ పర్సన్ డాలీ శర్మ, నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రవళిక సూసైడ్ చేసుకొని ఒకసారి చనిపోతే.. రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి మరోసారి చంపేశాని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం ధ్యేయంగా హైదరాబాద్ కి వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.



ప్రవళిక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఇంటికి వెళ్తానని కుటుంబ సభ్యులకు తెలిపినట్లు కోదండరాం వివరించారు. రాష్ట్రంలో పేపర్ లీకేజ్, పరీక్ష రద్దు వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండి పడ్డారు. ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, తమ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ప్రభుత్వం పై దుయ్యబట్టారు. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ చెప్పిన గణాంకాలన్నీ తప్పుడు లెక్కలే అని కొట్టిపారేశారు. రాష్ట్రంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్ ప్రకటనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.


జాబ్ క్యాలెండర్ ను ఈ సంవత్సరంలో కూడా ప్రభుత్వం ప్రకటించలేదని విమర్శించారు. టీఎస్ పీఎస్సీ ని రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నాడని, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెన్షన్, రైతుబంధు, గ్యాస్ ధర తప్ప ఎక్కడా ఉద్యోగాలపైన ప్రకటన లేదన్నారు.


మేనిఫెస్టోలోనే నిరుద్యోగులు లేకపోతే వాళ్ళ విధానాల్లో ఎక్కడ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిరుద్యోగులపై అడిగే ప్రశ్నలకు ఒక్క సమాధానం ఇస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. అనంతరం పోలీసుల తీరిపై కోదండరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడుతాం అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని పోలీసులు అంటున్నారని చెప్పారు.ప్రవళిక మృతి పైన వాస్తవాలు చెప్పాలని ప్రెస్ మీట్ పెడితే పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారని వెల్లడించారు.


AICC స్పోక్స్ పర్సన్ డాలీ శర్మ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతం నుంచి తన కలలను నిజం చేసుకోవాలని ప్రవళిక హైదరాబాద్ కి వచ్చిందని చెప్పారు. ఈ ప్రభుత్వం పేపర్ లీక్ చేసి, పరీక్షలను వాయిదా వేయడం వల్ల ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చెప్పారు. సొంత ఊరును, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి అప్పులు చేసి హైదరాబాద్ కు వచ్చి చదువుకుందామనుకుంటే పరీక్షలు వాయిదా పడుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు తీవ్రంగా ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడించారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రవళిక డిప్రెషన్ కు లోనై సూసైడ్ చేసుకుందని చెప్పారు


కేవలం ప్రవళిక నే కాకుండా రాష్ట్రంలో చాలా మంది స్టూడెంట్స్ పై ప్రెజర్ పెరిగిపోతుందని చెప్పారు. ప్రవళిక కారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రవళిక పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. నిజ నిజాలు తెలుసుకోకుండా ప్రవళిక గ్రూప్స్ కి అప్లై చేయలేదని మంత్రి కేటీఆర్ ఇలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా మృతి చెందిన ప్రవళిక ఇంటికి వెళ్లి నిజాలు తెలుసుకున్నామని వెల్లడించారు. ఒక తెలంగాణ ఆడబిడ్డ కారెక్టర్ గురించి ఈ ప్రభుత్వం మాట్లాడటం సిగ్గుచేటని చెప్పారు. కేటీఆర్ మంత్రి కేటీఆర్ ప్రవళిక పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


ప్రవళిక గ్రామానికి వెళ్లి వల్ల తల్లిదండ్రులను పరామర్శించినట్లు రియాజ్ తెలిపారు. ప్రవళిక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతుందని చెప్పారు. అబద్ధాల, దుర్మార్గపు ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ప్రవళిక మృతిపై డీసీపీ వేసిన ఆబండాలపై వాళ్ళ పేరెంట్స్ కుంగిపోతున్నారని వెల్లడించారు. జిక్కాజి పల్లి లో అందరికన్నా బాగా చదివేది ప్రవళిక అని అన్నారు. 


ఓయూ విద్యార్థి నేత బాల్ లక్ష్మి మాట్లాడుతూ... తెలంగాణ వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా వేయలేదు అని ఆరోపించారు. ప్రవళిక చనిపోతే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చాల్సిన ప్రభుత్వం ఆ అమ్మాయి కారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ మాట్లాడుతున్నారు సిగ్గుచేటని చెప్పారు. నిరుద్యోగుల గురించి మాట్లాడటానికి ఈ ప్రభుత్వనికి ఎలాంటి అర్హత లేదన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ విద్యార్థులు ధైర్యంగా ముందుకెళ్లాలి తప్ప... ఎవరూ సూసైడ్ చేసుకోవద్దు సూచించారు.