Sugar Companies Shares: వరుసగా రెండో ట్రేడింగ్ రోజులోనూ షుగర్ స్టాక్స్ మంచి ఊపు కనబరిచాయి. భారీ వాల్యూమ్స్ మధ్య, ఇవాళ (సోమవారం, 19 డిసెంబర్ 2022) కూడా 20 శాతం వరకు ర్యాలీ చేశాయి, ఇన్వెస్టర్ల మనస్సులను తీపి చేశాయి.
PTI రిపోర్ట్ ప్రకారం... దేశీయ చక్కెర ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం జనవరిలో అంచనా వేసిన తర్వాత, ప్రస్తుత 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి చక్కెర ఎగుమతి కోటాను పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్‌పోర్ట్ కోటాను కేంద్ర ప్రభుత్వం పెంచితే, చక్కెర కంపెనీలు మరిన్ని ఎగుమతులు చేయగలుగుతాయి. తద్వారా విదేశీ ఆదాయాన్ని మరింత ఎక్కువగా సంపాదించుకుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చిన తరుణంలో చక్కెర సంస్థలకు ఇది ఒక శుభవార్త.
షేర్ ధరలు 20 శాతం వరకు జంప్
PTI రిపోర్ట్ నేపథ్యంలో... దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ (రూ. 440.55), రాజశ్రీ షుగర్ & కెమికల్స్ (రూ. 66.70), శక్తి షుగర్స్ (రూ. 34.55), ధంపూర్ స్పెషాలిటీ షుగర్స్ (రూ. 34.80), సింభోలి షుగర్స్ (రూ. 33.80) ఇవాళ 20 శాతం పెరిగాయి.
ధంపూర్ షుగర్ మిల్స్, KCP షుగర్ అండ్ ఇండస్ట్రీస్, ఉగర్ షుగర్, అవధ్ షుగర్, మవానా షుగర్స్, KM షుగర్ మిల్స్, విశ్వరాజ్ షుగర్ ఇండస్ట్రీస్ 10 శాతం నుంచి 19 శాతం మధ్య ర్యాలీ చేశాయి. వీటితో పోలిస్తే, S&P BSE సెన్సెక్స్ 0.23 శాతం పెరిగి 61,476 స్థాయికి చేరుకుంది.
వ్యవసాయ ఆధారితమైన చక్కెర పరిశ్రమ రుతుపవనాల మార్పులకు గురవుతుంది. అలాగే, నిత్యావసర ఆహార పదార్థం కాబట్టి ధరలు ఎక్కువగా పెరక్కుండా కేంద్ర ప్రభుత్వ జోక్యం అధిక స్థాయిలో ఉంటుంది. ఇంకా, ఈ పరిశ్రమలో కాలానుగుణంగా వర్కింగ్ క్యాపిటల్ మారుతుంటుంది. ఇలాంటి మరికొన్ని అంశాల మీద చక్కెర ఉత్పత్తి కంపెనీల పనితీరు ఆధారపడి ఉంటుంది. తదనుగుణంగా ఈ కంపెనీల షేర్ల ధరలు మారుతూ ఉంటాయి.
చక్కెర పరిశ్రమ అడుగులను మార్చడానికి భారత ప్రభుత్వం గత రెండేళ్లలో చాలా చర్యలు తీసుకుంది. 2018లో చక్కెర కనీస అమ్మకపు ధరను ప్రవేశపెట్టడం; స్థిరమైన ముడిసరుకు ధర, మార్కెట్ ఆధారిత తుది ఉత్పత్తి ధర వంటి కీలక సమస్యలను పరిష్కరించడం వంటి చర్యల ద్వారా... చక్కెర కంపెనీల మీద కాలానుగుణ మార్పుల ప్రభావం తక్కువగా ఉండేలా చేసిందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (Ind-Ra) వెల్లడించింది.
తాజాగా, శనివారం (17 డిసెంబర్ 2022) జరిగిన వస్తు, సేవల పన్ను (GST) కౌన్సిల్ సమావేశంలో, మోటార్ స్పిరిట్‌లో (పెట్రోల్) కలపడానికి రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్ మీద పన్నును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం కూడా చక్కెర కంపెనీల షేర్లకు బూస్ట్‌లా పని చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.