Panacea Biotec Shares: బయోటెక్‌ కంపెనీ పాన్‌యోసియా బయోటెక్‌ షేర్లు ఇవాళ్టి (మంగళవారం) లాసుల మార్కెట్‌లోనూ కాసులు కురిపించాయి. నిన్నటి (సోమవారం) ట్రేడింగ్‌లో రూ.134 దగ్గర క్లోజయిన షేర్ ధర, ఇవాళ రూ.155 దగ్గర భారీ గ్యాప్‌ అప్‌తో ఓపెన్‌ అయింది. నిమిషాల్లోనే రూ.160.80కి చేరింది. ఇది 20 శాతం పెరుగుదల.


యూనిసెఫ్‌ (UNICEF), పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) నుంచి ఈ కంపెనీకి మల్టీ మిలియన్ విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ కంపెనీ షేర్లు ఇలా రెచ్చిపోవడానికి కారణం ఇదే.


WHO ప్రి-క్వాలిఫైడ్ ఫుల్లీ లిక్విడ్ పెంటావాలెంట్ (Pentavalent) వ్యాక్సిన్, ఈజీఫైవ్‌ టీటీ (Easyfive-TT) సరఫరా కోసం UNICEF, PAHO నుంచి $127.3 మిలియన్ల (రూ.1,040 కోట్లు) విలువైన సరఫరా ఆర్డర్లను ఈ బయో టెక్నాలజీ సంస్థ దక్కించుకుంది.


మార్కెట్‌ క్యాప్‌ కంటే ఎక్కువ
విచిత్రం ఏమింటంటే.. ఈ స్మాల్‌ క్యాప్‌ కంపెనీ మార్కెట్‌ విలువ (రూ.955 కోట్లు) కంటే ఇది ఇప్పుడు పొందిన ఆర్డర్ విలువే ఎక్కువ. 


ఈజీఫైవ్‌ టీటీని 2005లో మన దేశంలో ఆవిష్కరించారు. ప్రపంచంలో మొట్టమొదటి పూర్తి ద్రవ wP-ఆధారిత పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఇది. 2008లో WHO ప్రి-క్వాలిఫికేషన్ దక్కింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు 150 మిలియన్లకు పైగా డోసులను ఇండియా సరఫరా చేసింది.


2023-2027 మధ్యకాలంలో 99.70 మిలియన్ డోస్‌ల సరఫరా కోసం UNICEF పెట్టిన ఆర్డర్ విలువ $98.755 మిలియన్లు (రూ.813 కోట్లు). 2023-2025 మధ్యకాలంలో 24.83 మిలియన్ డోస్‌ల సరఫరా కోసం PAHO పెట్టిన ఆర్డర్ విలువ $28.55 మిలియన్లు (రూ.235 కోట్లు). 


గతమంతా గడ్డు కాలం 
ఈ ఒక్కరోజే 20 శాతం పెరిగిన పాన్‌యోసియా బయోటెక్‌ షేర్లు, గత కొంత కాలంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) దాదాపు 20 శాతం నష్టపోయాయి. గత ఏడాది కాలంలో చూస్తే, ఇవి దాదాపు 42 శాతం క్షీణించాయి. గత ఆరు నెలల కాలంలో 14 శాతం పైగా దిగి వచ్చాయి.


అయితే, గత నెల రోజుల కాలంలో ఈ కౌంటర్‌ 13 శాతం పుంజుకుంది. ఇవాళ్టి 20 శాతం పెరుగుదల పుణ్యమే ఇది. 


మధ్యాహ్నం 1.25 గంటల సమయానికి, 23.60 రూపాయలు లేదా 17.61 శాతం లాభంతో రూ.157.60 దగ్గర షేర్లు కదులుతున్నాయి. ఇదే సమయానికి సెన్సెక్స్‌ ఇండెక్స్‌ 395.53 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో 57,595.58 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.