Diagnostic Firm Shares: చైనాలో కొవిడ్ కేసుల విజృంభణతో, మన స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ (బుధవారం 21, డిసెంబర్‌ 2022) డయాగ్నస్టిక్ కంపెనీల షేర్లు పండగ చేసుకున్నాయి. ఇంట్రా డేలో 6 శాతం వరకు ర్యాలీ చేశాయి. క్రిస్మస్‌ సెలవుల కారణంగా బుధవారం ట్రేడ్‌లో సెన్సెక్స్‌ దాదాపు 700 పతనమైనా, ల్యాబ్‌ స్టాక్స్‌ మాత్రం ఎదురీదాయి.


డా.లాల్ పాత్‌ల్యాబ్స్ (Dr Lal PathLabs) షేర్లు 6.4 శాతం పెరిగి రూ. 2,434.7 కి చేరుకోగా, మెట్రోపొలిస్ హెల్త్‌ కేర్ (Metropolis Healthcare), లారస్ ల్యాబ్స్ ‍‌(Laurus Labs), విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ (Vijaya Diagnostic Centre) షేర్లు 3 శాతం పైగా పెరిగాయి. ఇప్కా ల్యాబ్స్ (Ipca Labs) కూడా 2 శాతం పైగా ఎగబాకింది.


హాస్పిటల్ చెయిన్స్ అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals), ఫోర్టిస్ హెల్త్‌ కేర్ ‍‌(Fortis Healthcare) షేర్లు కూడా దాదాపు 3% పెరిగాయి.


“సమీప కాలం ఈక్విటీలకు అనుకూలంగా లేదు. అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ మీద ప్రభావం చూపుతుంది" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ చెప్పారు.


భారత ప్రభుత్వం అప్రమత్తం
చైనా, అమెరికా సహా కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ (Corona Virus) కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండడంతో భారత కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రపంచ దేశాల్లో వైరస్‌ పరిస్థితులపై అంచనా వేసేందుకు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) నేతృత్వంలో ఉన్నత స్థాయి ఆరోగ్య అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విదేశాల్లో పుట్టుకొచ్చిన కొవిడ్‌ (Covid) కొత్త వేరియంట్ల మీద అధికారులు చర్చించారు. క్లస్టర్లను సకాలంలో గుర్తించడం కోసం, కరోనా వైరస్ కొత్త వేరియంట్‌లను గుర్తించడానికి, నిర్వహించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్‌ (జన్యు క్రమాన్ని విశ్లేషించడం) పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీంతో పాటు, అంతర్జాతీయ ప్రయాణాలపైనా చర్చించారు.


కొత్తగా ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి ఇన్‌సాకాగ్ ల్యాబ్‌లకు (Insacog labs - దేశవ్యాప్తంగా ఉన్న 52 లేబొరేటరీల కన్సార్టియం) అన్ని కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.


ఈ పరిణామాల నేపథ్యంలో, కొవిడ్‌ కేసుల పరీక్షలు మళ్లీ పెరుగుతాయన్న అంచనాల మధ్య ఇవాళ్టి భారీ నష్టాల మార్కెట్‌లోనూ డయాగ్నస్టిక్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.