SEBI on Rumors: దేశంలోని స్టాక్ మార్కెట్ల పనితీరును పర్యవేక్షించటానికి ఏర్పాటు చేయబడిన సంస్థ సెబీ. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థపై రిజర్వు బ్యాంక్ పర్యవేక్షణ ఉన్నట్లుగానే ఎన్ఎస్ఈ, బీఎస్ఈల పనితీరును గమనించటం, పెట్టుబడిదారుల సంరక్షణ, మార్కెట్లలో అక్రమాలను అడ్డుకోవటం వంటి కీలక చర్యలు సెబీ ఆధీనంలో ఉంటాయి. ఇటీవల మార్కెట్లలో అనేక సంస్కరణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెబీ కొత్త మార్గదర్శకాలు రిటైల్ ఇన్వెస్టర్లకు శ్రీరామ రక్షగా మారనున్నాయి. 


స్టాక్ మార్కెట్లో చాలా మంది తమ డబ్బును కోల్పోవటానికి ఒక కారణం పుకారు వార్తలపై ట్రేడింగ్ చేయటమే. కొన్నిసార్లు కొందరు ట్రేడర్లు లాభపడేందుకు కొన్ని కంపెనీల షేర్లకు సంబంధించి అసత్య వార్తలను ప్రచారం చేస్తుంటారు. దీంతో వారి పెట్టుబడులను అధిక ధరలకు విక్రయించి లాభపడుతుంటారు. ఇలాంటి వాటితో అనేక మంది పెట్టుబడిదారులు సంపదను కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇకపై ఇలాంటి వాటిని అరికట్టేందుకు పుకార్లను పరిష్కరించడానికి సెబీ మే 21న కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన గైడ్ లైన్స్ ప్రకారం.. తెలియని వార్త లేదా పుకారు కారణంగా షేర్‌లో పెద్ద మార్పు జరిగితే కంపెనీ 24 గంటల్లోపు సదరు వార్తపై అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుది. మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్న వార్తపై కంపెనీ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సెబీ వెల్లడించింది. 


ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు జూన్ 1 నుంచి మొదటి 100 లిస్టెడ్ కంపెనీలకు తొలివిడతలో అమలు చేయాలని సెబీ నిర్ణయించింది. సెకండ్ ఫేస్ కింద ఈ రూల్స్ తదుపరి 150 కంపెనీలకు వర్తింపజేయనుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే ఏదైనా కంపెనీకి సంబంధించిన ఒక వార్త మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని ఆధారంగా చాలా మంది ఇన్వెస్టర్లు కొనుగోలు లేదా విక్రయం వంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంన్నారు. ఇది జరిగిన చాలా సమయం తర్వాత కొన్ని సార్లు రోజుల తర్వాత కంపెనీలు సదరు వార్తలను ఖండించేవి. దీంతో కంపెనీలు గాలివార్తలపై ఆలస్యంగా స్పందించటంతో చాలా మంది పెట్టుబడిదారులు వాటిని నిజంగానే నిజమని నమ్మి నష్టపోయేవారు. గత చరిత్ర చూస్తే చాలా సార్లు కంపెనీలు వార్తలను వివరించడానికి ఎక్కువ సమయాన్ని తీసుకునేవి. దీనివల్ల పెట్టుబడిదారులు నష్టపోతారు. దీన్ని ఆపేందుకు సెబీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.


SEBI కొత్త నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన అన్ని కంపెనీలకు ఈ మార్పులు అవసరం. స్టాక్ మార్కెట్‌లో ఏవైనా పుకార్ల కారణంగా స్టాక్ ధరల్లో ఏదైనా మార్పు జరిగితే సదరు మార్కెట్ రూమర్‌లను 24 గంటల్లోపు ధృవీకరించాలి. కాబట్టి సెబీ చర్యలు ఇన్వెస్టర్లను నష్టాల నుంచి కాపాడేందుకు అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరికొందరి వాదన ప్రకారం 24 గంటలు అనేది నిజంగా చాలా ఎక్కువ సమయమని ఈ మధ్యలోనే ఇన్వెస్టర్లకు జరగాల్సిన నష్టం మెుత్తం జరిగిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇవి స్వల్ప ఉపశమనాన్ని అందిస్తాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సెబీ బాధ్యతలు మాధబి పూరి బుచ్ చేపట్టిన తర్వాత వచ్చిన కీలక మార్పుల్లో ఇది కూడా ఒకటిగా వారు అభివర్ణిస్తున్నారు.