Car Crash in US: అమెరికాలోని జార్జియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గత వారం ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కార్‌లో ఉన్న ఐదుగురు విద్యార్థులూ 18 ఏళ్ల వయసు వాళ్లే అని తెలిపారు. యూనివర్సిటీ ఆప్ జార్జియా, ఆల్ఫారెట్టా హైస్కూల్‌లో చదువుతున్నారని వివరించారు. మే 14వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. అయితే...ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన కార్‌ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆర్యన్ జోషి, శ్రియా అవసరాల, అన్వీ శర్మ అక్కడికక్కడే మృతి చెందారు. రిత్వక్ సోంపల్లి, మహమ్మద్ లియాకత్‌ ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. గత నెల కూడా ఓ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ తెలంగాణకు చెందిన వాళ్లే. అరిజోనాలో రెండు కార్లు ఢీకొట్టకున్న ఘటనలో చనిపోయారు.