కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి వాణిజ్య అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆరంభిస్తున్నామని ప్రకటించింది. అంతర్జాతీయ ప్రయాణికులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్‌ను పాటించాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.


కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నిషేధించింది. మార్చి 2020 నుంచి ఈ సర్వీసులు నడవడం లేదు. అయితే 2020, మే 25 నుంచి జాతీయ విమాన సర్వీసులు మాత్రం మొదలయ్యాయి. ముందుగానే నిర్దేశించిన బబుల్‌ అగ్రిమెంట్ల ప్రకారం మాత్రమే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిచాయి. ఇంతలోనే ఒమిక్రాన్‌ వేరియెంట్‌ రావడంతో కమర్షియల్‌ ప్యాసెంజర్ ఫ్లైట్లపైన తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు డీజీసీఏ ఆంక్షలను పొడగించింది.






ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌, బంగ్లాదేశ్, భూటాన్‌, కెనెడా, ఇథియోపియా, ఫిన్‌లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇరాక్‌, జపాన్‌, కజక్‌స్థాన్‌, కెన్యా, కువైట్‌, మాల్దీవులు, మారీషస్‌, నేపాల్‌, నెదర్లాండ్స్‌, నైజీరియా, ఒమన్‌, ఖతార్‌, రష్యా, రువాండా, సౌదీ అరేబియా, సీషెల్స్‌, సింగపూర్‌, శ్రీలంక, స్విట్జర్లాండ్‌, టాంజానియా, ఉక్రెయిన్‌, యూఏఈ, బ్రిటన్‌, అమెరికా, ఉజ్బెకిస్థాన్‌తో భారత్‌కు ట్రాన్స్‌పోర్టు బబుల్స్‌ ఉన్నాయి.


వాస్తవంగా గతేడాది డిసెంబర్‌ నుంచే షెడ్యూలు కమర్షియల్‌ ఇంటర్నేషనల్‌ విమాన సర్వీసులను ఆరంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ వ్యాప్తితో ఇది ఆగిపోయింది. ఆ తర్వాత ఆంక్షలు మొదలయ్యాయి. ప్రస్తుతం కరోనా తగ్గిపోవడం, ఇతర దేశాలు ఆంక్షలను పూర్తిగా సడలిస్తుండటంతో భారత్‌ సర్వీసులను మొదలు పెడుతోంది.