SBI MSME Sahaj Loan Service: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన SBI, చిన్న వ్యాపారాలు/సంస్థలు పెట్టుకునేవాళ్ల కోసం బ్రహ్మాండమైన ఆఫర్‌ ప్రకటించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఎంఎస్‌ఎంఈ సహజ్‌ (MSMay Sahaj) అని పేరు పెట్టింది. ఈ ప్రచారం కింద, చిన్న పరిశ్రమలకు కేవలం 15 నిమిషాల్లో రుణం ఇస్తుంది.


స్మాల్, మైక్రో అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేట్ బ్యాంక్ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. MSMEల ఫైనాన్సింగ్ అవసరాలను త్వరగా & సులభంగా తీర్చడానికి ఉద్దేశించిన వెబ్ ఆధారిత పరిష్కారం ఇది. దీనివల్ల చిన్న వ్యాపారవేత్తల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు సులభంగా తీరతాయని బ్యాంక్‌ వెల్లడించింది.


లక్ష రూపాయల వరకు రుణం
GST కింద నమోదైన సంస్థలు మాత్రమే SBI MSMay Sahaj సదుపాయాన్ని ఉపయోగించుకోగలుగుతాయి. GST నమోదు చేసిన ఇన్‌వాయిస్‌లపై రూ. 1 లక్ష వరకు రుణాలు కంపెనీ యజమానులకు అందుబాటులో ఉంటాయి. ఆ లోన్‌ను కేవలం 15 నిమిషాల్లోనే పొందొచ్చు. రుణ ప్రక్రియ మొత్తం పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో ఉంటుంది. స్టేట్‌ బ్యాంక్‌ నుంచి ఇంతకుముందు రుణం తీసుకోని ఎంఎస్‌ఎంఇలు కూడా ఈ ప్రచారం కింద ఆర్థిక సాయం పొందొచ్చు.


యోనో యాప్‌ ద్వారా..
ఎంఎస్‌ఎంఈ సహజ్‌ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడానికి పెద్ద తతంగం కూడా అవసరం లేదు. సంస్థ యజమాని & సంతృప్తికరమైన కరెంట్ ఖాతా ఉంటే చాలు. ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఎంఎస్‌ఎంఈ కస్టమర్‌లుగా ఉన్న సంస్థల యజమానులు స్టేట్‌ బ్యాంక్‌ యోనో (SBI Yono) మొబైల్ యాప్ ద్వారా లోన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రచారం కింద అందించిన ఆర్థిక సాయం "స్వల్పకాలిక రుణం" రూపంలో ఉంటుంది.


ఎంఎస్‌ఎంఈ సహజ్‌ ప్రచారం నుంచి స్టేట్‌ బ్యాంక్‌ మూడు ప్రయోజనాలను ఆశిస్తోంది. మొదటి ప్రయోజనం - తక్కువ సమయంలో MSMEలకు మూలధనం అందుబాటులో ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లో లోన్ పొందుతారు. ఫలితంగా, తక్షణ అవసరాలను సులభంగా తీర్చుకోగలుగుతారు. రెండో ప్రయోజనం - ఇప్పటికీ ఎస్‌బీఐ నుంచి లోన్‌ తీసుకోని కస్టమర్లను కనెక్ట్ చేయడంలో ఈ సౌకర్యం సాయపడుతుంది. మూడో ప్రయోజనం - ఈ సదుపాయం SBI డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దారి కల్పిస్తుంది.


వ్యవసాయ రుణాల కోసం ప్రత్యేక కేంద్రాలు
పారిశ్రామికవేత్తలకే కాదు, రైతులకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. వ్యవసాయ రుణాలు వేగంగా జారీ చేసేందుకు ఇటీవలే ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించింది. 'అగ్రికల్చర్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్' పేరుతో దేశవ్యాప్తంగా 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్‌ బ్యాంక్‌ ఓపెన్‌ చేసింది. భవిష్యత్‌లో వీటి సంఖ్యను మరింత పెంచుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అగ్రికల్చరల్‌ లోన్ల కోసం స్పెషల్ సెంటర్లను లాంచ్‌ చేసింది. అంతేకాదు, గృహ రుణం వంటి కొన్ని రకాల రుణాలను మంజూరు చేసేందుకు 'రిటైల్ అసెట్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్‌'ను కూడా స్టేట్‌ బ్యాంక్‌ ఇప్పటికే నిర్వహిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యోనో యాప్‌లోనూ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: NPSలో భారీ మార్పులకు సర్వం సిద్ధం!, మీకు ఎంత పెన్షన్‌ వస్తుందంటే?