Russia Crude Oil: భారత్‌, రష్యా అనుబంధం మరింత బలపడుతోంది! ఇప్పుడు దేశ చమురు అవసరాలు తీర్చే ప్రధాన సరఫరాదారుగా రష్యా అవతరించింది! ఇరాక్‌, సౌదీ అరేబియాను మించి ఇప్పుడు క్రెమ్లిన్‌ మనకు క్రూడాయిల్‌ ఎగుమతి చేస్తుండటం గమనార్హం. మున్ముందు వారి ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


సాధారణంగా రష్యా నుంచి ఐరోపా దేశాలు చమురును కొంటాయి. జర్మనీ, ఫ్రాన్స్‌ సహా అనేక దేశాలు వారికి ప్రధాన కస్టమర్లు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగగానే వారిలో కొందరు కొనడం తగ్గించేశారు. దాంతో మార్కెట్‌ కన్నా తక్కువ ధరకే రష్యా భారత్‌కు చమురును సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. నెలలు గడిచేకొద్దీ సరఫరా పెరిగింది. ప్రస్తుతానికి రోజుకు సగటున 10 నుంచి 12 లక్షల బ్యారెళ్ల వరకు ఎగుమతి చేస్తోందని ట్యాంకర్‌ ట్రాకింగ్‌ గణాంకాల ద్వారా తెలుస్తోందని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.


ఇప్పుడు ఇరాక్‌తో సమానంగా రష్యా మనకు ముడి చమురు సరఫరా చేస్తుండటం గమనార్హం. సౌదీ అరేబియాతో పోలిస్తే ఇంకా ఎక్కువే. రష్యా ఆధిపత్యం పెరగడంతో ప్రస్తుతం బాగ్దాద్‌ ఎక్కువ డిస్కౌంట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా తక్కువ ధరకే ఆయిల్‌ వస్తుండటంతో రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత రిఫైనరీలు ఎగబడుతున్నాయి.


ఐరోపా దేశాలు దిగుమతులు తగ్గించుకోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రష్యా ఇప్పుడు భారత్‌కు చమురును ఎగుమతి చేస్తోంది. అలాగే ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది. కెప్లెర్‌, వోర్‌టెక్సా, బ్లూమ్‌బర్గ్‌ ప్రకారం ఇప్పుడు మనకు రష్యానే అతిపెద్ద చమురు ఎగుమతిదారు కావడం గమనార్హం. కెప్లెర్‌ గణాంకాల ప్రకారం జూన్‌లో భారత్‌కు ఆ దేశం ప్రతిరోజూ 12 లక్షల బ్యారెళ్ల క్రూడ్‌ సరఫరా చేస్తోంది. ఇరాక్‌ 10 లక్షలు, సౌదీ అరేబియా 6.62 లక్షల బ్యారెళ్లు ఎగుమతి చేస్తున్నాయి. వోర్‌టెక్సా ప్రకారం రష్యా రోజుకు 11.6 లక్షల బ్యారెళ్లు సరఫరా చేస్తోంది. ఇరాక్‌ 11.3 లక్షల కన్నా ఇది ఎక్కువే.


రష్యా నుంచి భారత్‌, చైనా ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటుండటంతో ఇరాక్‌, సౌదీ గిరాకీ దెబ్బతింటోంది. ఈ రెండు దేశాలు కలిపి రోజుకు 5 లక్షల బ్యారెళ్ల మేర చమురును తగ్గించేశాయి. 'ధరలు పెరిగినప్పుడు మనకెలాంటి ఆప్షన్‌ ఉండదు. మనం ఎక్కడి నుంచైనా కొనాల్సిందే' అని చమురు శాఖా మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి గత వారం మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. 'భారత ప్రయోజనాలేంటో మాకు బాగా తెలుసు' అని ఆయన పేర్కొన్నారు.