RIL AGM 2023:
దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ. రాబోయే ఐదేళ్లు కంపెనీని తానే నడిపిస్తానని ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. కంపెనీకి తానే ఛైర్మన్, ఎండీగా కొనసాగుతానని వెల్లడించారు. సోమవారం జరిగిన రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. తన వారుసులు ఆకాశ్, అనంత్, ఇషాకు మెంటార్ వ్యవహరిస్తానని పేర్కొన్నారు. క్రమంగా ముగ్గురికీ కీలక బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. కంపెనీ ఛారిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికే నీతా అంబానీ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారని వివరించారు.
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది. టెలికాం, రిటైల్, ఆయిల్ అండ్ గ్యాస్, న్యూ ఎనర్జీ సహా అనేక రంగాల్లో సేవలు అందిస్తోంది. రాబోయే కాలంలో మరింత డిమాండ్ ఉన్న వ్యాపారాలను నిర్వహిస్తామని వెల్లడించారు. జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఆకాశ్ అంబానీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్‌ను ఇషా అంబానీ నడిపిస్తున్నారు. రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ రిటైల్ యూనిట్స్, ఆయిల్ అండ్ కెమికల్ యూనిట్స్‌కు అనంత్ అంబానీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
రిలయన్స్ ఏజీఎం విశేషాలు
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఐదు లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. అందరికీ డిజిటల్ టూల్స్ అందించడం, అంతాటా గ్రీన్ ఎనర్జీ వాడుకోవడం, అంతటా ఆర్థిక స్వావలంబన, వ్యాపార దక్షత, ఉపాధి కల్పన, అంతటా ఆరోగ్యకరమైన వినియోగం, అంతటా నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యాలుగా పెట్టుకున్నారు.
భవిష్యత్తులో చక్కని డిమాండ్ ఉండే వ్యాపారాలనే ఎంచుకుంటున్నామని ముకేశ్ అంబానీ అన్నారు. మానవ వనరులే తమకున్న అతిపెద్ద బలమని ఆస్తులు కావని పేర్కొన్నారు. సృజనాత్మక మేథస్సు, లక్ష్య కోసం పనిచేసే బృందాలే గొప్ప విలువను చేకూరుస్తాయని తెలిపారు. ఇన్వెస్టర్లకు చివరి 45 ఏళ్లలో సృష్టించిన సంపదను మించి రాబోయే దశాబ్దంలో మరిన్ని రెట్లు అధికంగా విలువను అందిస్తామన్నారు
రాబోయే ఐదేళ్లలో 100 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు నిర్మించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకొంది. 55 లక్షల టన్నుల వ్యవసాయ వృథా ఇందుకు అవసరమంది. దాంతో 20 లక్షల టన్నుల కార్పన్ ఉద్గారాలు తగ్గుతాయి. దీంతో 0.7 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ దిగుమతి తగ్గుతుందని ముకేశ్ అంబానీ తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2026లో బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఆరంభించనుంది. ఇందులో బ్యాటరీ రీసైకిలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. రిలయన్స్ జియో ఫైనాన్స్ అతి త్వరలోనే బీమా రంగంలో అడుగు పెట్టనుంది. జీవిత, ఆరోగ్య బీమా ఉత్పత్తులు అందిస్తామని తెలిపింది. షేరు హోల్టర్లకు 1:1 రేషియోలో జియో ఫైనాన్స్ షేర్లు అందించామని గుర్తు చేసింది.
భారత్ కేంద్రంగా కృత్రిమ మేథా పరిష్కారాలు అందిస్తామని ముకేశ్ అంబానీ అన్నారు. అందరికీ ఏఐ సేవలు అందిస్తామని ప్రామీస్ చేశారు. ఇందుకోసం జియో ట్రూ5జీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే జియో భారత్ ఫోన్లను ఆవిష్కరించింది. స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయలేని వారికి జియో భారత్ గేట్‌వేగా మారుతాయని ఆకాశ్ అంబానీ అన్నారు. కేవలం 2జీ ఫోన్ల ధరకే 4జీ ఫోన్లు అందిస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 19న వినాయక చవితి రోజు ఓవర్ ది ఎయిర్ 5జీ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ఆరంభిస్తామని తెలిపారు. జియో స్మార్ట్ హోమ్ సర్వీసెస్‌ను ఆరంభించారు.
జియో ఫైబర్ ఇప్పటికే 10 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించిందని ఆకాశ్ అంబానీ అన్నారు. ప్రతి నెలా వేలాది మంది కొత్త కనెక్షన్లు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్‌తో 200 మిలియన్లకు పైగా ఇళ్లకు ఇంటర్నెట్ చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిలయన్స్ జియో రూ.1.19 లక్షల కోట్ల రెవెన్యూ పోస్ట్ చేసింది. 450 మిలియన్లు మంది యూజర్లు ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా దేశవ్యాప్తంగా 5జీ కవరేజీ పూర్తవుతుంది.
మూడేళ్లలోపే రిలయన్స్ రిటైల్ మార్కెట్ విలువ రెట్టింపైందని కంపెనీ ఛైర్మన్ ఇషా అంబానీ అన్నారు. 2020 సెప్టెంబర్లో రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్న విలువ ప్రస్తుతం రూ.8.28 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బడా బడా ఇన్వెస్టర్లు రిలయన్స్ రిటైల్ వైపు చూస్తున్నారని తెలిపారు. డిజిటల్, న్యూ కామర్స్ సేల్స్ రూ.50,000 కోట్లుగా ఉన్నాయి. నమోదిత కస్టమర్లు 25 కోట్లకు చేరుకున్నారు. 2023 ఆర్థిక ఏడాదిలో 78 కోట్ల మంది స్టోర్లను సందర్శించారని ఇషా అంబానీ అన్నారు.