Rice and Chicken Prices In India Consumers feel the Pinch of rising Chicken and Rice Prices : అన్నం, కోడి కూర! ప్రపంచంలోనే అత్యంత పాపులర్‌ ఫుడ్‌ కాంబినేషన్‌! కానీ నోరూరిన ప్రతిసారీ సామాన్యుడు తినలేకపోతున్నాడు. కొండెక్కుతున్న ద్రవ్యోల్బణమే ఇందుకు కారణం. ఒక వైపు చికెన్‌, మరోవైపు బియ్యం ధరల పెరుగుదలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.


ఉన్నట్టుండి కోడికూర ధర ఐదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. ఎండలు, వడగాల్పుల వల్ల భారీ స్థాయిలో కోళ్లు చనిపోవడం ఇందుకు ఒక కారణం. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి సరఫరా ఆగిపోవడంతో మక్కజొన్న దాణా ధర 80 శాతం పెరగడం మరో రీజన్‌. అందుకే గతేడాదితో పోలిస్తే ఈ వేసవిలో చికెన్‌ ధర 33 శాతం ఎక్కువైంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ.280-300 వరకు ఉంటోంది.


సోయాబీన్‌ పంట చేతికొస్తే అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో కోడికూర ధరలు తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'ఫార్మ్‌గేట్‌ స్థాయిలో కోడికూర ధర కిలో రూ.120గా ఉంది. ఐదేళ్ల క్రితం ఎండాకాలంలో రిటైల్‌ స్థాయిలో ఇదే ధర ఉండేది. ఈ వేసవిలో వడగాల్పుల వల్ల చాలా కోళ్లు చనిపోయాయి. ఫలితంగా సరఫరా తగ్గి ధర పెరిగింది' అని మహారాష్ట్ర పౌల్ట్రీ ఫార్మర్స్‌, బ్రీడర్స్‌ సంఘం అధ్యక్షుడు వసంత్‌ కుమార్‌ శెట్టి ఎకనామిక్‌ టైమ్స్‌కు చెప్పారు.


ప్రస్తుతం మన దేశపు కోడి మాంసం ఉత్పత్తి ఏటా 4.3-4.5 మిలియన్‌ టన్నులు ఉండగా 2023కు దీనిని 6.3 మిలియన్‌ టన్నులకు పెంచాలని పరిశ్రమ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. జులై నుంచి చికెన్‌ ధర కాస్త తగ్గుముఖం పడుతుందని, సోయాబీన్‌ పంట రాగానే మరింత తగ్గుతుందని వారు ధీమాగా ఉన్నారు.


ఆ మధ్య బియ్యం ధరలు హడలెత్తించాయి. ఈ మధ్యే కాస్త తగ్గాయి. తమ అవసరాలు తీర్చుకొనేందుకు ప్రైవేటు ట్రేడర్ల ద్వారా బంగ్లాదేశ్‌ బియ్యం దిగుమతి చేసుకుంటుదన్న వార్తలు రావడంతో రెండు వారాల్లోనే మళ్లీ 9 శాతం పెరిగాయి.


'ప్రపంచంలో అత్యధికంగా వరి పండించే మూడో దేశం బంగ్లాదేశ్‌. వరదలు, కరవులు వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్‌ నుంచి బియ్యం దిగుమతి చేసుకుంటుంది. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరగడంతో బంగ్లాదేశ్‌పై ఒత్తిడి నెలకొంది. అందుకే బియ్యం దిగుమతి చేసుకోవాలని ఆలోచిస్తోంది. దీంతో బాస్మతీ యేతర బియ్యం ధరలు ఒక్క వారంలోనే 9 శాతం పెరిగాయి' అని తిరుపతి అగ్రిట్రేడ్‌ సీఈవో సూరజ్‌ అగర్వాల్‌ తెలిపారు.