Inflation Rate Drop: ఓవైపు చమురు, గ్యాస్‌ రేట్ల బాదుడు, మరోవైపు బ్యాంక్‌ రుణాల మీద వడ్డీ రేట్ల పెంపు మధ్య నలిగి పోతున్న సామాన్యుడికి కాస్త తెరిపినిచ్చే వార్త వచ్చింది. దేశంలో ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం కొద్దిగా దిగి వచ్చింది. 


తగ్గిన చిల్లర ద్రవ్యోల్బణం
వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) అక్టోబర్‌ నెలలో 6.77 శాతానికి పడిపోయింది. అంతకుముందు నెల అయిన సెప్టెంబర్‌లో నమోదైన 7.41 శాతం నుంచి తగ్గింది.  ఆహార పదార్థాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సోమవారం నాడు ఈ వివరాలను విడుదల చేసింది.


రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ తగ్గడమైతే తగ్గింది కానీ, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న కంఫర్ట్ లెవెల్ కంటే ఎక్కువగానే ఉంది. 2-6 శాతాన్ని RBI కంఫర్ట్‌ లెవల్‌గా RBI చూస్తోంది. వరుసగా 10వ నెలలోనూ 6 శాతం (కంఫర్ట్ లెవెల్) పైనే చిల్లర ద్రవ్యోల్బణం నమోదైంది. అంటే, ఈ ఏడాది ప్రారంభం (జనవరి) నుంచి 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగి రాలేదు.


నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఫుడ్‌ బాస్కెట్‌ ఇన్‌ఫ్లేషన్‌ సెప్టెంబర్‌లో 8.6 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 7.01 శాతానికి తగ్గింది. మొత్తం రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ను తగ్గించింది ఈ అంశమే. ఆహార బుట్టలో... కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. గోధుమలు, ఇతర పప్పు ధాన్యాల రేట్లు పెరిగాయి. ఉక్రెయిన్‌ నుంచి గోధుమలు ఎగుమతులు లేనందున ప్రపంచవ్యాప్తంగా గోధుమల ధరలు పెరుగుతున్నాయి.


గత ఏడాది అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.48 శాతంగా ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో 6.77 శాతానికి చేరింది. ఏడాది వ్యవధిలో ధరల్లో విపరీత పెరుగుదలకు ఇది గుర్తు. 


రుణాల మీద వడ్డీ రేట్లను ఎంత పెంచాలి అన్న అంశాన్ని నిర్ణయించే కీలకాశం ద్రవ్యోల్బణమే. తన తదుపరి ద్రవ్య విధాన సమావేశంలో, ద్రవ్యోల్బణం లెక్కల ఆధారంగా రెపో రేటు మీద RBI నిర్ణయం తీసుకుంటుంది.


టోకు ధరల ద్రవ్యోల్బణంలోనూ ఊరట
ధరల సూచీ (Wholesale Price Index - WPI) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా ఈ ఏడాది అక్టోబర్‌లో దిగి వచ్చింది. ఆహారం, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు శాంతించడంతో 19 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. 2022 అక్టోబర్‌లో 8.39 శాతంగా నమోదైంది. 2021 అక్టోబరులో ఇది 13.83 శాతంగా ఉంది. జనానికి ఇది ఊరట ఇచ్చే అంశం. వడ్డీ రేట్ల పెంపులో RBI దూకుడు తగ్గుతుంది.


వరుసగా ఐదో నెల కూడా తగ్గుతూ వచ్చిన టోకు ధరల ద్రవ్యోల్బణం, ఏడాదిన్నర తర్వాత సింగిల్‌ డిజిట్‌కు చేరింది. 2021 మార్చిలో 7.89 శాతంగా ఉన్న WPI, అక్కడి నుంచి పెరుగుతూ వెళ్లింది. 18 నెలల పాటు రెండంకెల స్థాయిలో కొనసాగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 10.79 శాతంగా నమోదైంది.