Sania Shoaib Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట విడిపోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారి విడాకులు ఖరారయ్యాయని.. చట్ట పరమైన సమస్యలు పరిష్కరించుకుని త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని వార్తలు వచ్చాయి. వారి సన్నిహితులు సైతం ఈ విషయం చెప్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇవి కేవలం ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే సానియా- షోయబ్ కలిసి ఒక టీవీ షో చేయనుండడమే దీనికి కారణం.
షోయబ్ మాలిక్ పాక్ నటి అయోషా ఒమర్ తో సన్నిహితంగా ఉన్నారని.. అందుకే సానియా అతనితో విడాకులు కోరుకుంటోందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. విడాకుల ప్రక్రియ తుది దశకు వచ్చిందని.. ఇక అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమని వారి సన్నిహితులు చెప్పినట్లుగా వార్తలు హల్ చల్ చేాశాయి. ఇప్పుడవన్నీ ఊహాగానాలేనా అనే అనుమానం కలుగుతోంది. పాకిస్థాన్ కు చెందిన ఉర్దూ ఓటీటీ వేదిక ఉర్దూఫ్లిక్స్ కోసం ఈ జంట 'ది మీర్జా మాలిక్ షో' అనే టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించి సానియా, షోయబ్ భుజం మీద చేయి వేసి దిగిన ఫొటోను ఉర్దూఫ్లిక్స్ పోస్టు చేసింది. ఈ షో త్వరలోనే ప్రసారం అవుతుందని సదరు ఓటీటీ ప్రకటించింది.
విడాకుల వ్యవహారాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ విచిత్రంగా ఇప్పుడు నెటిజన్లు ఈ జంటను విమర్శిస్తున్నారు. ఈ దంపతులు ప్రచారం కోసమే విడాకుల నాటకాలు ఆడుతున్నారంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ షో షూటింగ్ గతంలోనే జరిగి ఉంటుందని.. ప్రసారానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే విడాకుల ప్రకటన వాయిదా వేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం విడాకులపై ఈ జంట అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉండొచ్చని మరికొంతమంది అంటున్నారు.
పోస్టులతో అనుమానాలు
సానియా, షోయబ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాబు పుట్టినరోజు సందర్భంగా వారివురురూ వారి సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుల కారణంగా వారి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలిసింది.
పాకిస్థాన్ ప్రముఖ నటి అయేషా ఒమర్ తో షోయబ్ మాలిక్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు గత కొన్ని నెలలుగా కలిసి కనిపిస్తున్నారు. అలాగే ఒక పత్రిక కోసం స్విమ్మింగ్ పూల్ లో షోయబ్, అయేషా కలిసి బోల్డ్ ఫొటో షూట్ నిర్వహించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె కారణంగానే సానియా, షోయబ్ లు విడాకుల నిర్ణయం తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.