Retail Inflation Data For February 2024: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (CPI Inflation) స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వరుసగా ఆరో నెల కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ అప్పర్‌ టాలరెన్స్‌ బ్యాండ్‌ (RBI tolerance range) అయిన 6% లోపులోనే నమోదైంది. అయినప్పటికీ, దేశంలో ఆహార పదార్థాల ధరల మంట మాత్రం చల్లారలేదు.


పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ, 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన 'వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index‌) ఆధారిత ద్రవ్యోల్బణం' డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.09 శాతంగా నమోదైంది, ఇది 4 నెలల కనిష్ట స్థాయి. అంతకుముందు, జనవరి నెలలో ద్రవ్యోల్బణం 5.10 శాతంగా ఉంది. ఏడాది క్రితం, 2023 ఫిబ్రవరిలో 6.44 శాతంగా నమోదైంది. 2023 డిసెంబర్‌లో ఇది 5.69 శాతంగా ఉంది.


దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, కీలకమైన ఆహార పదార్థాల ధరలు మాత్రం ఇప్పటికీ సామాన్య జనాన్ని భయపెడుతూనే ఉన్నాయి. ఇది ప్రజలకే కాదు, దేశంలో వడ్డీ రేట్లను నిర్ణయించే ఆర్‌బీఐకి కూడా ఆందోళన కలిగించే విషయమే. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం (Food Inflation Rate in February 2024) జనవరిలోని 8.30 శాతం నుంచి ఫిబ్రవరిలో 8.66 శాతానికి చేరుకుంది. 2023 ఫిబ్రవరిలో ఇది 5.95 శాతంగా ఉంది. 


30 శాతం పైకి చేరిన కూరగాయల ద్రవ్యోల్బణం (Vegetable Inflation)     
కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం, చేపలు, పాల ధరలు పెరగడం వల్ల ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. పళ్లు, నూనెలు & కొవ్వులు, పప్పుల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం 2024 ఫిబ్రవరిలో 30.25 శాతంగా ఉంది, జనవరిలోని 27.03 శాతం నుంచి ఇది పెరిగింది. పప్పు దినుసుల ద్రవ్యోల్బణం (Inflation of pulses) ఫిబ్రవరి 18.90 శాతంగా నమోదైంది, జనవరిలో ఇది 19.54 శాతంగా ఉంది. ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.60 శాతంగా నమోదైంది, జనవరిలో ఇది 7.83 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం 13.51 శాతంగా నమోదైంది, జనవరిలో ఇది 16.36 శాతంగా ఉంది. పండ్ల ద్రవ్యోల్బణం ‌(Fruits inflation)  4.83 శాతం, చక్కెర ద్రవ్యోల్బణం 7.48 శాతంగా ఉంది.


2024 ఫిబ్రవరిలో, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటు ద్రవ్యోల్బణం 5.34 శాతంగా నమోదైతే, పట్టణ ప్రాంతాల్లో 4.78 శాతంగా లెక్క తేలింది.


ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి తీసుకురావడమే లక్ష్యం    
కొన్ని రోజుల క్రితం మాట్లాడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, 2024 జనవరి నెలలో ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రపంచ స్థాయిలో భౌగోళిక రాజకీయ అనిశ్చితితో పాటు, సరఫరా గొలుసు కూడా సవాలుగా మారిందన్నారు. జనవరిలో ద్రవ్యోల్బణం రేటు 5.10 శాతానికి తగ్గినప్పటికీ, ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతానికి చాలా దూరంగా ఉందని వెల్లడించారు. దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి తీసుకురావడమే కేంద్ర బ్యాంక్‌ లక్ష్యంగా వివరించారు.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' ITC, JG Chem, Vedanta, HG Infra