Reliance - Alia Deal: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), తన రిటైల్ బిజినెస్‌ను చాలా దూకుడుగా విస్తరిస్తోంది. ఆర్గానిక్‌గా ఎదగడం కంటే ఇన్‌-ఆర్గానిక్‌ మార్గం మీద ఎక్కువగా ఫోకస్‌ పెట్టిన RIL, కంటికి కనిపించిన కంపెనీలను కొనేస్తోంది. రిలయన్స్ తాజా రిటైల్ డీల్, బాలీవుడ్‌ నటి అలియా భట్‌తో జరిగింది.


అలియా భట్‌కు 'ఎడ్-ఎ-మమ్మా' (Ed-a-Mamma) పేరిట  పిల్లల, గర్భిణుల దుస్తుల బ్రాండ్‌ ఉంది. 2-12 ఏళ్ల పిల్లల క్లోథింగ్‌ బ్రాండ్‌గా 2020లో అలియా దీనిని స్టార్ట్‌ చేశారు. మొదట ఆన్‌లైన్‌లోనే సేల్స్‌ చేశారు. ఎడ్-ఎ-మమ్మా దుస్తులకు ఆదరణ పెరగడంతో ఆ తర్వాత రిటైల్‌ స్టోర్స్‌ కూడా ఏర్పాటు చేసి, ఆఫ్‌లైన్‌లోనూ అమ్మకాలు చేస్తున్నారు. ఇదే బ్రాండ్‌ కింద, గర్భిణుల కోసమూ గత ఏడాది దుస్తుల అమ్మకాలు ప్రారంభించారు. ఈ కంపెనీలో మెజారిటీ వాటాను రిలయన్స్‌ కొనుగోలు చేసింది.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ విభాగమైన 'రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్' (RRVL), ఎడ్-ఎ-మమ్మాలో 51% వాటా కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఈ బ్రాండ్‌, జాయింట్ వెంచర్‌గా కొనసాగడానికి ఒప్పందం కుదిరింది.


డీల్ విలువ
ఈ డీల్ ఎంతకు కుదిరిందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. గత జులైలో ఈ డీల్‌పై వార్తలు వచ్చినప్పుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 300 నుంచి 350 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకోవచ్చని ఆ వార్తల్లో మీడియా రిపోర్ట్‌ చేసింది.


కొత్త కేటగిరీలు
తమ భాగస్వామ్యంతో... వ్యక్తిగత సంరక్షణ (personal care), బేబీ ఫర్నిచర్, పిల్లల కథల పుస్తకాలు, యానిమేటెడ్ సిరీస్ వంటి కొత్త కేటగిరీలను కూడా ఈ బ్రాండ్‌ కింద తీసుకువస్తామని RRVL ప్రకటించింది. 


“అలియా భట్ తీసుకొచ్చిన ప్రత్యేకమైన డిజైన్, బలమైన ఉద్దేశ్యంతో నడిపించే బ్రాండ్‌ మాకు నచ్చింది. పర్యావరణ హితమైన ఉత్పత్తి పద్ధతులు పాటిస్తున్నారు. ఫ్యాషన్ పరిశ్రమలో బాధ్యతాయుతమైన భవిష్యత్తును పెంచాలన్న రిలయన్స్ విజన్‌కు ఇది అనుకూలంగా ఉంది" - రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ


ఎడ్-ఎ-మమ్మా, తన దుస్తుల కోసం ప్లాస్టిక్ బటన్స్‌ను ఉపయోగించడం లేదు. 


“ఇషా, నేను కలిసి తల్లులు ఏం కావాలో చర్చించాం. ఇప్పటికే ఎడ్-ఎ-మమ్మాలో మేం ఏం చేస్తున్నామో, ఇంకా ఏం చేయడానికి అవకాశాలు ఉన్నాయో నేను ఆమెకు చెప్పాను. రిలయన్స్ సప్లై చెయిన్‌, రిటైల్‌, మార్కెటింగ్‌ బలాలను ఉపయోగించుకుని ఎడ్-ఎ-మమ్మాను మరింత ముందుకు తీసుకువెళ్దామని ఇషా చెప్పారు. ఈ జాయింట్ వెంచర్‌తో, ఎడ్-ఎ-మమ్మాను ఇంకా చాలా మంది పిల్లలు, తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లడానికి నేను ఎదురుచూస్తున్నా" - అలియా భట్


బలమైన నెట్‌వర్క్‌
RRVL, తన అనుబంధ కంపెనీల ద్వారా కిరాణా, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్‌, ఫార్మా రంగాల్లో 18,500 స్టోర్లు & డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో సంపూర్ణ ఓమ్ని-ఛానల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. Gap, Pret-a-Manger వంటి బ్రాండ్స్‌ను భారత్‌లో అమ్మడానికి రైట్స్‌ కూడా పొందింది. ఆన్‌లైన్ ఫ్యాషన్ పోర్టల్ Ajio.comని కూడా RRVL నిర్వహిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: జియో వచ్చాక దేశం ఇంతలా మారిందా?, ఈ విషయాలు తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial