Jio Financial Services Entry In To MF Industry: మ్యూచువల్ ఫండ్‌ ‍‌(MF) ఇండస్ట్రీని షేక్‌ చేసేందుకు, రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) సిద్ధంగా ఉన్నారు. MFsలోకి గ్రాండ్‌ ఎంట్రీ కోసం, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి అనుమతి తెచ్చుకున్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి ప్రవేశించేందుకు జియో-బ్లాక్‌రాక్‌ భాగస్వామ్యానికి సెబీ ఆమోదం తెలిపింది. ముకేష్ అంబానీ నేతృత్వంలో నడిచే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంట్రీతో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పోటీ పెరగొచ్చు. ఇండియన్‌ మ్యూచువల్ ఫండ్‌ ఇండస్ట్రీలో ప్రస్తుతం రూ.66 లక్షల కోట్ల (AUM) ఆస్తులున్నాయి. 


చేతులు కలిపిన దిగ్గజాలు
బ్లాక్‌రాక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ ‍(‌Blackrock Financial Management) జాయింట్ వెంచర్‌తో, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి అక్టోబర్ 03న సూత్రప్రాయంగా ఆమోదం ‍‌(in-principle nod  పొందినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ శుక్రవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అవసరమైన అన్ని పత్రాలు అందించిన తర్వాత సెబీ తుది ఆమోదం ఇస్తుంది. ఇండియన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌-బ్లాక్‌రాక్ కంపెనీలు 2023 జులైలో చేతులు కలిపాయి. అదే ఏడాది అక్టోబర్‌లో సెబీకి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో సుమారు 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రెండు కంపెనీలు ప్రకటించాయి. ఈ జాయింట్ వెంచర్‌లో రెండు కంపెనీలు తలో 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాయి.  


చవకైన & స్థిరమైన పెట్టుబడి ఎంపికలు
ఇండస్ట్రీలో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పోలిస్తే, మరింత తక్కువ ఖర్చుతో, మంచి రాబడిని ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్‌ తీసుకొచ్చేందుకు ఈ రెండు కంపెనీలు ప్లాన్‌ చేస్తున్నాయి.


"ఈ ఆమోదం లభించడం మాకు సంతోషంగా ఉంది. భారతదేశంలోని కోట్లాది మందికి చవకైన & స్థిరమైన పెట్టుబడి ఎంపికలను అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి, మేము భారతదేశాన్ని పొదుపు దేశం నుంచి పెట్టుబడి దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తాం. భారతదేశంలో కొత్త రకాల ఆర్థిక ఉత్పత్తులను ప్రవేశపెడతాం. పెట్టుబడి ద్వారా ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. మూలధనాన్ని కూడా పెంచుకోవచ్చు. సంపద నిర్వహణ, స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ - బ్లాక్‌రాక్‌ కలిసి పని చేస్తాయి" - బ్లాక్‌రాక్ ఇంటర్నేషనల్ హెడ్ రాచెల్ లార్డ్


రిలయన్స్‌ గ్రూప్‌లోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, తన కస్టమర్లకు చాలా రకాల ఆర్థిక సేవలు అందిస్తోంది. ఇంతకు ముందు ఈ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా ఉండేది. 2023 ఆగస్టులో, స్వతంత్ర్య సంస్థగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్స్‌కు (Jio Finance) ఆర్‌బీఐ నుంచి NBFC లైసెన్స్‌ ఉంది. దీని మరో అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్ (Jio Payments Bank). జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. NBFC నుంచి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా (CIC) మారడానికి RBI నుంచి ఆమోదం పొందింది. 


మరో ఆసక్తికర కథనం: భారంగా మారుతున్న క్రెడిట్‌ కార్డ్‌ను ఇలా క్లోజ్ చేయండి!