How To Close Your Credit Card: ఇప్పుడు, చాలామంది పర్సుల్లో క్రెడిట్‌ కార్డ్‌లు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ కార్డ్‌లు ఉన్నాయి. స్థిరమైన సంపాదన లేని వాళ్లు కూడా క్రెడిట్‌ కార్డ్‌ను మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. అయితే... వివిధ కారణాల వల్ల క్రెడిట్‌ కార్డులు మెడకు గుదిబండల్లా మారుతున్నాయి. దీంతో, తమ క్రెడిట్ కార్డ్‌ లేదా కార్డ్‌లను క్లోజ్‌ చేయాలని కార్డ్‌హోల్డర్లు కోరుకుంటున్నారు. 


సరిపడా ఆదాయం లేనివాళ్లు క్రెడిట్‌ బిల్లులు కట్టలేకపోతున్నారు. మరికొంతమంది, కొన్ని క్రెడిట్ కార్డులు పొందిన తర్వాత, వాటిపై చాలా రకాల ఛార్జీలు వడ్డిస్తున్నారని అర్ధం చేసుకుంటున్నారు. తమ దగ్గరున్న కార్డ్‌/ కార్డ్‌లతో ప్రయోజనం చాలా తక్కువగా ఉందని ఇంకొంతమంది రియలైజ్‌ అవుతున్నారు. ఇలాంటి కారణాలతో క్రెడిట్‌ కార్డ్‌లను వదిలించుకోవాలనుకుంటున్నారు. జేబులో కుంపటి లాంటి క్రెడిట్ కార్డును క్లోజ్‌ చేయడమే సరైన నిర్ణయం. లేకపోతే, డబ్బు నష్టంతో పాటు మెంటల్‌ టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. 


క్రెడిట్ కార్డ్‌ను ఎలా క్లోజ్‌ చేయాలి? (How to close your credit card?)


మీ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్‌ చేసే ముందు దాని బకాయిలన్నింటినీ కచ్చితంగా చెల్లించాలి. మీరు పైసల్లో బాకీ ఉన్నా సరే, మీ బకాయి సంపూర్ణంగా చెల్లించేవరగకు మీ క్రెడిట్ కార్డ్ క్లోజ్‌ కాదు.


చాలా మంది తమ క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేసుకోవాలనే తొందరలో రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడం మర్చిపోతుంటారు. మీరు చాలా డబ్బు ఖర్చు చేయడం వల్ల ఆ రివార్డ్ పాయింట్‌లు సంపాదించారు. కాబట్టి, మీ క్రెడిట్‌ కార్డ్‌ను మూసేసేముందే రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడానికి ఏ మాత్రం మొహమాటపడొద్దు & వెనుకాడొద్దు.


చాలామంది.. బీమా ప్రీమియం, OTT మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌, కరెంట్‌ బిల్లులు, ఇంటి అద్దె, వాలెట్ల టాపప్‌ వంటి రిపీట్‌ అయ్యే చెల్లింపుల (Recurring payments) కోసం క్రెడిట్‌ కార్డ్‌ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చి ఉంటారు. కార్డ్‌ను క్లోజ్‌ చేసే ముందు, అలాంటి ఇన్‌స్ట్రక్షన్లు లేకుండా చూసుకోవాలి. లేదంటే, కార్డ్ మూసేసిన తర్వాత మీ చెల్లింపు ఆగిపోవచ్చు & ఇబ్బందులు ఎదురు కావచ్చు.


ఇవన్నీ పూర్తయిన తర్వాత, మీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌కు కాల్ చేయాలి. మీ కార్డును మూసివేయాలనుకుంటున్న విషయాన్ని వారికి చెప్పాలి. క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్‌ చేస్తున్న కారణాన్ని బ్యాంక్ అడగవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌తో మీకున్న ఇబ్బందిని వారికి చెప్పండి. ఆ తర్వాత, క్రెడిట్ కార్డ్‌ను మూసివేయమని మీ నుంచి రిక్వెస్ట్‌ను బ్యాంక్‌ తీసుకుంటుంది. బ్యాంక్ మిమ్మల్ని ఇ-మెయిల్ పంపమని అడగొచ్చు లేదా కార్డ్‌ను కట్ చేసి దాని ఫోటోను ఇ-మెయిల్ చేయమని కూడా కొరవచ్చు. అలాంటి సందర్భంలో బ్యాంక్‌ కోరినట్లు చేయండి.


మీ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్‌ చేశాక ఆ కార్డ్‌ను అలాగే డస్ట్‌బిన్‌లో పడేయకండి. కార్డ్‌ క్లోజ్‌ చేసిన తర్వాత దానిని అడ్డంగా కాకుండా, కాస్త మూలగా కట్‌ చేయండి. లేదా, నాలుగైదు ముక్కలు చేయండి. కార్డ్‌లోని చిప్‌ను కూడా కత్తిరించండి. మీ కార్డ్‌ను కట్‌ చేయకుండా పడేస్తే, అది తప్పుడు చేతుల్లోకి వెళితే, మీ సమాచారాన్ని వాళ్లు దొంగిలించి వాడుకోవచ్చు. లేదా, మీ పేరు మీద మోసం చేసే అవకాశం ఉంది. మీ వివరాలతో అసాంఘిక కార్యకలాపాలు చేసే ఛాన్స్‌ కూడా ఉంటుంది. కాబట్టి, కార్డును కత్తిరించిన తర్వాతే డస్ట్‌బిన్‌లో పడేయండి.


మరో ఆసక్తికర కథనం: కేఆర్‌ఎన్‌ హీట్ ఎక్స్ఛేంజర్ సూపర్ డూపర్ ఎంట్రీ - ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్‌