Mukesh Ambani Death Threat: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఓనర్‌ ముకేష్ అంబానీకి మళ్లీ బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. వారం రోజుల్లో వచ్చిన మూడో మరణ బెదిరింపు ఇది. హెచ్చరిక ఈ-మెయిల్స్‌ పంపుతున్న వ్యక్తి ఈసారి ఏకంగా 400 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. దీనికి ముందు, ముకేష్ అంబానీకి రెండు సార్లు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. తొలిసారిగా ముఖేష్ అంబానీ నుంచి రూ.20 కోట్లు డిమాండ్ చేయగా, రెండోసారి రూ.200 కోట్లు డిమాండ్ చేశారు. 


మూడో ఈ-మెయిల్‌ సోమవారం వచ్చింది. గత రెండు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చిన అదే యూజర్‌ ఐడీ నుండి మూడో బెదిరింపు కూడా వచ్చింది. ముకేష్‌ అంబానీని చంపకుండా వదిలి పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆగంతుకుడు డిమాండ్‌ చేశాడు.


తొలి రెండు ఈ-మెయిల్స్‌ ఎవరు పంపారో పోలీసులు ఇంకా కనిపెట్టనే లేదు, ఇంతలోనే మూడో బెదిరింపు కూడా వచ్చింది. ఈ-మెయిల్స్‌ పంపినవాళ్ల ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. బెల్జియన్ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ కంపెనీ (VPN) నుంచి పంపిన బెదిరింపు మెయిల్ గురించి సమాచారం పొందడానికి పోలీసులు ఇంటర్‌పోల్ సాయం కోరారు. దీని IP అడ్రస్‌ బెల్జియంలో ఉందని, ఈ మెయిల్ shadabkhan@mailfence.com ఐడీ నుంచి వచ్చిందని సమాచారం. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిది బెల్జియం కాకుండా వేరే దేశం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌ను తప్పుదారి పట్టించడానికి బెల్జియన్ VPNని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.


పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేరు
హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్‌ చేసిన ప్రకారం, 'మీ భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉన్నా పర్వాలేదు. ముకేష్‌ను మట్టుబెట్టడానికి ఒక్క షూటర్ సరిపోతాడు. పోలీసులు నన్ను ట్రాక్ చేయలేరు, అరెస్ట్ చేయలేరు' అని మూడో ఈ-మెయిల్‌లో అగంతకుడు వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ బెదిరింపు తర్వాత, సౌత్ ముంబైలోని అంబానీ నివాసానికి ముంబై పోలీసులు భద్రతను పెంచారు.


అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ 387, 506 (2) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 27న ముకేశ్ అంబానీకి మొదటి బెదిరింపు మెయిల్ రాగా, ఆ మరుసటి రోజు రూ. 200 కోట్లు డిమాండ్ చేస్తూ రెండో మెయిల్ వచ్చింది.


గతంలోనూ చాలా బెదిరింపులు
ముకేష్‌ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా గతంలో బెదిరింపులు వచ్చాయి. అంబానీ నివాసం ఆంటిలియాను పేల్చేస్తామని, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని పేల్చేస్తానని దుండగులు బెదిరించగా, పోలీసులు వాళ్లను అరెస్ట్‌ చేశారు.


2021లో, అంబానీ నివాసానికి అతి సమీపంలో ఓ కారులో పేలుడు పదార్థాలు దొరికాయి. జెలిటిన్ స్టిక్స్‌తో పాటు, ఇది ట్రైలర్‌ మాత్రమే అంటూ ఓ లెటర్‌ కూడా దొరికింది. ఆ కేసులో, ఒక ముంబై పోలీసు అధికారి అరెస్టు కావడంలో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అంబానీ భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌లో ఉప్పెన - 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌, 19200 దాటిన నిఫ్టీ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial