Reliance Capital Second Round Auction: అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ కంపెనీ 'రిలయన్స్ క్యాపిటల్' వేలానికి సంబంధించి రెండో రౌండ్ బిడ్డింగ్ పూర్తయింది. రిలయన్స్ క్యాపిటల్‌ను దక్కించుకోవడానికి ఈ రౌండ్‌లోనూ చాలా కంపెనీలు రేసులో పాల్గొన్నాయి. అయితే హిందూజా గ్రూప్‌నకు చెందిన ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IndusInd International Holdings Ltd - IIHL), రూ. 9,650 కోట్లను ఆఫర్ చేసింది. దీంతో వేలంలో పాల్గొన్న ఏకైక, అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది.
రెండో రౌండ్ వేలంలో మరో రెండు కంపెనీలు కూడా పాల్గొన్నా అవి బిడ్ సమర్పించలేదు. హిందూజా గ్రూప్ కంపెనీతో పాటు టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఓక్‌ట్రీ క్యాపిటల్ కూడా ఈ రేసులో పాల్గొన్నాయి. సెకండ్ రౌండ్‌లో తాము కూడా ఉంటామని గతంలోనే ఇవి రెండూ ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు బిడ్లను సమర్పించలేదు.
టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంటే వెయ్యి కోట్ల ఎక్కువ ఆఫర్
గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన తొలి రౌండ్ వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (Torrent Investments) హైయస్ట్ బిడ్డర్‌గా నిలిచింది, రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు కోసం రూ. 8,640 కోట్లను ఆఫర్ చేసింది. అయితే, తాజా రెండో రౌండ్‌లో హిందూజా గ్రూప్ కంపెనీ IIHL అంతకంటే ఎక్కువగా రూ. 9,650 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తొలి రౌండ్ వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫర్ చేసిన మొత్తం కంటే, రెండో రౌండ్‌లో హిందూజా గ్రూప్ ఆఫర్ చేసిన మొత్తం రూ. 1,000 కోట్లు ఎక్కువ.
ఒక జాతీయ మీడియా కథనం ప్రకారం, టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ బుధవారం (26 ఏప్రిల్ 2027) నమూనా వేలం డ్రిల్‌లో పాల్గొంది, వేలానికి ముందు చర్చలలో కూడా పాల్గొంది. అసలైన వేలంలో బిడ్ సమర్పించలేదు. రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు, ఈ వేలంలో పాల్గొనే కంపెనీలకు రూ. 9,500 కోట్ల పరిమితిని విధించారు. ముందస్తు నగదు చెల్లింపుగా కనీసం రూ. 8,000 కోట్లు ఉండాలని షరతు పెట్టారు. రూ. 9,650 కోట్ల IIHL బిడ్ ముందస్తు నగదు బిడ్ అని కంపెనీ వర్గాలు తెలిపాయి.
మొత్తం పది వేల కోట్ల రికవరీ
తొలి రౌండ్‌లో రూ. 8,110 కోట్లకు బిడ్ వేసిన ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్, రెండో రౌండ్‌లో ఆ మొత్తాన్ని రూ. 9,650 కోట్లకు పెంచింది. దీనికి కౌంటర్ బిడ్‌ను ఎవరూ సమర్పించలేదు. ఈ కారణంగా అత్యధిక, ఏకైక బిడ్డర్‌గా నిలిచింది. హిందూజా గ్రూప్ ఆఫర్ చేసిన రూ. 9,650 కోట్ల మొత్తం.. రిలయన్స్ క్యాపిటల్‌కు రుణదాతలు ఇచ్చిన రుణ మొత్తంలో 41 శాతం రికవరీకి సమానం.
అనిల్ అంబానీ స్థాపించిన ఆర్థిక సేవల సంస్థ రిలయన్స్ క్యాపిటల్‌లో దాదాపు రూ. 400 కోట్ల నగదు నిల్వ ఉంది. హిందూజా గ్రూప్ ఆఫర్ చేసిన రూ. 9,650 కోట్లను కూడా దీనికి జోడిస్తే, రుణదాతల రికవరీ రూ. 10,000 కోట్లకు పైనే ఉంటుంది. అయినా, లిక్విడేషన్ వాల్యూ కంటే రియలైజేషన్ వాల్యూ ఇంకా తక్కువగానే ఉంది.