Rekha Jhunjhunwala portfolio: ఇవాళ (సోమవారం, 06 మార్చి 2023) స్టాక్‌ మార్కెట్‌ గ్యాప్‌-అప్‌లో ఓపెన్‌ అయింది, జోరు మీద ఉంది. గత వారంలో శుక్రవారం నాడు (03 మార్చి 2023) కూడా స్టాక్ మార్కెట్ పుంజుకుంది, ఆ వారాంతపు సెషన్‌లో మెజారిటీ సూచీలు భారీ ర్యాలీని నమోదు చేశాయి. దీంతో, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్లు, ఎనలిస్ట్‌లు ఊపిరి పీల్చుకున్నారు. 


ఇతర ఇన్వెస్టర్ల మాదిరిగానే, ఏస్ ఇన్వెస్టర్ రేఖ ఝున్‌ఝున్‌వాలా (దివంగత రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా భార్య) కూడా భారీ లాభాన్ని మూటగట్టుకున్నారు. ఆ రోజు రేఖ ఝున్‌ఝున్‌వాలా నికర విలువ (Rekha Jhunjhunwala net worth) ఒక రేంజ్‌లో పెరిగింది. ఆమె పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్‌లో, కేవలం మూడు టాటా గ్రూప్ స్టాక్‌లు - టైటాన్ కంపెనీ (titan Company), టాటా మోటార్స్ ‍‌(Tata Motors), ఇండియన్ హోటల్స్ కంపెనీ (Indian Hotels Company) నుంచే సుమారు ₹240 కోట్లు సంపాదించారు.


టైటన్ షేర్లలో..
టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం... 2023 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో రేఖ ఝున్‌ఝున్‌వాలా 4,58,95,970 టైటన్ షేర్లను కలిగి ఉన్నారు, ఇది టాటా గ్రూప్ కంపెనీ మొత్తం పెయిడప్‌ క్యాపిటల్‌లో 5.17 శాతానికి సమానం. శుక్రవారం టైటన్ ఒక్కో షేరు ధర ₹41.05 పెరిగింది. ఈ కారణంగా, టైటాన్ స్టాక్‌లో రేఖ జున్‌జున్‌వాలా నికర విలువ ₹188.50 కోట్లు పెరిగింది.


టాటా మోటార్స్‌లో.. 
Q3FY23లో టాటా మోటార్స్ షేర్‌ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం... రేఖ ఝున్‌ఝున్‌వాలాకు ఈ కంపెనీలో 5,22,56,000 షేర్‌లు ఉన్నాయి, ఇది కంపెనీ మొత్తం పెయిడప్‌ క్యాపిటల్‌లో 1.57 శాతానికి సమానం. శుక్రవారం మార్కెట్‌ డీల్స్ ముగిసిన తర్వాత, టాటా మోటార్స్ ఒక్కో షేరు ధర ₹7.40 పెరిగింది. ఈ ప్రకారం, గత వారాంతపు సెషన్‌లో రేఖ ఝున్‌ఝున్‌వాలా నికర విలువ సుమారు ₹38.66 కోట్లు పెరిగింది.


ఇండియన్‌ హోటల్స్‌లో..
2023 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి, ఇండియన్ హోటల్స్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం... రేఖ ఝున్‌ఝున్‌వాలా ఈ కంపెనీలో 3,00,16,965 షేర్లు కలిగి ఉన్నారు. ఇది 2.11 శాతం వాటాకు సమానం. ఇండియన్ హోటల్స్ షేర్ ధర శుక్రవారం ఇంట్రాడేలో ₹3.85 లాభంతో ముగిసింది. ఈ లెక్కన, ఈ టాటా గ్రూప్ హాస్పిటాలిటీ స్టాక్‌లో ఒక్కో షేరుకు ₹3.85 పెరగడం వల్ల రేఖ ఝున్‌ఝున్‌వాలా నికర విలువ దాదాపు ₹11.55 కోట్లు పెరిగింది.


రేఖ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఈ మూడు టాటా గ్రూప్‌ స్టాక్స్‌ను (Tata group stocks) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, శుక్రవారం, రేఖ ఝున్‌ఝున్‌వాలా నికర విలువ సుమారు ₹240 కోట్లు పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.