Mumbai Stamp Duty: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై, మన దేశంలోనే అతి పెద్ద & ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్. ఈ బడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏప్రిల్ నెలలో కొత్త రికార్డును సృష్టించింది. ఈ నెల రోజుల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో డీల్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, స్టాంప్ డ్యూటీ వసూళ్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి.
తక్కువ రిజిస్ట్రేషన్లు, రికార్డ్ స్థాయి ఆదాయం
నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక (Night Frank India Report) ప్రకారం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఆస్తి రిజిస్ట్రేషన్లు 2023 ఏప్రిల్ నెలలో 10 శాతం క్షీణించి 10,514 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో 11,743 ఆస్తులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ప్రాంతం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihan mumbai Municipal Corporation) పరిధిలోకి వస్తుంది.
2023 ఏప్రిల్‌లో ముంబై నగరంలో ఆస్తుల రిజిస్టర్ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 900 కోట్లు ఆదాయం వచ్చిందని నైట్ ఫ్రాంక్ నివేదించింది. ఈ మొత్తం, ఏడాది క్రితం ఏప్రిల్ నెల కంటే 15 శాతం ఎక్కువ. అంటే, ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా, పన్ను రూపంలో వసూళ్లు మాత్రం పెరిగాయి. ఆస్తి రిజిస్ట్రేషన్ మీద స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది.
ఏప్రిల్‌లో, ముంబైలో స్టాంప్ డ్యూటీ రూపంలో వసూలు చేసిన మొత్తం, గత 10 సంవత్సరాల ఏప్రిల్ నెలల్లో అత్యధిక రాబడి.
ప్రీమియం ఇళ్లకు డిమాండ్ - అధిక వసూళ్లు
స్టాంప్ డ్యూటీ రేటు పెరగడం, ఖరీదైన ప్రాపర్టీ డీల్స్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని నైట్ ఫ్రాంక్ వివరించింది. నివేదికల ప్రకారం, అధిక విలువైన ఆస్తి ఒప్పందాల నుంచి అత్యధిక స్టాంప్ డ్యూటీ వచ్చింది. అంటే, వడ్డీ రేట్లు పెరిగినా ప్రీమియం హౌసింగ్ విభాగంలో జోరు కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ నెలలో, ప్రీమియం రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా, మధ్య తరగతి ఆదాయ గృహాల విభాగం కూడా ప్రభుత్వ ఖజానాకు చాలా డబ్బును ఆర్జించి పెట్టింది. అయితే, ఈ విభాగంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది.
గత పదేళ్ల గణాంకాలు
స్టాంప్ డ్యూటీ పెంపు, వడ్డీ రేట్ల నిరంతర పెరుగుదల, ఇళ్ల ధరల పెరుగుదల తర్వాత కూడా ముంబైలో ఇళ్లకు డిమాండ్ పెరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ చెప్పారు. 2013 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు, గత 10 సంవత్సరాల్లో ముంబైలో దాదాపు 8 లక్షల ఆస్తులు అమ్ముడయ్యాయి. వీటిలో 40 శాతం, అంటే దాదాపు 3.18 లక్షల ఆస్తులు 2020 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు చేతులు మారాయి. కేవలం, ఈ మూడేళ్ల కన్నా తక్కువ కాలంలోనే బలమైన అమ్మకాలు కనిపించాయి.
గత ఏడాది కాలంలో బూమ్
2020 సెప్టెంబర్ నుంచి, స్టాంప్ డ్యూటీకి సంబంధించి చాలా మార్పు వచ్చింది. నివేదికల ప్రకారం, స్టాంప్ డ్యూటీ గరిష్టంగా 6 శాతానికి చేరుకున్న తర్వాత కూడా, గత ఏడాది కాలంలో ముంబైలో ఆస్తుల విక్రయాలు విపరీతంగా జరిగాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ఈ మహా నగరంలో 1,28,427 ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి. గత 10 ఏళ్లలో జరిగిన మొత్తం ఆస్తి రిజిస్ట్రేషన్లలో ఇది దాదాపు 16 శాతానికి సమానం.