Housing Sales Data For Q1 2024: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగింది. మన దేశంలోని ఎనిమిది ప్రధాన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఇళ్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. ఆ 3 నెలల గృహ విక్రయాలు గత సంవత్సరం కంటే 9 శాతం పెరిగాయి. 2024 జనవరి - మార్చి మధ్య మొత్తం 86,345 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుబోయాయి. గత ఆరేళ్లలో, ఏ త్రైమాసికంలోనైనా ఇది రెండో అత్యధికం. 2023 అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్‌లో అత్యధికంగా హౌసింగ్ సేల్స్ జరిగాయి.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India), 2024 మొదటి త్రైమాసికంలో గృహ విక్రయాలకు సంబంధించిన డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, జనవరి-మార్చి మధ్య 8 పెద్ద నగరాల్లో మొత్తం 86,345 హౌసింగ్ యూనిట్లు అమ్ముడైతే... వాటిలో 23,743 ఇళ్ళు ఒక్క ముంబైలోనే చేతులు మారాయి. గత సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ.
కోటి రూపాయలు దాటిన ఇళ్లకు మహా డిమాండ్
2024 మొదటి త్రైమాసికంలో, ఈ 8 నగరాల్లో విక్రయించిన మొత్తం హౌసింగ్ యూనిట్లలో 40 శాతం ఇళ్ల ధర కోటి రూపాయల కంటే ఎక్కువ అని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 2024 మొదటి త్రైమాసికంలో విక్రయించిన 34,895 గృహాల రేటు రూ.1 కోటి పైన ఉంది. 2023 మొదటి త్రైమాసికంలో కంటే ఇది 51 శాతం ఎక్కువ.
రూ.కోటి పైగా విలువ కలిగిన ఇళ్ల అమ్మకాల్లో దిల్లీ NCR టాప్ ప్లేస్‌లో నిలిచింది. Q1 2024లో ఆ ప్రాంతంలో 10,558 యూనిట్లు అమ్ముడయ్యాయి. 7,401 యూనిట్ల సేల్స్‌తో ముంబయి రెండో స్థానంలో; 6,112 ఇళ్ల విక్రయాలతో హైదరాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి.
హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిన రేట్లు
నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగాయి. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి 13 శాతం మేర రేట్లు ప్రియమయ్యాయి. ముంబైలో 6 శాతం, బెంగళూరులో 9 శాతం, దిల్లీ NCRలో 5 శాతం, కోల్‌కతాలో 7 శాతం, పుణెలో 4 శాతం, చెన్నైలో 5 శాతం ధరలు పెరిగాయి. అహ్మదాబాద్‌లో అత్యల్పంగా 2 శాతం మాత్రం పెరిగాయి.
రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల
2024 మొదటి త్రైమాసికంలో, రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ధర కలిగిన ఇళ్లు 28,424 సేల్ అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 6 శాతం తగ్గాయి. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 10 శాతం క్షీణించాయి. 2023 మొదటి త్రైమాసికంలో 25,714 యూనిట్లు అమ్ముడుబోతే, 2024 అదే కాలంలో 23,026 యూనిట్లు అమ్ముడయ్యాయి.
గత తొమ్మిది త్రైమాసికాలుగా, రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం... ఇళ్ల ధరల పెరుగుదల, ఖరీదైన గృహ రుణాలు, మహమ్మారి ప్రభావం ఈ విభాగంపై చెక్కుచెదరకుండా ఉంది. అందువల్లే, రూ.50 లక్షల లోపున్న ఇళ్లకు ఎప్పటికప్పుడు డిమాండ్ తగ్గుతోంది.
93,254 కొత్త హౌసింగ్ యూనిట్లు ప్రారంభం
2024 జనవరి- మార్చి త్రైమాసికంలో, దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 93,254 కొత్త హౌసింగ్ యూనిట్లు ప్రారంభమయ్యాయి. మొత్తం అమ్మకాల కంటే ఈ సంఖ్య ఎక్కువ. సమీక్ష కాలంలో ఆఫీస్ & రెసిడెన్షియల్ విభాగాలు రెండూ బలమైన పనితీరును కనబరిచాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ చెప్పారు. రెసిడెన్షియల్ సెక్టార్‌లో రూ.1 కోటి లేదా అంత కంటే ఎక్కువ రేటున్న హౌసింగ్ సేల్స్ విపరీతంగా పెరగడం కొనుగోలుదార్లలోని విశ్వాసాన్ని తెలియజేస్తోందని వివరించారు.