Housing Property Sales: మన దేశంలో, రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లా హైవే మీద దూసుకుపోతోంది. నివాసాల విషయంలో గత నాలుగైదు ఏళ్లుగా వచ్చిన మార్పులు చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. ఎందుకంటే.. చౌక/అందుబాటు ధరల ఇళ్ల ‍‌(Affordable Housing) అమ్మకాలు ఏటికేడు తగ్గుతున్నాయి. మరోవైపు, ఖరీదైన/ విలాసవంతమైన ఇళ్లకు (Luxury Housing) డిమాండ్ బలంగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ట్రెండ్‌ చాలా స్పష్టంగా కనిపిస్తోంది.


దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఖరీదైన ఇళ్లకు డిమాండ్
కుష్‌మన్ & వేక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం... లగ్జరీ అపార్ట్‌మెంట్ల డిమాండ్‌లో దిల్లీ-ఎన్‌సీఆర్‌ దేశంలోని ఇతర మార్కెట్‌ల కంటే ముందుంది. 2024 మార్చి త్రైమాసికంలో (జనవరి 01 నుంచి మార్చి 31 వరకు, మొత్తం 3 నెలల కాలం), దిల్లీ-ఎన్‌సీఆర్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రారంభించిన కొత్త ప్రాజెక్టుల్లో 61 శాతం లగ్జరీ అపార్ట్‌మెంట్లే ఉన్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్‌లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ బలంగా ఉందని ఇది నిరూపిస్తోంది. ముంబై, బెంగళూరులో.. మొత్తం కొత్త లాంచ్‌ల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్ల వాటా వరుసగా 26 శాతం, 19 శాతం.


ఖరీదైన ఇళ్ల కేటగిరీ
కుష్‌మన్ & వేక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం, చదరపు అడుగు ధర కనీసం రూ.15 వేలు ఉన్న ఇళ్లను లగ్జరీ హౌసింగ్‌ కేటగిరీలోకి చేరాయి. మన దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్ల విక్రయాలు పెరిగాయని, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇది అత్యధికంగా ఉందని ఆ రిపోర్ట్‌ చెబుతోంది. ఒక స్థిరాస్తి సంస్థ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను లాంచ్‌ చేయగానే, తక్కువ సమయంలోనే ఒక్కటి కూడా మిగలకుండా హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.


కొవిడ్ తర్వాత కొత్త ట్రెండ్
కరోనా మహమ్మారి నుంచి ప్రజల ఆలోచన తీరు మారిందని, ఇళ్ల కొనుగోళ్లలో కొత్త ధోరణి కనిపిస్తోందని, ఎక్కువ మంది వినియోగదార్లు లగ్జరీ విభాగంలోకి వస్తున్నారని రిపోర్ట్‌లో ఉంది. దాదాపు అన్ని నగరాల్లో ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. 2019లో, అహ్మదాబాద్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్ల విక్రయం 6 శాతం మాత్రమే ఉండగా, 2024 నాటికి ఆ వాటా 38 శాతానికి పెరిగింది. గత 5 సంవత్సరాల్లో, విలాసవంతమైన గృహాల విక్రయాలు బెంగళూరులో 11 శాతం నుంచి 19 శాతానికి, చెన్నైలో 9 శాతం నుంచి 28 శాతానికి, హైదరాబాద్‌లో 42 శాతం నుంచి 53 శాతానికి పెరిగాయి.


ప్రాప్‌టైగర్ రిపోర్ట్‌
హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్‌టైగర్ (PropTiger) గత వారం రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌లో ఇలాంటి విషయాలే వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం, మార్చి త్రైమాసికంలో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరిగింది, అందుబాటు ధరల గృహాలకు డిమాండ్ తగ్గింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం, మార్చి త్రైమాసికంలో రూ.45 లక్షల నుంచి రూ.75 లక్షల కేటగిరీలోని ఇళ్ల విక్రయాలు 26 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. అదే కాలంలో, రూ.75 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రేటు ఉన్న ఇళ్ల వాటా 12 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా మొత్తం అమ్మకాల్లో 37 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం 24 శాతంగా ఉంది. అదే సమయంలో, మొత్తం విక్రయాల్లో సరసమైన గృహాల వాటా 22 శాతానికి తగ్గింది.  రూ.25 లక్షల లోపున్న ఇళ్ల వాటా మొత్తం విక్రయాల్లో 5 శాతంగా ఉంది. రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య ధర ఉన్న ఇళ్ల వాటా 17 శాతానికి తగ్గింది.


మరో ఆసక్తికర కథనం: స్థిరంగా స్వర్ణం, దిగొచ్చిన రజతం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి