RBI Repo Rate: ఈస్ట్‌ నుంచి వెస్ట్‌ వరకు చాలా తలనొప్పులు, రెపో రేటును తగ్గించే అవకాశం లేనట్లే!

దేశీయ, ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో RBI MPC సమావేశం జరుగుతుంది.

Continues below advertisement

RBI Monetary Policy: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC), ఈ నెల 4-6 తేదీల్లో సమావేశం అవుతుంది. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాలను 6వ తేదీన (శుక్రవారం) ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటిస్తారు. మరో రెండు నెలల కాలానికి దేశంలో బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయో, లేదో ఆ రోజు తేలిపోతుంది. దేశీయ, ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో RBI MPC సమావేశం జరుగుతుంది. US ఫెడరల్ రిజర్వ్, గత భేటీలో కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. RBI కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తుందని, రేట్లను తగ్గించే ఛాన్స్‌ లేదని చాలా మంది ఎక్స్‌పర్ట్స్‌ విశ్వసిస్తున్నారు. అదే జరిగితే, RBI రెపో రేటు వరుసగా నాలుగోసారి కూడా 6.50% వద్దే కొనసాగుతుంది. 

Continues below advertisement

దేశీయ తలనొప్పులు
దేశీయ సవాళ్లలో.... పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం వల్ల వినియోగ డిమాండ్ తగ్గడం, అసమాన రుతుపవనాలు ఖరీఫ్ పంటలను దెబ్బకొట్టడం, అధిక వడ్డీ రేట్లు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఉన్నాయి.

CMIE డేటా ప్రకారం, ఆగస్టులో కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ 1.5%తో గణనీయంగా తగ్గింది. FMCG కంపెనీల లాభాలు పెరుగుతున్నప్పటికీ, విక్రయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. వినియోగ డిమాండ్‌లో డౌన్‌సైడ్‌ రిస్క్‌ను ఇది సూచిస్తోంది. పండుగ సీజన్ వల్ల డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నా, ఇప్పటికీ డిమాండ్‌ ప్రతికూలతలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వినియోగదార్ల మళ్లీ విశ్వాసాన్ని నింపే చర్యలు అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్‌ను ప్రభావితం చేసే ఎదురుగాలులు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి రిస్క్‌లను RBI నిశితంగా పరిశీలించవచ్చు.

విదేశీ తలనొప్పులు
గ్లోబల్ ఫ్రంట్‌లో.... US ఆర్థిక వ్యవస్థలో 'సాఫ్ట్-ల్యాండింగ్' ఉంటుందన్న ఆశలు తగ్గుతుండడంతో ఆర్థిక వ్యవస్థలో మొమెంటం ఎటూ మొగ్గడం లేదు. యూరప్, చైనాలోనూ వృద్ధి పరమైన ఆందోళనలు ఎక్కువగానే ఉన్నాయి. 

US ఫెడరల్ రిజర్వ్ (US FED), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) వంటి ప్రధాన కేంద్ర బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఎక్కువ కాలం కొనసాగిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల, భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి క్యాపిటల్‌ ఫ్లోస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.

వీటితోపాటు, OPEC సభ్య దేశాల నుంచి చమురు సరఫరా తగ్గిన తర్వాత ముడి చమురు ధరలు గత వారం బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో చమురు ధరలు బ్యారెల్‌కు $90 నుంచి $100 మధ్య ఉండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇది కీలకమైన $100 మార్కును దాటదని చాలా మంది నిపుణులు ఊహిస్తున్నారు. ఏదిఏమైనా, పెరుగుతున్న చమురు ధరల వల్ల భారత్‌ వంటి దేశాల దిగుమతి బిల్లులు పెరుగుతాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపైనా ఒత్తిడి పెంచుతాయి. అంతేకాదు, ప్రస్తుతం భారతదేశ కరెంట్ ఖాతా లోటును (CAD) ఇప్పుడు GDPలో 1.8%గా అంచనా వేశారు, గత అంచనా 1.6% కంటే ఇది ఎక్కువ. కాబట్టి, RBI ఈ విషయాన్నింటినీ తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుంది. 

పెరుగుతున్న CAD, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు బయటకు వెళ్లడం వల్ల భారత రూపాయి కరిగిపోతోంది. సెప్టెంబర్‌లో సుమారు 0.5% క్షీణించింది. 

గత ఆరు నెలలుగా నెట్‌ బయ్యర్స్‌గా ఉన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు), సెప్టెంబర్ నెలలో ట్రెండ్‌ మార్చారు, భారతీయ మార్కెట్ నుంచి $1.7 బిలియన్లను విత్‌డ్రా చేశారు. అంతేకాదు, గత వారంలో విదేశీ మారక నిల్వలు దాదాపు నాలుగు నెలల కనిష్టానికి, 593 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

'వెయిట్ అండ్ వాచ్'  విధానం
ప్రస్తుత ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అక్టోబర్ పాలసీ మీటింగ్‌లో ఆర్‌బీఐ కాస్త సానుకూలంగా వ్యవహరించవచ్చు. FY24 కోసం వృద్ధి అంచనాలను GDP 6.50% వద్ద RBI కంటిన్యూ చేయవచ్చన్నది CARE రేటింగ్స్‌ అంచనా. ఎందుకంటే,  పండుగ సీజన్‌లో డిమాండ్‌ పెరుగుతోంది కాబట్టి, మరింత స్పష్టత కోసం 'వెయిట్ అండ్ వాచ్' విధానాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ అవలంబిస్తుంది.

ఆగస్టులో CPI ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్‌ అప్పర్‌ బ్యాండ్‌ (6%) కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, జులైలోని గరిష్ట స్థాయి 7.4% నుంచి 6.8% కు చల్లబడింది.

ప్రస్తుతం, RBI రెపో రేటు 6.50% వద్ద ఉంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25% వద్దే మారకుండా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు 6.75% వద్ద ఉన్నాయి. FY24 కోసం CPI ద్రవ్యోల్బణం 5.4%గా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేయవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola