RBI Action On Kotak Mahindra Bank: భారతీయ బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), కోటక్ మహీంద్ర బ్యాంక్‌పై భారీ యాక్షన్‌ తీసుకుంది. ఆన్‌లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా నిషేధం విధించింది. అంతేకాదు, కోటక్ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని కూడా హుకుం జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లందరికీ అన్ని సేవలను కోటక్ మహీంద్ర బ్యాంక్‌ కొనసాగించొచ్చని కేంద్ర బ్యాంక్‌ సూచించింది.


లోపాలను సరిదిద్దుకోవడంలో విఫలం
2022, 2023 సంవత్సరాలకు సంబంధించి జరిగిన ఐటీ పరిశీలనల్లో గుర్తించిన లోపాలను సమగ్రంగా, నిర్ణీత సమయంలో పరిష్కరించడంలో కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ విఫలమైందని తెలిపిన ఆర్‌బీఐ... బ్యాంక్‌పై చర్యలు తీసుకోక తప్పడం లేదని వెల్లడించింది. దీనిపై ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. గుర్తించిన లోపాలను సమయానుకూలంగా సరి చేయడంలో కోటక్ మహీంద్ర బ్యాంక్ విఫలమైందని ఆ ప్రకటనలో వివరించింది. ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, యూజర్‌ యాక్సస్‌ మేనేజ్‌మెంట్‌, వెండార్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సెక్యూరిటీ అండ్‌ డేటా లీక్‌ ప్రివెన్షన్‌ స్ట్రాటజీ వంటి విషయాల్లో పెద్ద లోపాలను గుర్తించామని వివరించింది. 


ఐటీ రిస్క్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ గవర్నెన్స్‌ విషయంలో 2022, 2023 సంవత్సరాల్లో తమ మార్గదర్శకాలను కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ పాటించలేదని ఆర్‌బీఐ వెల్లడించింది. బలమైన ఐటీ మౌలిక సదుపాయాలు, ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ లేకపోవడం వల్ల... కోటక్‌ మహీంద్ర బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, ఆన్‌లైన్ & డిజిటల్ బ్యాంకింగ్ ఛానెళ్లు గత రెండేళ్లలో చాలాసార్లు అంతరాయాలు ఎదుర్కొన్నాయని RBI తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న కూడా బ్యాంకింగ్‌ సేవలను ఈ బ్యాంక్‌ నిలిపేసింది, ఈ కారణంగా ఖాతాదార్లు సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. 


ఆర్‌బీఐ ప్రకటనను ఒక్కమాటలో చెప్పాలంటే.. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఐటీ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కోటక్ మహీంద్ర బ్యాంక్ తీవ్రంగా విఫలమైంది. ఈ సమస్యలను అధిగమించడానికి, ఐటీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కోటక్‌ మహీంద్ర బ్యాంక్ టాప్ మేనేజ్‌మెంట్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ నిరంతరం సూచనలు ఇస్తూ వచ్చుంది. బ్యాంక్‌కు గత రెండు సంవత్సరాలుగా RBI గైడెన్స్‌ అందుతోంది. కానీ, ఫలితం సంతృప్తికరంగా రాలేదు.


RBI ప్రకారం, కోటక్ మహీంద్ర బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఇందులో, క్రెడిట్ కార్డ్‌ లావాదేవీలు కూడా ఉన్నాయి. దీంతో బ్యాంక్‌ ఐటీ వ్యవస్థలపై భారం పెరిగింది. ఈ కారణంగా.. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుపై వ్యాపార పరిమితులు విధించాలని RBI నిర్ణయించింది. తద్వారా దీర్ఘకాలిక అంతరాయాలను అడ్డుకోవచ్చు. ఈ ముందు జాగ్రత్తలు లేకపోతే బ్యాంక్‌ కస్టమర్ సేవలపై మాత్రమే కాకుండా ఆర్థిక పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపు వ్యవస్థలు కూడా ఆగిపోయే స్థితికి చేరుకుంటాయి.


ఆర్‌బీఐ ఆంక్షల ప్రభావం ఎంత?
దేశీయ క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలో కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ల వాటా అతి చిన్నది. కాబట్టి, ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో కోటక్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు వ్యాపారంపై పడే ప్రభావం అతి తక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కొత్త అకౌంట్స్‌ ఓపెన్‌ చేయకుండా విధించిన ఆంక్షల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.


ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకుని కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ సమగ్ర ఆడిట్‌ నిర్వహించాల్సి వస్తుంది. ఆ ఆడిట్‌ ఫలితాలను RBI సమీక్షిస్తుంది. నష్ట నివారణ కోసం బ్యాంక్‌ తీసుకున్న చర్యలపై ఆర్‌బీై సంతృప్తి చెందితే, తాను విధించిన ఆంక్షలను పునఃసమీక్షిస్తుంది. 


మార్గదర్శకాలను పాటించలేదంటూ, 2020లో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పైనా ఆర్‌బీఐ ఈ తరహా ఆంక్షలను విధించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల జారీ ఆగిపోయింది. ఈ పరిస్థితి నుంచి పోటీ బ్యాంక్‌లు బాగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను 2021 ఆగస్టులో RBI తొలగించింది.