RBI Alert List: స్టాక్‌ మార్కెట్‌లో జనాన్ని ముంచేసే సైట్లు, నకిలీ ఎనలిస్టుల సంఖ్య కోకొల్లలు. వీటి సంగతి పక్కనబెడితే, కొన్ని ట్రేడింగ్‌ సైట్లు లేదా బ్రోకరేజీలు కూడా అనుమతులు లేకుండానే పని కానిచ్చేస్తున్నాయట.


తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే మన లాంటి అమాయకులను మేల్కొలిపేందుకు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఒక అలెర్ట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. దీనిని హెచ్చరికలా తీసుకోకపోతే మనకే నష్టం.


అలెర్ట్‌ లిస్ట్‌లో 34 కంపెనీలు


విదేశీ మారకపు లావాదేవీల (ఫారిన్ ఎక్సేంజ్‌ ట్రాన్జాక్షన్స్‌) విషయంలో  కొన్ని ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల అథరైజేష్‌ మీద చాలా ఎంక్వైరీలు రావడంతో ఆర్‌బీఐ విచారణ చేపట్టింది. మార్కెట్‌ను జల్లెడ పట్టి, అటువంటి లావాదేవీలను చేపట్టడానికి అధికారం లేని కొన్ని సంస్థల జాబితాను విడుదల చేసింది. 


‘అలర్ట్ లిస్ట్’గా పిలుస్తున్న ఈ జాబితా సమగ్రమైనది కాదని, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న తాజా సమాచారం ఆధారంగా ఈ లిస్టును రూపొందించామని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ - 1999 ప్రకారం, ఫారిన్ ఎక్స్ఛేంజ్‌ డీల్స్‌ చేయడానికి గానీ, ఫారెక్స్ ట్రాన్జాక్షన్స్‌ చేయడానికి గానీ ఈ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లకు అధికారం లేదని ప్రకటించింది.


సెంట్రల్ బ్యాంక్ ఇచ్చిన జాబితాలో మొత్తం 34 ఎంటిటీలు ఉన్నాయి. వాటిలో... Alpari, AnyFX, Ava Trade, Binomo, e Toro, Exness, Expert Option, FBS, FinFxPro, Forex.com వంటివి ఉన్నాయి.


ఈ లిస్ట్‌లో OctaFX పేరు కూడా ఉంది. విశేషం ఏమిటంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇది అధికారిక స్పాన్సర్. అంటే, ఒక మెగా టోర్నమెంట్‌లో ప్రధాన టీమ్‌ కోసం డబ్బు ఖర్చు చేస్తున్న కంపెనీ కూడా అనుమతులు లేకుండానే ఫారెక్స్‌ ట్రేడింగ్స్‌ నిర్వహిస్తోంది.


ఆకర్షణీయ ఆఫర్స్‌


ఈ ప్లాట్‌ఫామ్స్‌లోని కొన్ని వెబ్‌సైట్‌లు చాలా క్రాస్ కరెన్సీ పెయిర్స్‌ (cross-currency pairs) ద్వారా ఫారిన్‌ ఎక్సేంజ్‌ ట్రాన్జాక్షన్ల కోసం ఆఫర్‌లు కూడా ఇస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు, డిపాజిట్లను మరో 50 శాతం పెంచుతూ, కస్టమర్లకు వల వేస్తున్నాయి.


అలర్ట్ లిస్ట్‌లో కనిపించనంత మాత్రాన ఒక ఎంటిటీకి అనుమతి ఉందని భావించకూడదని ఆర్‌బీఐ వెల్లడించింది. అనుమతి ఉన్న వ్యక్తులు లేదా అధీకృత ETPల వివరాలతో ఒక లిస్టును తమ వెబ్‌సైట్‌లో ఉంచామని, వాటి ద్వారా ఆథరైజేషన్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.


అనధికారిక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల్లో పేర్లు రిజిస్టర్‌ చేసుకుని, ఫారిన్‌ కరెన్సీ లావాదేవీలు చేపట్టడం లేదా డబ్బు పంపడం లేదా డిపాజిట్ చేయడం వంటివి చేయొద్దని ఫిబ్రవరిలోనే ఆర్‌బీఐ ప్రజలను హెచ్చరించింది. మోసపూరిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కస్టమర్లు లేదా పెట్టుబడిదారులు మోసపోతున్నారని చాలా ఫిర్యాదులు, నివేదికలు అందడంతో ఆర్‌బీఐ ఈ హెచ్చరికను జారీ చేసింది.


అధీకృత సంస్థల ద్వారా, అదీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ - 1999 నిబంధనల ప్రకారం మాత్రమే విదేశీ మారకపు లావాదేవీలను రెసిడెంట్ ఇండియన్స్‌ చేపట్టవచ్చని బ్యాంకింగ్ రెగ్యులేటర్ స్పష్టం చేసింది.


ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం లేని, లేదా అనధికార ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ మారకపు లావాదేవీలను చేపట్టే వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.