RBI Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50%కు చేర్చింది, స్నేహపూర్వక విధానాన్ని ఉపసంహరించుకునే (withdrawal of accommodation) వైఖరిని కంటిన్యూ చేసింది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ప్రస్తుత రేట్ల పెంపు జరిగింది.


మానిటరీ పాలసీ నుంచి మార్కెట్‌ చూడాల్సిన 6 ప్రధాన అంశాలు ఇవి:


ఆర్‌బీఐ వైఖరి
MPCలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రేట్ల పెంపునకే మొగ్గు చూపారు. అంటే, వడ్డీ రేట్ల విషయంలో 'ఆర్‌బీఐ స్నేహపూర్వక విధానాన్ని తగ్గించుకోవడం' కొనసాగించాలని మెజారిటీ సభ్యులు నిర్ణయించారు. తద్వారా, వృద్ధికి మద్దతు ఇస్తూనే ద్రవ్యోల్బణాన్ని కూడా లక్ష్యిత పరిమితిలో ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమేనన్న సంకేతం ఇచ్చింది. అంటే, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందన్న వైఖరిని ప్రదర్శించింది.


ద్రవ్యోల్బణం
ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగానే ఉంది. 2023-24లో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ, అది 4% లక్ష్యం పైనే ఉండే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ అస్థిరతలు కారుమబ్బుల్లా కమ్ముకున్నాయి. దీనివల్ల భవిష్యత్‌ ద్రవ్యోల్బణ చిత్రం స్పష్టంగా లేదు. కాబట్టి, ద్రవ్యోల్బణ దృక్పథంపై జాగ్రత్తను ఆర్‌బీఐ కొనసాగిస్తుంది. 2023-24 చివరి నాటికి ద్రవ్యోల్బణం సగటున 5.6% ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే, పాలసీ రెపో రేటు ఇప్పటికే 6.50%కు చేరింది.


వృద్ధి
2022-23 మూడు & నాలుగు త్రైమాసికాల సమాచారం ప్రకారం, భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నాయి. రబీలో అధిక ఉత్పత్తి వల్ల వ్యవసాయం & గ్రామీణ డిమాండ్ అవకాశాలు పెరిగాయి. కాంటాక్ట్-ఇంటెన్సివ్ రంగాలు పుంజుకుంటే పట్టణ వినియోగం బలంగా పెరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయాలు పెట్టుబడి కార్యకలాపాలను బలపరుస్తాయి. 2023-24 కోసం వాస్తవ GDP వృద్ధి 6.4%గా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. Q1లో 7.8%; Q2లో 6.2%; Q3లో 6.0%; Q4లో 5.8%గా ఉంటుందని లెక్కగట్టింది.


లిక్విడిటీ
ఏప్రిల్ 2022తో పోలిస్తే తక్కువ ఆర్డర్స్‌ ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో మిగులు ద్రవ్యత ఉంది. భవిష్యత్‌లో, ప్రభుత్వం నుంచి భారీ వ్యయాలు, ఫారెక్స్ ఇన్‌ఫ్లోస్ వల్ల లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంది. 


ఎక్స్‌టర్నల్‌ సెక్టార్‌ 
2022-23 ప్రథమార్థంలో కరెంట్ ఖాతా లోటు (CAD) GDPలో 3.3%గా ఉంది. Q3 - 2022-23లో పరిస్థితి మెరుగుపడింది. తక్కువ కమోడిటీ ధరల నేపథ్యంలో దిగుమతులు తగ్గాయి, ఫలితంగా వాణిజ్య లోటు తగ్గింది. 2022-23 ద్వితీయార్ధంలో CAD మోడరేట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.


గిల్ట్ మార్కెట్
లిక్విడిటీ, మార్కెట్ కార్యకలాపాలను సాధారణ స్థాయికి తీసుకువచ్చే దిశగా, ప్రభుత్వ సెక్యూరిటీల (GSec) మార్కెట్‌లో ట్రేడింగ్‌ సమయాన్ని ఉదయం 9 గంటట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మహమ్మారి ముందున్న సమయానికి తిరిగి మార్చాలని RBI నిర్ణయించింది. ప్రస్తుతం, GSec మార్కెట్ 9:00 AM-3:30 PM మధ్య పని చేస్తోంది. GSecs రుణాలను అనుమతించాలని కూడా సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది, ఇది 'స్పెషల్‌ రెపోస్‌' మార్కెట్‌ను పెంచుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.