Bank of Baroda: దేశీయ బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న పురోగతికి తగినట్లుగానే రిజర్వు బ్యాంక్ కఠినంగా వ్యవహరించటం గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. కొన్ని నెలల కిందట ఆర్బీఐ ప్రభుత్వం యాజమాన్యంలోని టాప్ బ్యాంకర్ బీవోబీపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీనిని మరిచిపోకముందే ఇటీవల గతవారం ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకుపై చర్యలు చేపట్టింది. కొన్ని ఫైనాన్స్ సంస్థలపై భారీ పెనాల్టీలు.. దీంతో దేశంలోని ఆర్థిక సంస్థలు వణికిపోతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం మే 8న 2024న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది అక్టోబరులో విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. అప్పట్లో బ్యాంక్ డిజిటల్ యాప్ బివోబి వరల్డ్ సాంకేతిక లోపాల వల్ల దుర్వినియోగానికి గురైనట్లు గమనించిన ఆర్బీఐ వెంటనే చర్యలు చేపట్టింది. ఈ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను ఆన్‌బోర్డ్ చేయెుద్దని ఆదేశించింది. అయితే ఆర్బీఐ ఎత్తిచూపిన లోపాలను వీలైనంత వేగంగా సవరిస్తామని చెప్పిన బ్యాంక్ ఇందుకోసం సెంట్రల్ బ్యాంకుతో కలిసి పనిచేసింది. తాజాగా బ్యాంక్ చర్యలతో రిజర్వు బ్యాంక్ సంతృప్తి చెందటంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
తాజాగా రిజర్వు బ్యాంక్ లేఖ ప్రకారం బీవోబీ వరల్డ్ యాప్ పై గతంలోని ఆంక్షలను తక్షణమే ఎత్తివేసినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. ఇకపై బ్యాంక్ తన యాప్ ద్వారా కస్టమర్లను ఆన్ బోర్డింగ్ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కొనసాగించవచ్చని రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో పేర్కొంది. రెగ్యులేటరీ నిబంధనలు పాటిస్తూ కొత్త కస్టమర్లకు యాప్ పరిచయం కొనసాగుతుందని ప్రభుత్వ రంగ బ్యాంక్ పేర్కొంది.
గత ఏడాది అక్టోబర్‌లో ఆర్బీఐ బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 35A ప్రకారం బీవోబీ వరల్డ్ మొబైల్ అప్లికేషన్‌లో కస్టమర్‌లను ఆన్‌బోర్డింగ్ చేసే విధానంలో గమనించిన కొన్ని మెటీరియల్ సూపర్‌వైజరీ ఆందోళనల కారణంగా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయకుండా నిరోధించింది. ఆర్బీఐ గమనించిన లోపాలను సరిదిద్ది, RBIని సంతృప్తిపరిచేలా బ్యాంక్ సంబంధిత ప్రక్రియలను బలోపేతం చేయటంతో బ్యాన్ ఎత్తివేయబడింది. నిషేధానికి ముందు యాప్ 30 సెప్టెంబర్ 2023 నాటి డేటా ప్రకారం ప్రతిరోజూ 7.95 మిలియన్ల ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను నిర్వహించింది. ఇది నిజంగా బ్యాంక్ పనితీరును మెరుగుపరిచినట్లు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించింది. దీంతో కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపటంతో అస్థిర మార్కెట్లలో సైతం బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ స్వల్ప లాభంతో రూ.265.05 వద్ద కొనసాగుతోంది.