Reserve Bank Of India: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా మీరు ఎవరికైనా డబ్బు చెల్లించాలంటే, మీ బ్యాంక్‌ ఖాతాలో అందుకు సరిపడా డబ్బులు ఉండాలి. ఇకపై, బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా చెల్లింపులు చేయగలిగే సదుపాయం తీసుకొస్తోంది ఆర్‌బీఐ. 


ఈ నెల 6వ తేదీన, మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ చాలా కీలక ప్రకటనలు చేశారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ప్రి-అప్రూవ్డ్‌ క్రెడిట్ లైన్స్‌ (pre-approved credit lines) లేదా ప్రి-శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌ (pre-sanctioned credit lines) తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా, మీ ఖాతాలో డబ్బు లేకపోయినా మీరు చెల్లింపులు చేయగలరు. అయితే, సంబంధిత ఖాతాను UPIతో లింక్ చేసి ఉండాలి. 


భారతదేశంలో పేమెంట్స్‌ విధానం కొంతకాలంగా చాలా వేగంగా మారుతోంది. ముఖ్యంగా, UPI వచ్చాక భారతదేశంలో చెల్లింపుల విధానమే మారిపోయింది. బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బును, కేవలం ఫోన్‌ నంబర్‌ను ఉపయోగించి క్షణాల్లో వేరొక ఖాతాకు పంపుతున్నాం. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా చెల్లింపు సేవలను మరింత ఆధునీకరించేలా, UPIని బలోపేతం చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ చాలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా, రూపే క్రెడిట్ కార్డ్‌లను UPIతో లింక్ చేయడానికి కొంతకాలం క్రితమే అనుమతి ఇచ్చింది. 


కొత్త ప్లాన్‌తో చెల్లింపు విధానం ఎలా మారుతుంది?                                   
UPIతో బ్యాంక్ ఖాతాను లింక్ చేయడం ద్వారా చెల్లింపులు చేసే విధానం అందరికీ తెలిసిందే. పేమెంట్స్‌ యాప్‌ వాలెట్‌లో ఉన్న డబ్బును కూడా UPIని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా UPI చెల్లింపులు చేయవచ్చు. ఇలాంటి సేవలకు కొనసాగింపుగా తీసుకొచ్చిందే "UPI ద్వారా ప్రి-శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌ చెల్లింపులు". అంటే, బ్యాంకు ఒక వ్యక్తికి క్రెడిట్‌ కార్డ్‌ తరహాలోనే క్రెడిట్‌ను జారీ చేస్తే.. ఆ మొత్తాన్ని UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు.


బ్యాంకు డిపాజిట్ లేకపోయినా చెల్లింపు                                   
RBI ప్రతిపాదించిన ఈ కొత్త పద్ధతి అమలులోకి వస్తే... కస్టమర్‌లు ప్రి-అప్రూవ్డ్ క్రెడిట్స్‌ నుంచి కూడా UPI చెల్లింపులు చేయగలుగుతారు. UPI ద్వారా క్రెడిట్ లైన్ ఫెసిలిటీ, కస్టమర్‌లకు పాయింట్-ఆఫ్-సేల్‌ అనుభవాన్ని మరింత మెరుగ్గా, సులభంగా మారుస్తుంది. ఈ విధానం అమలు, విధివిధానాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని ఆర్‌బీఐ ఇంకా విడుదల చేయలేదు, నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్‌ అవుతుంది.     


క్రెడిట్ కార్డుల సంఖ్యను వెంట తీసుకెళ్లాల్సిన రిస్క్‌ను తగ్గించి, యుపీఐ ద్వారా క్రెడిట్‌ లావాదేవీలు జరిపే అవకాశం కల్పించడానికి ప్రి-శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌ విధానం తీసుకొస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.