Rakesh Jhunjhunwala Quotes: స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం, భారత వారెన్‌ బఫెట్‌.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం కన్ను మూశారు. రూ.5000 పెట్టుబడితో ఆయన అద్భుతాలు చేశారు. రూ.40వేల కోట్ల మేర సంపదను ఆర్జించారు. ఎంతో మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్లోకి కొత్తగా ఎవరొచ్చినా ఆయన బాటలోనే నడుస్తుంటారు. ఆయన మాటల్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. ఆర్జే ఇక లేరని తెలిసిన అభిమానులు ఆయన మాటల్ని స్మరించుకుంటున్నారు.


రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా విజయ మంత్రాలు


* స్టాక్‌ మార్కెట్లో నష్టాల్ని భరించలేని వారు లాభాలనూ ఆర్జించలేరు.
* ప్రతిసారీ కెరటానికి ఎదురెళ్లండి. ఇతరులు అమ్మేస్తుంటే మీరు కొనండి. అవతలి వారు కొనుగోలు చేస్తుంటే మీరు అమ్మండి.
* తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు భారీ నష్టాలకు దారితీస్తాయి. స్టాక్‌ మార్కెట్లో డబ్బులు పెట్టేముందు బాగా ఆలోచించండి. కావాల్సినంత సమయం తీసుకోండి.
* ట్రెండును అంచనా వేయండి. దాన్నుంచి లాభపడండి. ట్రేడర్లు మానవ స్వభావానికి వ్యతిరేకంగా ముందుకెళ్లాలి.
* ఒక స్టాక్‌ ధర వీలైనంత తక్కువ ఉన్నప్పుడే ప్రవేశించండి.
* మార్కెట్‌ను గౌరవించండి. ఓపెన్‌ మైండ్‌తో ఉండండి. ఎప్పుడు నిలబడాలో ఎప్పుడు నష్టాల్ని భరించాలో తెలుసుకోండి. బాధ్యతగా ఉండండి.
* కంపెనీల విలువల హేతుబద్ధంగా లేనప్పుడు ఇన్వెస్ట్‌ చేయకండి. లైమ్‌లైట్‌లో ఉన్నాయని కంపెనీల వెంట పరుగెత్తకండి.
* ట్రేడింగ్‌ మనల్నెప్పుడూ నేల మీదే ఉంచుతుంది. ప్రతిసారీ అప్రమత్తం చేస్తుంది. అందుకే ట్రేడ్‌ చేయడం నాకిష్టం.
* స్టాక్‌ మార్కెట్లో భావోద్వేగంతో చేసే పెట్టుబడులు కచ్చితంగా నష్టాలకు దారితీస్తాయి.
* ఇతరులు అమ్మేటప్పుడు మీరు కొనండి. ఇతరులు కొనుగోలు చేస్తుంటే మీరు అమ్మండి. ఇదే స్టాక్‌ మార్కెట్‌ మంత్రం.
* పటిష్ఠమైన, పోటీనివ్వగల యాజమాన్యం ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి.
* నష్టాలకు సిద్ధపడండి. స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ జీవితంలో నష్టాలు ఓ భాగం.


Also Read: రూ.5000తో మొదలై రూ.40వేల కోట్లు ఆర్జించి! RJ ప్రస్థానం అనితర సాధ్యం!


Also Read: దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూత, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి


రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా హఠాత్మరణం పట్ల ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 'రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఓటమిని అంగీకరించని వ్యక్తి. జీవితాన్ని పరిపూర్ణంగా గడిపారు. చలాకీగా ఉండేవారు. ఆర్థిక ప్రపంచానికి ఆయనెంతో సేవ చేశారు. భారత అభివృద్ధి పట్ల ఆయనెంతో అభిరుచితో ఉండేవారు. ఆయన కన్నుమూయడం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' అని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.