Punjab National Bank Alert: దేశంలోని రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు 'పంజాబ్ నేషనల్ బ్యాంక్'‍‌కు (PNB) దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదార్లు ఉన్నారు. ఈ బ్యాంక్‌, తన ఖాతాదార్లందరికీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఒక ఫేక్ మెసేజ్‌కు సంబంధించి కస్టమర్లను అలెర్ట్‌ చేసింది. 


ట్వీట్‌ ద్వారా ఖాతాదార్లకు సమాచారం
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 130వ వార్షికోత్సవం పేరుతో సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు ఫేక్ మెసేజ్‌లు (PNB Fraud Alert) పంపుతున్నారంటూ ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా పీఎన్‌బీ తెలిపింది. తమ బ్రాండ్ గుర్తింపును దుర్వినియోగం చేసి ఖాతాదార్ల సొమ్మును దోచుకుంటున్నారని బ్యాంక్ పేర్కొంది. కాబట్టి, మీకు కూడా పీఎన్‌బీ 130వ వార్షికోత్సవం పేరుతో ఏదైనా సందేశం వస్తే జాగ్రత్తగా ఉండండి, అలాంటి లింక్స్‌ మీద క్లిక్‌ చేయద్దని తెలిపింది. పొరపాటున ఆ లింక్‌ల మీద క్లిక్‌ చేస్తే ఖాతాలోని డబ్బు నేరగాళ్ల పరం అవుతుందని బ్యాంక్‌ హెచ్చరించింది.


"హెచ్చరిక. 130వ వార్షికోత్సవానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎలాంటి ఆఫర్‌ను అందించడంలేదు. ఎవరైనా మీకు అలాంటి లింక్‌ను పంపితే దానిపై క్లిక్ చేయవద్దు, ఆ లింక్‌ను ఇతరులకు షేర్‌ చేయవద్దు" - అని ఆ ట్వీట్‌లో పీఎన్‌బీ పేర్కొంది.


బ్యాంకు పేరిట వచ్చే ఏ సందేశాన్నైనా ఆలోచించకుండా క్లిక్ చేయవద్దని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రజలకు సూచించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సర్క్యులేట్ అవుతున్న సందేశాలను మరొక్కసారి నిర్ధరించుకోమని (క్రాస్ చెక్) చెప్పింది. ఒకవేళ మీరు పొరపాటున ఆ లింక్‌ల మీద క్లిక్‌ చేసినా... మీ పేరు, ఆధార్ నంబర్, పాన్ నంబర్, ఖాతా నంబర్, క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్, OTP వంటి మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలను ఆ లింక్‌ల ద్వారా ఎవరైనా అడిగితే, పొరపాటున కూడా ఆ వివరాలను వాళ్లతో పంచుకోవద్దని బ్యాంక్‌ సూచించింది. అలా చేస్తే, మీ ఖాతాలోని డబ్బు మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.


రకరకాల పేర్లతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
ఊరించే ఆఫర్లతో పాటు అనేక మార్గాల్లో సైబర్ నేరగాళ్లు కస్టమర్లను కొల్లగొడుతున్నారు. వాటిలో.. KYC అప్‌డేట్‌, PAN అప్‌డేట్ పేరిట ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. మీ ఖాతాను స్తంభించిపోకుండా కాపాడుకోవడానికి ఈరోజే KYC లేదా PAN అప్‌డేట్‌ పూర్తి చేయాలని మోసగాళ్లు కస్టమర్‌లకు ఈ తరహా సందేశం పంపుతారు. ఆ పని పూర్తి చేయడానికి ఆ సందేశంలోనే ఒక లింక్ కూడా పంపుతారు. ఎవరైనా కస్టమర్‌ ఆ లింక్‌పై క్లిక్ చేస్తే... కస్టమర్‌ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్‌ ఖాతా సమాచారాన్ని అడుగుతారు. మోసగాళ్లు వేసే గాలం ఇది. ఒకవేళ మీరు మీ వ్యక్తిగత, బ్యాంక్‌ వివరాలను ఆ లింక్‌ ద్వారా పంచుకుంటే... కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ నేరగాళ్లు మీ ఖాతా నుంచి డబ్బులు దోచుకుంటారు. మీకు అలాంటి సందేశం ఏదైనా వచ్చినట్లయితే దాంతో చాలా జాగ్రత్త ఉండండి. బ్యాంక్‌ శాఖను సందర్శించడం ద్వారా ఆ సందేశంలో వాస్తవమెంతో నిర్ధరించుకోండి. ఒకవేళ నిజంగా KYC ప్రక్రియ పూర్తి చేయాల్సివస్తే, బ్యాంక్‌ శాఖలోనే పూర్తి చేయండి.