Stocks In President Of India Portfolio: దేశంలోని ప్రతి రంగానికి చెందిన కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో (Stock Market) నమోదయ్యాయి ప్రస్తుతం, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE)లో 4,000కు పైగా కంపెనీలు లిస్ట్ అయ్యాయి. పెట్టుబడిదారులు తమ పరిజ్ఞానం & ఆసక్తిని బట్టి వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్ నుంచి షేర్లు కొనడం ద్వారా ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకు... కొందరు IT రంగంలో పెట్టుబడి పెట్టడం సరైనదని భావించి ఐటీ కంపెనీల షేర్లు కొనొచ్చు. కొంతమందికి ఫార్మా రంగం ఆకర్షణీయంగా కనిపించి ఆ సెక్టార్‌లోని కంపెనీల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అదేవిధంగా, మరి కొంతమంది రియల్ ఎస్టేట్‌లో, ఇంకొందరు FMCG రంగాల్లో మదుపు చేయవచ్చు.
స్టాక్ మార్కెట్‌లో భారత రాష్ట్రపతి పెట్టుబడులు
సాధారణ ప్రజలే కాదు, భారత రాష్ట్రపతికి కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరిట వివిధ రంగాల్లోని వివిధ కంపెనీల షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల కారణంగా భారత రాష్ట్రపతి నికర విలువ (Net worth of President Of India) దాదాపు 44 లక్షల కోట్లకు చేరింది.
భారత రాష్ట్రపతికి ఏ రంగంలో ఎంత వాటా ఉంది?
మనీకంట్రోల్ డేటా ప్రకారం, భారత రాష్ట్రపతి పోర్ట్‌ఫోలియోలో 77 కంపెనీలు ఉన్నాయి. ఇందులో గరిష్ట పెట్టుబడి PSU బ్యాంకుల్లో (ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు) ఉంది, ఇది 16 శాతం. మిసెలీనియస్ రంగం (miscellaneous sector) రెండో స్థానంలో ఉంది. అంటే, సంప్రదాయ రంగాల్లోకి రాని అనేక రకాల కంపెనీలు మిసెలీనియస్ రంగం కిందకు వస్తాయి. వీటిలో హోల్డింగ్ 6 శాతంగా ఉంది. భారత రాష్ట్రపతి పెట్టుబడుల్లో విద్యుత్ రంగం మూడో స్థానంలో ఉంది, ఇందులో మొత్తం హోల్డింగ్ 6 శాతం. ఎరువుల రంగం నాలుగో స్థానంలో ఉంది, ఇందులో 5 శాతం పెట్టుబడులు ఉన్నాయి.
వీటి తర్వాత.. మైనింగ్ & మినరల్స్, ఆయిల్ డ్రిల్లింగ్ & ఎక్స్‌ప్లోరేషన్, ట్రేడింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఉన్నాయి. ఈ రంగాల్లో రాష్ట్రపతికి 4 శాతం చొప్పున వాటా ఉంది. మెటల్ సెక్టార్‌లో నాన్ ఫెర్రస్ (ఇనుము కాని లోహాలు), ఇంజినీరింగ్‌లో హెవీ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్, రిఫైనరీస్, ఫైనాన్స్ రంగంలో టర్మ్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి వాటిలో 3-3 శాతం హోల్డింగ్ ఉంది.
వీటితో పాటు... NBFCలు, పెట్టుబడి కంపెనీలు, కన్‌స్ట్రక్షన్ & రియల్ ఎస్టేట్, షిప్పింగ్ & నౌకానిర్మాణం, టెలికమ్యూనికేషన్ &అనుబంధ పరికరాలు, టెలికమ్యూనికేషన్ సేవలు, డైవర్శిఫైడ్ టెలికమ్యూనికేషన్ సర్వీస్‌లు, హాస్పిటల్స్ & మెడికల్ సర్వీసెస్, రసాయనాలు, అల్యూమినియం, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు, రవాణా &లాజిస్టిక్స్, ట్రాక్టర్లు, స్పాంజ్ ఐరన్, స్టీల్ లార్జ్, హోటళ్లు, ఏరోస్పేస్ & డిఫెన్స్, పవర్ జనరేషన్ & డిస్ట్రిబ్యూషన్ వంటి రంగాల్లో రాష్ట్రపతికి ఒక్కో శాతం చొప్పున హోల్డింగ్ ఉంది.
భారత రాష్ట్రపతి నికర విలువ
భారత రాష్ట్రపతి పోర్ట్‌ఫోలియో నిరక విలువ రూ. 43 లక్షల 87 వేల 489 కోట్లు. అయితే, ఇక్కడో విషయం మీరు అర్ధం చేసుకోవాలి. ఇవన్నీ, భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆస్తిపాస్తులు కాదు. అంటే, రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తికి ఈ డబ్బుతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇవి, భారత రాష్ట్రపతి పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు. ఇది పూర్తిగా ప్రభుత్వ సొమ్ము. ఈ పెట్టుబడులపై వచ్చే రాబడి ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. భారత రాష్ట్రపతి దేశంలోనే అతి పెద్ద సంస్థాగత పెట్టుబడిదారు.
మరో ఆసక్తికర కథనం: బ్యాంక్ చెక్కుల్లో 9 రకాలు - ఏది, ఎక్కడ ఉపయోగిస్తారో మీకు తెలుసా?