PM Modi US Visit: అగ్రరాజ్యం అమెరికాలో మోదీ మ్యాజిక్‌ చేశారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్‌ టెక్‌ జెయింట్స్‌ గూగుల్‌, అమెజాన్‌ను ఒప్పించారు. ఈ రెండు కంపెనీలు రంగంలోకి దిగితే, వేల కొద్దీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.


వైట్‌హౌస్‌లో జరిగిన టెక్‌ మీటింగ్‌లో ఆపిల్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఓపెన్‌ఏఐ వంటి అగ్రస్థాయి టెక్నాలజీ కంపెనీల CEOలతో ప్రధాని మాట్లాడారు. వైట్‌హౌస్‌లో లోపల దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ఇండియాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అడ్డంకులపై చర్చ జరిగింది. గ్లోబల్‌ CEOలు అడిగిన అన్ని ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పారు. భయం వదిలేసి భారత్‌ రమ్మంటూ భరోసా ఇచ్చారు. మీ కోసం ఇండియా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ ఆహ్వానించారు.


భారీ పెట్టుబడులు ప్రకటించిన గూగుల్‌ & అమెజాన్‌
మోదీతో మీటింగ్‌ తర్వాత... గూగుల్ CEO సుందర్ పిచాయ్, అమెజాన్ యొక్క CEO ఆండ్రూ జాస్సీ ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్లాన్స్‌ ప్రకటించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో స్పీడ్‌ పెంచడం, లోకల్‌ లాంగ్వేజీల కంటెంట్‌ను ప్రోత్సహించడం, కొత్త ఉద్యోగాలు సృష్టించడం, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడం లక్ష్యంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉంటాయి.


గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించాలన్న గూగుల్ ప్రణాళికను సుందర్ పిచాయ్ ప్రధానితో షేర్‌ చేసుకున్నారు. దీనివల్ల, భారత్‌లో తమ ఉనికి విస్తరణతో పాటు, ఇండియన్‌ డిజిటల్ ఎకానమీ కూడా పాజిటివ్‌గా ప్రభావితం అవుతుందని చెప్పారు. ఇండియా డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ భారీగా, $10 బిలియన్ల పెట్టుబడి పెడుతుందని, దేశంలో డిజిటల్ విప్లవాన్ని వేగంగా పరిగెత్తిస్తుందని పిచాయ్ చెప్పారు. అంతేకాదు, మరిన్ని భారతీయ భాషలకు వర్చువల్ అసిస్టెంట్ బార్డ్‌ను పరిచయం చేస్తామని సుందర్‌ పిచాయ్ చెప్పారు. దీనివల్ల, దేశంలోని వివిధ భాషలు మాట్లాడే ప్రజలకు, వారి స్థానిక భాషలోనే డిజిటల్ అనుభవం అందుతుందన్నారు.


అమెజాన్ CEO ఆండ్రూ జాస్సీ కూడా ఇండియన్‌ ఎకానమీ వృద్ధిలో పాల్గొనేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. అమెజాన్, ఇప్పటికే భారత్‌లో 11 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని మోదీతో భేటీ తర్వాత జాస్సీ ప్రకటించారు. దీనికి అదనంగా, $15 బిలియన్లను పెట్టుబడి పెట్టాలని అమెజాన్‌ భావిస్తోంది, మొత్తం పెట్టుబడిని $26 బిలియన్లకు చేరుస్తుంది. స్మాల్‌ అండ్‌ మీడియం సైజ్‌ (SME) వ్యాపారాల డిజిటలైజేషన్‌కు, ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు, భారతీయ ఎగుమతులను ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఉపయోగిస్తారు.


భారతదేశ డిజిటల్ ఫ్యూచర్‌ మీద ప్రపంచ టెక్ దిగ్గజాలకు ఉన్న కాన్ఫిడెన్స్‌ను గూగుల్, అమెజాన్ చేసిన ప్రకటనలు హైలైట్ చేస్తున్నాయి. ఈ పెట్టుబడులతో భారతదేశ డిజిటల్ ఎకానమీలో వృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఉద్యోగాల సృష్టి, కొత్త పరిశ్రమలు సాధ్యమవుతాయి. 


మైక్రాన్‌, టెస్లాకు కూడా ఇన్విటేషన్‌
అంతకుముందు, సెమీకండక్టర్‌ ప్రొడక్షన్‌ ప్లాంటు భారత్‌లో పెట్టాలని అమెరికా చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీని కూడా ప్రధాని ఆహ్వానించారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని మైక్రాన్‌ CEO సంజయ్‌ మెహ్రోత్రాకు హామీ ఇచ్చారు. ప్రాసెస్‌ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ ప్యాకేజింగ్‌ కెపాసిటీలను అభివృద్ధి చేయడానికి భారత్‌కు రావాలని ‘అప్లైడ్‌ మెటీరియల్స్‌’ CEOను కూడా ఆహ్వానించారు. ప్రధాని విజ్ఞప్తులపై ఈ రెండు కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. గుజరాత్‌లో $2.75 బిలియన్లతో సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్టింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని మైక్రాన్‌ ప్రకటించింది. రాబోయే నాలుగేళ్లలో, బెంగళూరులో $400 మిలియన్లు ఇన్వెస్ట్‌ చేస్తామని, ఇంజినీరింగ్‌ కేంద్రాన్ని నిర్మిస్తామని అప్లైడ్‌ మెటీరియల్స్‌ తెలిపింది.


ఈ ప్రారంభంలో, ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ 'టెస్లా' CEO ఎలాన్‌ మస్క్‌తోనూ ప్రధాని భేటీ జరిగింది. భారత్‌లో టెస్లా మాన్యుఫాక్చరింగ్‌ ఫ్లాంట్‌ ఏర్పాటుపై ఎలాన్‌ మస్క్‌ కూడా సానుకూలంగా స్పందించారు.


మరో ఆసక్తికర కథనం: ఫారిన్‌ కరెన్సీ కిట్టీలో లక్ష్మీకళ, $596 బిలియన్లకు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial