నెల్లూరు రాజకీయాలు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోనే ఉంటూ తనకు వ్యతిరేక వర్గంగా మారినవారిపై ఆయన విరుచుకుపడ్డారు. 2024లో కూడా తానే నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిని అని చెప్పారు అనిల్. 


నెల్లూరు నగరంలోని ఎంసీఎస్ కల్యాణమండపంలో నెల్లూరు వైసీపీ సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీని నెల్లూరు నగరంలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే అనిల్ నేతలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలే తన బలమని కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన తాము ముందుంటానన్నారు. అదే సమయంలో సిటీ వైసీపీ నేతలతో తనకున్న విభేదాలను మరోసారి ఆయన ప్రస్తావించారు. 


టార్గెట్ రూప్ కుమార్, ముక్కాల..
నెల్లూరు సిటీలో ఇటీవల అనిల్‌కు, ఆయన బాబాయ్ రూప్ కుమార్ కు పూర్తిగా మాటలు లేవు. రూప్ కుమార్ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ కూడా. ఇటీవలే ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. నెల్లూరు సిటీలో కొత్తగా ఆఫీస్ ప్రారంభించారు. ఆయనకు తోడు నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న ముక్కాల ద్వారకానాథ్ కూడా అనిల్ కి వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ముక్కాల, అనిల్ కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అనిల్ పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు ముక్కాల. దీంతో అనిల్ నేరుగా రంగంలోకి దిగారు. వీరిద్దరికీ ఫుల్ డోస్ ఇచ్చేశారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం చేస్తూ కొంతమంది నిందలు వేస్తున్నారని, అలాంటి వారు తమపని తాము చూసుకోవాలని హితవు పలికారు అనిల్. నియోజకవర్గంలో కార్యకర్తలను ఐక్యం చేసి, మళ్లీ ఫైర్‌ బ్రాండ్‌లా మారి వారందర్నీ ఢీ కొంటానన్నారు అనిల్.


రాత్రిపూట పార్టీలో తాగి అనిల్‌ ను ఓడిస్తామంటూ కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నరని, ఓవైపు జై జగన్‌ అంటూనే నెల్లూరులో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు అనిల్. తనకు సినిమా చూపిస్తానని ఒకరు బహిరంగంగా అంటున్నారని, ఇంకొకరు తాను తయారు చేసిన బొమ్మ అనిల్‌ అని చెబుతున్నారని వారికి దమ్ముంటే తనకు సినిమా చూపించాలని సవాల్ విసిరారు. 


నెల్లూరు నగరంలో లే అవుట్ల వద్ద తాను డబ్బులు తీసుకోలేదని ఆ చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసన్నారు అనిల్. రేపటి నుంచి ఆట మొదలవుతుందని, తానెవరికీ భయపడనని నెల్లూరు నగర నియోజకవర్గంలో వైసీపీ నుంచి తాను తప్ప ఎవరూ పోటీ చేయరన్నారు. 


ఇటీవల సీఎం జగన్ చేపట్టిన గడప గడప రివ్యూ మీటింగ్ కి కూడా అనిల్ హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం చేసిన వారు కూడా వైసీపీ నేతలే కావడం గమనార్హం. దీంతో అనిల్ సడన్ గా మీటింగ్ పెట్టారు. అందర్నీ వాయించేశారు. అనిల్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్లు రెడీ చేస్తున్నారు మరో రెండురోజులపాటు నెల్లూరులో రాజకీయం మరింత వేడిగా మారే అవకాశం ఉంది.