ISRO News: అమెరికా, రష్యా సహా ఇతర దేశాలు అంతరిక్షంలో ఏర్పాటు చేసిన స్పేస్ సెంటర్ పై ఇస్రో బలమైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంయుక్త మిషన్ త్వరలో సాకారమవుతుంది. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ మిషన్ గురించి అమెరికా అధికారులు ప్రకటించడం గమనార్హం. 2024లో ఈ మిషన్ సాకారమవుతుందని తెలుస్తోంది. 


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. రాకెట్ ప్రయోగంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అనేక ఇతర దేశాలు తమ శాటిలైట్ల ప్రయోగానికి ఇస్రో సహాయ సహకారాలు తీసుకుంటున్నాయి. సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించిన ఇస్రోకి ఇప్పుడు నాసా టెక్నాలజీ మరింత దన్నుగా నిలవబోతోంది. 


2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంయుక్త మిషన్‌ ను పంపేందుకు NASA, ISRO అంగీకరించాయని వైట్‌హౌస్ ప్రకటించింది. అందరి ప్రయోజనం కోసం అంతరిక్ష పరిశోధనల కోసం దేశాలను ఒకచోట చేర్చే ఆర్టెమిస్ ఒప్పందాలలో భారతదేశం చేరుతుందని అమెరికా అధికారులు తెలిపారు. 


మోదీ మిషన్ సక్సెస్ అయినట్టేనా..?


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోందనడానికి ఇది మరో ఉదాహరణగా చెబుతున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌ లోని ఐక్యరాజ్య సమితి లాన్‌ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు మోదీ. అనంతరం వాషింగ్టన్‌ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌ లో మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 


భారత్ కు వరాలు.. 
మోదీ పర్యటనలో భాగంగా భారత్‌ కు అమెరికా పలు వరాలు ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్‌ లో కొత్తగా అమెరికా కాన్సులేట్లు ఏర్పాటు కాబోతున్నాయి. బెంగళూరులో ఒక కాన్సులేట్ ఏర్పాటవుతుందని ప్రకటించారు. రెండో కాన్సులేట్ ఏర్పాటు చేసే ప్రాంతంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనితోతపాటు ఇప్పుడు నాసా, ఇస్రో సంయుక్త ఆపరేషన్ భారత్ కు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ  ఆర్టెమిస్ ఒప్పందాలపై రెండు దేశాలు సంతకం చేశాయి. 


ఆర్టెమిస్ ఒప్పందం అంటే..
చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి కూడా మానవుల్ని పంపించేందుకు నాసా ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టింది. ఇటు భారత్ కూడా చంద్రయాన్ పేరుతో కొత్త ప్రయోగాలు చేస్తోంది. 2025 నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపించాలనేది నాసా ఆర్టెమిస్ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ ఆర్టెమిస్ మిషన్లో భారత్ ని భాగస్వామిని చేసేందుకు అమెరికా సవరణలు చేపట్టింది. అందులో భాగంగానే నాసా, ఇస్రో చేతులు కలిపాయి. ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇకపై జాయింట్ ఆపరేషన్లకు సిద్ధమైనట్టు స్పష్టం చేశాయి. 


ఆర్టెమిస్ ఒప్పందంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు ముందుకేసినట్టు స్పష్టమవుతోంది. నాసా సహకారంతో జాయింట్ మిషన్ కు ఇస్రో సిద్ధమవుతోంది. సాంకేతిక పరంగా ఇస్రోకి ఇది మరింత దన్నుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇస్రో అధికారులు త్వరలో ఈ జాయింట్ ఆపరేషన్ పై స్పందించే అవకాశం ఉంది. ఆర్టెమిస్ ఒప్పందం గురించి ఇస్రో అధికారులు మరిన్ని వివరాలు తెలియజేస్తారు.