Bank Account: మన దేశంలో, సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా ఓ విషయం వైరల్ అవుతోంది. బ్యాంక్‌  ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువ జమ చేస్తే, ఆ ఖాతాను తక్షణం మూసేస్తారన్నది విషయం తెగ తిరుగుతోంది. 30 వేల రూపాయలకు మించి ఒక అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తే, ఆ అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేయమని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించారన్న మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్‌ మీకూ ఇప్పటికే వచ్చి ఉంటుంది. లేదో, ఇవాళో, రేపో మీ మొబైల్‌లోకి వచ్చి చేరుతుంది. 


అయితే, ఇది పుకారు మాత్రమే. పని లేని వ్యక్తులు కొందరు పనిగట్టుకుని సృష్టించిన కల్పిత వార్త ఇది. ఈ ఫేక్‌ న్యూస్‌ రిజర్వ్ బ్యాంక్ వరకు వెళ్లింది. దీంతో, పీఐబీ (Press Information Bureau) రంగంలోకి దిగి, అది అసత్య ప్రచారంగా తేల్చింది.


ట్వీట్ చేసిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో
బ్యాంక్‌ ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, ఆ ఖాతాను నిలిపేస్తారన్నది నిజం కాదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడైంది. ఈ విషయం గురించి ఆర్‌బీఐ గవర్నర్‌ ఎలాంటి ప్రకటన చేయలేదంటూ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా ట్వీట్‌ చేసింది. వైరల్‌ అవుతున్న నకిలీ వార్త తాలూకు ఇమేజ్‌ను కూడా ఆ ట్వీట్‌లో ప్రదర్శించింది. 






ఫేక్‌ మెసేజ్‌లతో జాగ్రత్త
ఫేక్ న్యూస్‌, మోసపూరిత మెసేజ్‌లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద లింక్‌లను పొరపాటున కూడా క్లిక్‌ చేయ చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ తరచూ ప్రజలకు సలహా ఇస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది.  దీంతో పాటు, ఫేక్ మెసేజ్‌లను, ఫిషింగ్‌ లింక్‌లను ఎవరికీ షేర్ చేయవద్దని కూడా రిజర్వ్ బ్యాంక్ సూచించింది. అన్ని బ్యాంకులు కూడా తమ ఖాతాదార్లను తరచూ హెచ్చరిస్తుంటాయి. క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌, అకౌంట్‌ వివరాలు, స్పెషల్‌ స్కీమ్‌లు, గిఫ్ట్‌ల పేరిట వచ్చే ఫిషింగ్‌ కాల్స్‌కు స్పందించవద్దంటూ సందేశాలు పంపుతుంటాయి.


మరో ఆసక్తికర కథనం: ధనవర్షం కురిపించిన 26 స్టాక్స్‌ - ఇవే ఈ వారం హీరోలు 


డౌట్‌ వస్తే మీరూ వాస్తవ తనిఖీ చేయవచ్చు
వైరల్ అవుతున్న ఏదైనా వార్త నకిలీ కావచ్చు అన్న అనుమానం మీకు వస్తే, మీరు కూడా ఫ్యాక్ట్‌ చెక్‌ చేయవచ్చు. ఇందుకోసం, 87997 11259 నంబర్‌కు మెసేజ్‌ చేయవచ్చు, లేదా socialmedia@pib.gov.in కి మెయిల్ చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: నిఫ్టీని నడిపిస్తున్న 5 బ్లూ చిప్‌ స్టాక్స్‌, మీ దగ్గర ఒక్కటైనా ఉందా?