Unclaimed Money Lying In Inactive Bank Accounts: మన దేశంలో దాదాపు అందరికీ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. వీరిలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేశారు. కొన్నిసార్లు, అన్ని ఖాతాలను నిర్వహించలేక, ఏదోఒక ముఖ్యమైన ఖాతాను మాత్రం వినియోగిస్తూ మిగిలిన వాటిని విస్మరిస్తుంటారు. ముఖ్యంగా, ఉద్యోగులు, సంస్థ మారినప్పుడల్లా కొత్త బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తారు, పాత ఖాతాలను పక్కనబెడతారు. ఇలా మీరు పట్టించుకోని మీ పాత బ్యాంక్ ఖాతాలలో క్లెయిమ్ చేయని డిపాజిట్లు (డబ్బులు) ఉన్నాయో, లేదో మీరు ఎప్పుడైనా చెక్ చేశారా?.
ఒక బ్యాంక్ ఖాతాలో దశాబ్దానికి ఎలాంటి లావాదేవీలు జరగనప్పుడు అది "క్లెయిమ్ చేయని డిపాజిట్" (Unclaimed Deposit)గా మారుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్/ టర్మ్ డిపాజిట్ మెచ్యూరిటీ గడువు పూర్తయిన పదేళ్లలోగా ఆ డబ్బు విత్‌డ్రా చేయనప్పుడు ఉపసంహరించుకోనప్పుడు కూడా అది "అన్‌క్లెమ్‌డ్ డిపాజిట్" అవుతుంది. అన్‌క్లెమ్‌డ్ డిపాజిట్స్‌లోని డబ్బులను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ చేస్తాయి.
ఒక్కోసారి, మీ కుటుంబ సభ్యులు బ్యాంక్ సేవింగ్స్ ఖాతా, ఎఫ్‌డీ అకౌంట్ వంటివి ప్రారంభించి, ఆ విషయాన్ని మరిచిపోవచ్చు. లేదా, ఆ ఖాతాల గురించి కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మరణించవచ్చు. అలాంటి ఖాతాల్లో ఉన్న డబ్బును కూడా "అర్హత కలిగిన కుటుంబ సభ్యులు" విత్‌డ్రా చేసుకోవచ్చు.
క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం ఎక్కడ చెక్ చేయాలి?
క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం, రిజర్వ్ బ్యాంక్, UDGAM (Unclaimed Deposits-Gateway to Access inforMation) పోర్టల్ అభివృద్ధి చేసింది. బ్యాంకుల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ వివరాలు ఇందులో ఉంటాయి. బ్యాంక్ ఖాతాలోనే ఉంచి మరిచిపోయిన డబ్బు కోసం ఖాతాదార్లు ఈ పోర్టల్‌ను యాక్సెస్ చేయవచ్చు.
క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి తెలుసుకోవడానికి UDGAMను ఎలా ఉపయోగించాలి?
మీ మొబైల్ నంబర్, పేరు, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి UDGAM పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
పాన్, ఓటరు ID లేదా పుట్టిన తేదీ (ఏదో ఒక వివరాలు మాత్రమే అవసరం) వంటి వివరాలను బ్యాంక్ పేరుతో పాటు అందించి లాగిన్ అవ్వండి & సెర్చ్ చేయండి.
మీ ప్రశ్నకు సరిపోలే క్లెయిమ్ చేయని డిపాజిట్లపై సమాచారం ఉంటే, మీ సిస్టమ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
క్లెయిమ్ చేయని డిపాజిట్లను విత్‌డ్రా చేసుకునే ప్రక్రియ:
అకౌంట్ లేదా డిపాజిట్ ఉన్న బ్యాంక్ శాఖకు వెళ్లండి.
KYC సమాచారం & డిపాజిట్ రిసిప్ట్స్ వంటి వివరాలను అందించి, అవసరమైన క్లెయిమ్ ఫామ్‌ను పూర్తి చేయండి.
మీ వ్యక్తిగత గుర్తింపు రుజువులు చూపండి.
మరణించిన ఖాతాదారు అకౌంట్‌లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ కోసం మీరు వెళ్తే, ఖాతాదారుడి మరణ ధృవీకరణ పత్రం, చట్టపద్ధమైన వారసుడిగా మీ గుర్తింపు పత్రం సహా అవసరమైన పత్రాలను సమర్పించండి.
మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత, క్లెయిమ్ చేయని నిధులను బ్యాంక్ విడుదల చేస్తుంది.
మీ లేదా మీ కుటుంబ సభ్యుల కష్టార్జితం వృథాగా పోకూడదన్న ఉద్దేశంతో UDGAM పోర్టల్‌ను RBI తీసుకొచ్చింది. ఎప్పుడో డిపాజిట్ చేసి, వదిలేసిన డబ్బును సమర్థవంతంగా తిరిగి పొందడంలో ఇది సాయం చేస్తుంది.
ఖాతాల నిర్వహణపై RBI మార్గదర్శకాలు
ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి కార్యకలాపాలు లేని ఖాతాలను సమీక్షించాలని & ఆ ఖాతాలు "ఇన్‌యాక్టివ్‌గా" మారే అవకాశం గురించి కస్టమర్లకు తెలియజేయాలని RBI అన్ని బ్యాంకులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తుంది. ఈ హెచ్చరికలను బ్యాంక్‌లు ఇ-మెయిల్, SMS లేదా లెటర్స్ ద్వారా ఖాతాదార్లకు పంపవచ్చు. ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు, కస్టమర్‌లు ఒక సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఖాతాను ఉపయోగించమని ఆ సందేశాల్లో బ్యాంక్‌లు కోరతాయి. అంతేకాదు, మెచ్యూరిటీ తీరిన టర్మ్ డిపాజిట్లలోని డబ్బును కస్టమర్ తిరిగి తీసుకున్నాడా, లేదా అని కూడా చెక్ చేయాలని RBI బ్యాంక్‌లకు సూచించింది.
మరో ఆసక్తికర కథనం: ఇండియన్ సర్వర్లలో డీప్‌సీక్ హోస్టింగ్ - భారతీయుల డేటా ప్రైవసీకి ఇదే పరిష్కారం