Credit Score: బ్యాంకులు సహా ఏ ఆర్థిక సంస్థ అయినా, ఒక వ్యక్తికి లోన్‌ ఇవ్వాలంటే చూసే పారామీటర్లలో క్రెడిట్‌ స్కోర్‌ ఒకటి. మంచి క్రెడిట్ స్కోర్‌ ఉన్న మనిషికి లోన్‌ దొరకడం పెద్ద విషయే కాదు. పిలిచి పిల్లనిచ్చినట్లు, బ్యాంక్‌లు సదరు దరఖాస్తుదారుడిని ఏసీలో కూర్చోబెట్టి లోన్‌ శాంక్షన్‌ చేస్తాయి. క్రెడిట్‌ స్కోర్‌ తక్కువ ఉన్నవాళ్లను మాత్రం తిప్పలు పెడతాయి. మీ క్రెడిట్‌ స్కోర్ మీ ఫైనాన్షియల్‌ స్టేటస్‌ను, క్రెడిట్‌ బిహేవియర్‌ను సూచిస్తుంది. మీకు అప్పు ఇస్తే నమ్మకంగా తిరిగి తీరుస్తారా, లేదా?; మీకు ఎంత లోన్‌ మంజూరు చేయవచ్చన్న విషయాన్ని క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే బ్యాంక్‌లు లెక్కగడతాయి. మంచి స్కోర్‌తో ఉంటే తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ లోన్‌ ఆఫర్‌ చేస్తాయి.


క్రెడిట్‌ స్కోర్‌ ఎంత ఉండాలి?
క్రెడిట్‌ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బెస్ట్‌ స్కోర్‌గా బ్యాంక్‌లు లెక్కలోకి తీసుకుంటాయి. 700 కంటే తక్కువ స్కోర్‌ ఉన్నవాళ్లకు లోన్‌ పుడుతుంది గానీ, వడ్డీ ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్‌ స్కోర్ 700 కంటే తక్కువ ఉన్న వాళ్లు 
కొన్ని టిప్స్‌ పాటిస్తే, రుణం సులభంగా చేతికి వస్తుంది.


క్రెడిట్‌ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ సంపాదించే చిట్కాలు:


క్రెడిట్ రిపోర్టును చెక్‌ చేసుకోవాలి
లోన్ కోసం అప్లై చేసే ముందే మీ క్రెడిట్ రిపోర్టును తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు క్రెడిట్ రిపోర్ట్ అప్‌డేట్ కాదు. లేదా, దానిలో మీకు సంబంధం లేని తప్పుడు ఎంట్రీ ఉండవచ్చు. మీకు అలాంటి ఇష్యూస్‌ కనిపిస్తే, లోన్ తీసుకునే ముందే దాన్ని సరిదిద్దుకోండి. దీనివల్ల నెగెటివ్‌ ఇంపాక్ట్‌ తగ్గి క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది.


మీ ఆదాయం, ఆస్తులను చూపించడం
మీ క్రెడిట్ రిపోర్ట్‌లో సరిదిద్దలేని లోపం ఉంటే, లోన్‌ పొందే మరో మార్గం ఉంది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించగల కెపాసిటీ మీకు ఉందని బ్యాంక్‌ దగ్గర మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్‌లో మీ జీతం, సేవింగ్స్‌ లేదా మీ ఆస్తుల వివరాలు ఉండవు. అలాంటి వాటిని విడిగా చూపించి లోన్‌ అడగవచ్చు. అప్పుడు, రుణం ఇవ్వడానికి బ్యాంకర్‌ అంగీకరించే అవకాశం ఉంది.


జాయింట్‌ లోన్‌ కోసం ట్రై చేయండి
మీ క్రెడిట్‌ స్కోర్ తక్కువగా ఉంటే... మీ తండ్రి, సోదరుడు, సోదరి లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్‌ లోన్‌ కోసం అప్లై చేయవచ్చు. అయితే, ఉమ్మడి రుణంలో మీతో ఉండే వ్యక్తికి అధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉండాలి. ఇలాంటి చిట్కా పాటిస్తే ఏ బ్యాంక్‌ మీకు 'నో' చెప్పదు. ఎక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని రుణాన్ని మంజూరు చేయవచ్చు.


తక్కువ లోన్‌ కోసం అప్లై చేయండి
పైన పేర్కొన్న టిప్స్‌ ఏవీ పని చేయకపోతే, మరో మార్గం కూడా ఉంది. ముందుగా, తక్కువ మొత్తంలో రుణం కోసం అప్లై చేయండి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న సందర్భంలో, పెద్ద మొత్తంలో లోన్‌ తీసుకుంటే EMIలు చెల్లించగలరా, లేదా అని బ్యాంకర్‌ అనుమానించే అవకాశం ఉంది. తక్కువ లోన్‌ కోసం అప్లై చేస్తే అలాంటి అనుమానం రాదు. పైగా, ఆ లోన్‌ను వేగంగా తీర్చేస్తే మీ క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపడుతుంది. ఈసారి కావలసినంత లోన్‌ కోసం అప్లై చేసుకునే ఛాన్స్‌ వస్తుంది.


NBFC లేదా ఫిన్‌టెక్ కంపెనీల నుంచి రుణం
చిట్టచివరి ఆప్షన్‌గా దీనిని ఉపయోగించండి. చాలా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), న్యూ ఏజ్‌ ఫిన్‌టెక్ కంపెనీలు తక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉన్నవాళ్లకు కూడా లోన్‌ ఇస్తున్నాయి. అయితే, వాటి వడ్డీ రేట్లు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి.


మరో ఆసక్తికర కథనం: OCCRP దెబ్బకు అదానీ స్టాక్స్‌ విలవిల - అదానీ గ్రూప్‌ ఇలా రియాక్ట్‌ అయింది


Join Us on Telegram: https://t.me/abpdesamofficial