Property Auction: ఏదైనా స్థిరాస్తి చవకగా అందుబాటులోకి వస్తే వెంటనే కొనేయడం తెలివైన వ్యక్తులు చేసే పని. అయితే, అలాంటి ఆస్తులు ఎక్కడ ఉంటాయి, ఎప్పుడు అమ్మకానికి వస్తాయన్న సమాచారం చాలా మందికి తెలీదు. దేశంలోని ఏ ప్రాంతంలో అయినా, చవకగా ఆస్తిని కొనేందుకు భారత ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం, ప్రత్యేకంగా కొత్త పోర్టల్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ పోర్టల్ పేరు బ్యాంక్‌నెట్ (Baanknet). ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు జప్తు చేసిన ఆస్తులను బ్యాంక్‌నెట్ పోర్టల్‌లో ఇ-వేలం ద్వారా విక్రయిస్తారు. ఈ ఆస్తుల లిస్ట్‌లో... వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, వాణిజ్య ఆస్తులు, దుకాణాలు, పారిశ్రామిక ప్లాట్లు వంటివన్నీ ఉన్నాయి. 


సాధారణంగా, బ్యాంక్‌ లేదా ప్రభుత్వ సంస్థ తాను జప్తు చేసి & వేలం వేయబోయే ఆస్తుల గురించి తన వెబ్‌సైట్‌లో మాత్రమే చూపుతుంది. ప్రజలు అలాంటి ఆస్తుల కోసం ప్రతి బ్యాంక్‌ లేదా ప్రభుత్వ సంస్థ వెబ్‌సైట్‌ను విడివిడిగా చెక్‌ చేస్తుండాలి. ఇది శ్రమతో కూడిన & కాలాన్ని వృథా చేసే ప్రయాస. దీనిని నివారించడానికి, కేంద్ర ప్రభుత్వం BAANKNET Portalను తీసుకొచ్చింది. ఇది, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు & సంస్థలు ఇ-వేలం చేయబోయే ఆస్తులను ఒకే వేదికపై చేర్చి ఒన్‌-స్టాప్‌ డెస్టినేషన్‌గా మారింది. కొనుగోలుదారులు & పెట్టుబడిదారులు ఈ పోర్టల్‌లో అనేక రకాల ప్రాపర్టీలను చూడవచ్చు.


రుణాలు చెల్లించని కారణంగా లేదా ఇతర కారణాల వల్ల బ్యాంకులు & ప్రభుత్వ సంస్థలు స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలంలో చౌకగా విక్రయిస్తారు. అలా స్వాధీనం చేసుకున్న అన్ని రకాల ఆస్తుల వివరాలు బ్యాంక్‌నెట్‌ పోర్టల్‌లో కనిపిస్తాయి, చవకగా ప్రాపర్టీని కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తాయి. ప్రస్తుతం, బ్యాంక్‌నెట్ పోర్టల్‌లో 1.22 లక్షల ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి.


బ్యాంక్‌నెట్‌ పోర్టల్‌లో ఆస్తిని ఎలా కొనాలి?
-- అధికారిక బ్యాంక్‌నెట్ పోర్టల్‌లోకి వెళ్లండి.
-- మీరు ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్న నగరాన్ని ఎంచుకోండి. 
-- కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి రకాన్ని (వాణిజ్య, నివాస, ఫ్లాట్, ఇల్లు, దుకాణం మొదలైనవి)  ఎంచుకోండి. 
-- మీరు ఏ రేంజ్‌లో ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోవచ్చు.
-- అన్ని తప్పనిసరి ఫీల్డ్‌లను ఎంచుకున్న తర్వాత ఆస్తుల పూర్తి జాబితా తెరపై కనిపిస్తుంది. దీనిలో పేరు/చిరునామా మాత్రమే కాకుండా వివరణాత్మక సమాచారం కూడా ఉంటుంది.
-- ఆస్తికి సంబంధించి మంచి నాణ్యతతో కూడిన ఫోటోలు కూడా ఉంటాయి, వాటి ద్వారా మీరు ఒక అవగాహనకు రావచ్చు.
-- ప్రతి ఆస్తి పక్కన 'Interested ' బటన్ ఉంటుంది, మీకు ఆ ఆస్తి నచ్చితే ఈ బటన్‌పై క్లిక్ చేయండి.
-- ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది, అందులో అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించండి.
-- ఫారం పూరించిన తర్వాత మీరు కొంత రిజిస్ట్రేషన్ ఫీజ్‌ చెల్లించాలి. ఆ తర్వాత ఆస్తి ఇ-వేలం షెడ్యూల్ వస్తుంది.
-- ఇ-వేలం షెడ్యూల్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది, మీరు ఈ పబ్లిక్ డొమైన్‌లో మొత్తం సమాచారాన్ని పొందొచ్చు.



బ్యాంక్‌నెట్‌లో ఏ ఇతర సౌకర్యాలు ఉంటాయి?
బ్యాంక్‌నెట్ పోర్టల్‌లో అధునాతన ఫీచర్‌లుగా ఆటోమేటిక్, ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్‌వేతో పాటు అనేక రకాల MIS రిపోర్ట్‌లు ఒకే క్లిక్‌తో అందుబాటులో ఉంటాయి. KYC ఇన్‌స్ట్రుమెంట్‌తో డ్యాష్‌బోర్డ్ సర్వీస్‌, కాల్‌బ్యాక్ రిక్వెస్ట్‌ సర్వీస్‌ కూడా ఉన్నాయి. ఈ పోర్టల్‌లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్, కాల్ సెంటర్ సేవలను కూడా పొందొచ్చు.


మరో ఆసక్తికర కథనం: పెన్షనర్లకు పెద్ద బహుమతి - దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ బ్యాంక్‌ నుంచయినా పెన్షన్‌