Employees' Provident Fund: మీరు ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్నా లేదా ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తున్నా, ప్రతి ఉద్యోగి జీతం నుంచి PF డబ్బు కట్‌ అవుతుంది. మీరు 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా పని చేస్తుంటే, మీ PF ఖాతాలో ఎంత డబ్బు జమ అయిందో తెలుసుకోవడం చాలా ఈజీ. అంతేకాదు, మీ PF ఖాతా పూర్తి బ్యాలెన్స్‌ తెలుసుకోవడం కూడా సలుభమే.


3 సంవత్సరాల్లో ఎంత డబ్బు జమ అవుతుంది?


ఉద్యోగికి ఇచ్చే జీతం ఆధారంగా పీఎఫ్ మొత్తాన్ని వేర్వేరుగా కట్ చేస్తారు. చాలా చోట్ల, PF డబ్బును ఉద్యోగి జీతం నుంచి మాత్రమే తీసుకుని EPF అకౌంట్‌లో జమ చేస్తారు. కొన్ని చోట్ల, PF డబ్బు ఉద్యోగి జీతం నుంచే కాకుండా కంపెనీ తరపున కూడా జమ అవుతుంది. ఉదాహరణకు... ఉద్యోగి జీతం నుంచి PF నెలకు రూ. 1800 కట్‌ చేస్తే, కంపెనీ కూడా ఆ ఉద్యోగి ఖాతాలో నెలకు అంతే మొత్తం (1800 రూపాయలు) డిపాజిట్ చేస్తుంది. దీంతో, ఉద్యోగి PF ఖాతాలో ప్రతి నెలా రూ. 3600 జమ అవుతుంది. ఇదే కటింగ్‌తో మీరు 3 సంవత్సరాలు పని చేసినప్పుడు, అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్‌ ఉందో తెలుసుకోవాలనుకుంటే, 3600ని 12తో గుణించి, వచ్చిన ఫలితాన్ని మళ్లీ 3తో గుణించండి (3600 x 12 x 3). ఇప్పుడు రూ. 1,29,600 వస్తుంది. మూడేళ్ల శ్రమకు మీ పీఎఫ్‌ అకౌంట్‌లో జమ అయిన డబ్బు ఇది. అయితే, ఈ డబ్బు EPF (Employees' Provident Fund), EPS (Employee Pension Scheme) ఖాతాల కింద విడిపోతుంది. EPF బ్యాలెన్స్‌పై భారత ప్రభుత్వం ఏటా వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుతం, ఈ వడ్డీ రేటు 8.25%.


PF బ్యాలెన్స్ ఎలా చెక్‌ చేయాలి?


మీ PF అకౌంట్‌లో ఎంత నగదు నిల్వ ఉందో తెలుసుకోవడానికి, మీరు EPFO ​​వెబ్‌సైట్ నుంచి మీ PF ఖాతాలో లాగిన్‌ అయి, సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 


ముందుగా, మీరు EPFO అధికారిక ​​వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. తర్వాత, 'Our Services' సెక్షన్‌లోకి వెళ్లి, 'For Employees' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత 'Member Passbook' మీద క్లిక్ చేయండి. ఇప్పుడు, మీ UAN నంబర్ & పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. లాగిన్‌ కాగానే మీ పాస్‌బుక్‌ తెరపై ప్రత్యక్షం అవుతుంది. దానిలో మీ PF బ్యాలెన్స్ & డిపాజిట్ చేసిన మొత్తం గురించి పూర్తి సమాచారం ఉంటుంది.


మిస్డ్‌ కాల్‌, SMS &యాప్‌ ద్వారా కూడా PF బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు


UAN యాక్టివ్‌గా ఉన్న ఉద్యోగులు కేవలం ఒక్క SMS పంపి PF ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయొచ్చు. దీని కోసం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 'EPFOHO UAN' అని టైప్ చేసి 7738299899కి పంపాలి. వెంటనే, మీ PF అకౌంట్‌లో బ్యాలెన్స్ సమాచారాన్ని పొందుతారు.


మీరు మీ PF బ్యాలెన్స్‌ను ఒక మిస్డ్ కాల్ ద్వారా కూడా చెక్‌ చేయవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.


యాప్ ద్వారా మీ PF అకౌంట్‌ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, UMANG (Unified Mobile Application for New-age Governance) యాప్ అవసరం. ఈ యాప్‌లో మీరు 'EPFO' ఆప్షన్‌ ఎంచుకుని, ఆపై 'Employee-Centric Services'పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ UAN నంబర్ & మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్‌ చేయాలి. ఇలా చేసిన వెంటనే, మీ PF పాస్‌బుక్ మీ స్క్రీన్‌పై ఓపెన్‌ అవుతుంది.


మరో ఆసక్తికర కథనం: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై బోలెడన్ని డిస్కౌంట్‌లు - ఎక్కడ కొనాలంటే?