Yes Bak FD Rates: దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI), గత ఏడాది మే నుంచి రెపో రేటును పెంచుతూ వస్తోంది. రెపో రేటు పెరుగుదలతో బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచాయి. దీంతో, గృహ రుణం నుంచి వ్యక్తిగత రుణం వరకు అన్ని రకాల EMIలపై భారం పెరుగుతోంది. ఇదే సమయంలో, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD) మీద కూడా వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచాయి. ఫలితంగా, మునుపటి కంటే ఎక్కువ వడ్డీని ఖాతాదార్లు పొందుతున్నారు. ఇప్పుడు, చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 8 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తున్నాయి.


తాజాగా, ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను పెంచింది. ఎఫ్‌డీ వడ్డీ రేట్లను (Yes Bank FD Rates) 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు, అంటే 0.25 శాతం నుంచి 0.50 శాతానికి పెంచుతున్నట్లు యెస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లకు కొత్త FD వడ్డీ రేట్లు వర్తిస్తాయి. బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, పెరిగిన FD రేట్లు 21 ఫిబ్రవరి 2022 నుంచి అమలులోకి వచ్చాయి.


సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ
బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం... సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వాళ్లు), 181 నుంచి 271 రోజుల వరకు FDపై 6 శాతం వడ్డీ లభిస్తుంది. అదే విధంగా 272 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు ఎఫ్‌డిపై 6.25 శాతం; ఒక సంవత్సరం నుంచి 15 నెలల కాలానికి 7.25 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తుంది. 15 నెలల నుంచి 36 నెలల ఎఫ్‌డీపై వడ్డీ రేటును 7.5 శాతానికి ఈ బ్యాంక్‌ పెంచింది. ఈ సంబంధిత కాలాల్లోని ప్రతి FDపై సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు (60 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు) 0.50 శాతం ఎక్కువ వడ్డీ ఇస్తోంది. ఈ విధంగా యస్ బ్యాంక్ ఇప్పుడు FDపై 8% వరకు వడ్డీని అందిస్తోంది.


స్వల్పకాలిక FDలను పరిశీలిస్తే... 7 రోజుల నుంచి 14 రోజులకు 3.25 శాతం; 15 రోజుల నుంచి 45 రోజులకు 3.70 శాతం; 46 రోజుల నుంచి 90 రోజులకు 4.10 శాతం; 91 రోజుల నుంచి 180 రోజులకు 4.75 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది. 


ఎఫ్‌డీ వల్ల లాభమా, నష్టమా?
ఎఫ్‌డీ రేట్లు పెరిగిన నేపథ్యంలో, అందులో ఇన్వెస్ట్ చేయడం లాభమో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం. పరిశ్రమ ప్రమాణాల ప్రకారం చూస్తే, ప్రస్తుత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటును ఇచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయంగా పరిగణించాలి. గత ఏడాది మొదటి 10 నెలల పాటు ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ లక్ష్యిత పరిధికి పైన ఉంది. 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో కొంత మెత్తబడినా, 2023 జనవరిలో మళ్లీ 6 శాతం దాటింది. ఇప్పుడు, 6 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టడాన్ని సరైన నిర్ణయంగా చూడాలి.


రెపో రేటు పెంపు ప్రక్రియ ఇంకా ఆగలేదు. బుధవారం విడుదల చేసిన ఆర్‌బీఐ ఎంపీసీ మినిట్స్‌లోనూ ఇందుకు సంబంధించిన స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ ట్రెండ్ కూడా అదే చెబుతోంది. అంటే రాబోయే కాలంలో రెపో రేటు మరింత పెరుగుతుంది, FD రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి, తొందరపడి ఇప్పుడే పెట్టుబడి పెట్టకుండా కొంతకాలం వేచి చూడడం మంచి మార్గంగా ఉంటుంది. స్వల్పకాలిక FDలను పరిశీలిస్తే, ఇప్పటికీ చాలా బ్యాంకులు ద్రవ్యోల్బణం రేటు కంటే చాలా తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి.