Retirement Planning 2025: మనం, 2024 సంవత్సరం రైలు దిగి 2025 సంవత్సరం రైలు ఎక్కాం. నూతన సంవత్సరంలో మన జీవిత ప్రయాణం ప్రారంభమైంది. చాలా మంది ప్రజలు, ప్రతి కొత్త సంవత్సరంలో ఏదో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు. చెడు అలవాటును వదిలేయడానికి కొందరు సంకల్పిస్తే, భవిష్యత్ నిర్మాణం కోసం మరికొందరు ప్రతినబూనుతారు. మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో మీ జీవితానికి పనికొచ్చేలా ఏదైనా మెరుగ్గా ప్లాన్ చేయాలనుకుంటే, మా దగ్గర ఒక ఐడియా ఉంది.
భవిష్యత్‌ను ఆర్థికంగా బలంగా నిర్మించుకోవడానికి ఇప్పటి నుంచే శ్రమించాలి, ఇది చాలా అవసరం. ఒక్కో ఇటుకను పేరుస్తూ బలమైన భవనాన్ని కట్టినట్లు.. చిన్న మొత్తాలతోనూ మీ భవిష్యత్‌ను అందంగా నిర్మించవచ్చు. దీనికోసం
పెట్టుబడిపై కూడా శ్రద్ధ పెట్టాలి. సరైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను ఎంచుకుని & సరిగ్గా అమలు చేస్తే, మీ పదవీ విరమణ (retirement) సమయానికి కోట్ల కొద్దీ విలువైన సంపద సిద్ధంగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.5000 డిపాజిట్‌తో...
ఈ రోజుల్లో పెట్టుబడి కోసం ప్రజలు అవలంబిస్తున్న ప్రముఖ మార్గాల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. కొద్దిపాటి రిస్క్‌తో కూడిన ఈ మార్గంలోకి వచ్చే వాళ్ల సంఖ్య ఏటికేడు చాలా వేగంగా పెరుగుతోంది. మీ పదవీ విరమణ వయస్సు నాటికి పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టుకోవాలనుకుంటే మ్యూచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీని కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ను ఎంచుకోవచ్చు. ప్రతి నెలా రూ. 5000 SIP ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా ఫండ్‌ను కూడబెట్టవచ్చు.
ఉదాహరణకు.. ఇప్పుడు మీ వయస్సు 30 సంవత్సరాలు అనుకుందాం. 60 ఏళ్ల సమయంలో మీరు రిటైర్ అవుతారు అనుకుంటే, దానికి ఇంకా 30 సంవత్సరాల సమయం ఉంది. ఈ 30 సంవత్సరాల వరకు, మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా రూ. 5,000 SIP చేయండి. ఈ పెట్టుబడిపై సంవత్సరానికి సగటున 12% రాబడి వస్తే, 30 సంవత్సరాల తర్వాత (మీ 60 ఏళ్ల వయస్సు నాటికి) మొత్తం రూ. 1,76,49,569 ఫండ్ క్రియేట్ అవుతుంది. అంటే, 1.76 కోట్ల రూపాయల డబ్బుతో మీ రిటైర్మెంట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
ఈ 1.76 కోట్ల రూపాయల్లో మీ పెట్టుబడి మొత్తం 18 లక్షల రూపాయలు మాత్రమే. మిగిలిన రూ. 1.58 కోట్ల రూపాయలు మీ లాభం అవుతుంది. మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచేకొద్దీ, పోగపడే సంపద అంతకుమించి పెరుగుతుంది. అయితే... ఇన్వెస్ట్ చేయడానికి ముందు, మీరు తప్పనిసరిగా మ్యూచువల్ ఫండ్స్ గురించి పరిశోధించి, మంచి పథకాన్ని ఎంచుకోవాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ లేకపోయినా పేమెంట్స్ - యూపీఐ సర్కిల్‌తో చాలా లాభాలు