Old Pension Scheme: 


మళ్లీ పాత పింఛను పథకాన్ని (OPS) పునరుద్ధరిస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్బీఐ హెచ్చరించింది. ఒకవేళ నిజంగానే ఎంచుకుంటే భవిష్యత్తులో విపరీతమైన ఆర్థిక భారం భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (NPS) స్థానంలో ఓపీఎస్‌ను ఎంచుకోవడం వల్ల రానున్న సంవత్సరాల్లో అప్పులు పెరుగుతాయని వెల్లడించింది. రాజకీయ కారణాల వల్ల రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు పాత విధానం వైపు వెళ్లాయి. మరికొన్ని రాష్ట్రాలూ ఇదే దారి అనుసరిస్తామంటూ హామీలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.


'పాత పింఛను పథకం ఎంచుకోవడం వల్ల డబ్బు కొంత కాలమే ఉంటుంది. ప్రస్తుత ఖర్చులను వాయిదా వేయడంతో రాబోయే సంవత్సరాల్లో పింఛను అప్పులు పెరిగిపోతాయి' అని అని ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. 2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల పింఛను ఖర్చులు 16 శాతం పెరిగాయి. 2022-23లో రూ.399,813 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.4,63,436 కోట్లకు ఈ భారం చేరుకుంది. 2022తో పోలిస్తే చివరి 12 ఏళ్లలో రాష్ట్రాల పింఛను భారం ఏటా 34 శాతం పెరగడం గమనార్హం.


పాత పింఛను పథకంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ చివరి జీతంలో 50 శాతాన్ని ప్రతి నెలా పింఛనుగా పొందుతారు. నిజానికి ఈ విధానం ఆర్థికంగా మోయగలిగేది కాదు. ఈ పథకానికి డబ్బు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఎలాంటి నిధులు ఉండవు. అప్పటికే కూడబెట్టిన నిధులు లేదా స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన సొమ్ము ఉండదు. దాంతో ఆర్థిక భారంగా మారుతుంది. కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఇదే ముద్దుగా మారిందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తెలిపింది. రిటైర్‌మెంట్‌ పొందిన ఉద్యోగుల కోసం ప్రస్తుత పన్ను చెల్లింపు దారుల డబ్బు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది.


2004 నుంచి ఎన్‌పీఎస్‌


ఓపీఎస్‌ పింఛను ఆధారిత వ్యవస్థ. 2003లో ఎన్‌డీఏ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. ఉద్యోగులకు సరికొత్త పింఛను పథకం తీసుకొచ్చింది. 2004, ఏప్రిల్‌ 1 నుంచి పింఛను, పెట్టుబడి ఆధారిత పథకం ఆరంభించింది. ఇందులో కొంత డబ్బును స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. రిటైర్‌ అయ్యాక ఎక్కువ మొత్తం అందించే లక్ష్యంతోనే ఇలా చేశారు. ఉద్యోగి నష్టభయాన్ని అనుసరించే పెట్టుబడి విధానాలు ఉంటాయి.


NPS ప్రయోజనాలు



  • కొత్త పింఛను వ్యవస్థనూ ప్రభుత్వ ఉద్యోగుల కోసమే తీసుకొచ్చారు. అయితే ప్రైవేటు ఉద్యోగులూ ఇందులో చేరొచ్చు.

  • ఉద్యోగం చేస్తున్నంత వరకు నెలవారీ జీతం నుంచే ఎన్‌పీఎస్‌లో కంట్రిబ్యూట్‌ చేస్తారు. ఆ మొత్తాన్ని మార్కెట్‌ అనుబంధ సాధనాల్లో పెట్టుబడిగా పెడతారు.

  • ఆదాయ పన్నులో సెక్షన్‌ 80C కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయించుకోవచ్చు. సెక్షన్‌ 80CCD (1B) కింద రూ.50,000 వరకు అదనపు పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

  • ఉద్యోగి రిటైర్‌ అయ్యాక మొత్తం ఫండ్‌ నుంచి కొంతమేర విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం మెచ్యూరిటీ తర్వాత 60 శాతం కార్పస్‌పై పన్ను ఉండదు. మిగిలిన 40 శాతంపై పన్ను విధిస్తారు. అయితే మిగిలిన 40 శాతం డబ్బుతో ఆన్యూటీ ప్లాన్‌ కొనుగోలు చేసుకోవాలి. దాన్నుంచి ప్రతి నెలా పింఛను ఇస్తారు.

  • 2004 నుంచి సైనిక దళాలను మినహాయించి కేంద్ర ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ దీనినే వర్తింపజేస్తున్నారు.

  • ఎన్‌పీఎస్‌లో వేతనంలో 10 శాతం వరకు నెలవారీ కంట్రిబ్యూషన్‌ చేయాలి. ప్రభుత్వమూ సమానంగా కంట్రిబ్యూట్‌ చేస్తుంది. 2019 నుంచి కంట్రిబ్యూషన్‌ రేట్‌ను 14 శాతానికి పెంచారు.

  • 18-65 ఏళ్ల మధ్య వయస్కులు ఎన్‌పీఎస్‌ పథకంలో చేరేందుకు అర్హులు.