Car Insurance During Monsoon: ప్రస్తుత మాన్‌సూన్ సీజన్‌లో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి, తెలంగాణలోనూ తెగ కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలకు కార్లు కాగితం పడవల్లా కొట్టుకుపోతున్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. నష్టాన్ని తగ్గించుకోవడానికి కార్ ఓనర్లు మోటార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు.
సాధారణంగా, కాంప్రహెన్సివ్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్‌లో (సమగ్ర బీమా), వర్షం లేదా వరదల వల్ల కలిగే డ్యామేజీకి కూడా కవరేజీ ఉంటుంది. దీంతోపాటు, వివిధ యాడ్-ఆన్స్ కూడా కవరేజ్ పరిధిని పెంచుతాయి.
ఈ వర్షాకాలంలో వాన నీళ్లలో మునిగితే కార్ ఇంజిన్‌తో పాటు ఇండీరియర్ కూడా పాడైపోతుంది. దీన్నుంచి నష్ట పరిహారం కోసం సమగ్ర కారు బీమా తీసుకోవాలి. దీనికి కొన్ని యాడ్-ఆన్స్ అవసరం. జీరో డెప్, రిటర్న్ టు ఇన్వాయిస్, ఇంజిన్ ప్రొటెక్షన్ కవరేజ్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి రైడర్స్ తీసుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు పాటించండి, లేకుంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది
ఒకవేళ మీ కారు వరదలో మునిగిపోతే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది, ఎట్టి పరిస్థితుల్లో ఇంజిన్ స్టార్ట్ చేయవద్దు. దీనివల్ల, ఇంజిన్ డ్యామేజీ పెరుగుతుంది. మునిగిపోయిన కారును అన్ని కోణాల నుంచి ఫోటోలు, వీడియోలు తప్పనిసరిగా తీయాలి. మీ కారు మునిగిపోనట్లు ఇవి రుజువు చేస్తాయి. మీ ప్రాంతంలో వరదలపై వార్తలు వస్తే, వాటిని కూడా సేకరించండి. సంఘటన గమనించిన వెంటనే, ఆలస్యం చేయకుండా బీమా కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. క్లెయిమ్ చేయడానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాలసీ డాక్యుమెంట్ అవసరం అవుతాయి. ఒకవేళ మీ కార్ వదలో కొట్టుకుపోయి కనిపించకపోతే, పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసి FIR కాపీ తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో మీ ఇన్సూరెన్స్ కంపెనీ FIR కాపీ కూడా అడుగుతుంది.
మరో ముఖ్యమైన విషయం. కారు వరదలో మునిగిపోయినప్పుడు, దానిని బయటకు తీయడం లేదా కదల్చడానికి ప్రయత్నించవద్దు. ఇలా చేస్తే వాహనం స్ట్రక్ అవ్వడం లేదా ఇంజన్‌లోకి ఇంకా నీరు చేరడం వంటివి జరుగుతాయి. డ్యామేజీ పెరుగుతుంది. ఈ ఒక్క కారణం చాలు.. ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్‌ను రిజెక్ట్ చేయడానికి.
మీ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందగానే, జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వేయర్‌ను ఆ సంస్థ పంపుతుంది. సర్వేయర్ అడిగిన వివరాలన్నీ చెప్పండి, అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వండి. అప్పుడే జరిగిన నష్టాన్ని వేగంగా, పూర్తిగా అంచనా వేయడానికి వీలవుతుంది. క్లెయిమ్ కోసం మీరు పెట్టుకున్న అప్లికేషన్ కూడా త్వరగా ఓకే అవుతుంది.
మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్‌లో కొన్ని యాడ్-ఆన్స్
- జీరో డెప్: దీని కింద, క్లెయిమ్ సెటిల్‌మెంట్ టైమ్‌లో తరుగుదలను (depreciation) లెక్కించరు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు డిప్రిసియేషన్ కాస్డ్ కోసం చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్: మీ కారు నీళ్లలో మునిగినప్పుడు, కారు ఇంజిన్‌కు జరిగిన నష్టాన్ని పాలసీ కవర్ చేస్తుంది.
- రిటర్న్ టు ఇన్వాయిస్: మీ కార్ ఇక మీకు దక్కదు అనుకున్న సందర్భంలో, కొత్త బండి కొనేందుకు 'రిటర్న్ టు ఇన్వాయిస్' రైడర్ ఉపయోగపడుతుంది. మీ కారు ఫుల్ కాస్ట్‌ను నష్టపరిహారం రూపంలో పొందేలా ఈ పాలసీ తీసుకోవచ్చు.
- రోడ్‌సైడ్ అసిస్టెన్స్: మీ కారు రోడ్డు మధ్యలో ఆగిపోతే ఈ రైడర్ ఉపయోగపడుతుంది. మీరు వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేస్తే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఈ స్మాల్ క్యాప్స్‌తో సాలిడ్ రిటర్న్స్, వారంలో రెండంకెల రాబడి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial