Tax On Gold Assets: ఇటీవలి సంవత్సరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 20 ఏళ్ల క్రితం నాటి (2003) అక్షయ తృతీయ నుంచి ప్రస్తుత ఏడాది (2023) అక్షయ తృతీయ నాటికి పసిడి రేటు 1000 శాతం పెరిగింది. అక్షయ తృతీయ నాడు కొన్న బంగారమే కాదు, మీరు ఎప్పుడు పసిడి కొన్నా, ఆ బంగారాన్ని లాభానికి అమ్మితే దీర్ఘకాలిక మూలధన లాభంపై పన్ను లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) టాక్స్‌ చెల్లించాలి. కానీ, అలాంటి పన్ను చెల్లింపు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54F కింద మినహాయింపు పొందవచ్చు.


మీరు 36 నెలలకు పైగా ‍‌‍‌(మూడేళ్లకు పైగా) బంగారు ఆస్తులను (Gold Assets) కలిగి ఉంటే, వాటిని విక్రయించడం ద్వారా వచ్చే లాభంపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. బంగారాన్ని కొనుగోలు చేసిన 36 నెలలలోపు విక్రయిస్తే, దానిపై స్వల్పకాలిక మూలధన లాభం చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనంతో బంగారంపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతం. 


3 సంవత్సరాల లోపు బంగారాన్ని విక్రయించడం వల్ల వచ్చే స్వల్పకాలిక లాభం సదరు వ్యక్తి ఆదాయానికి యాడ్‌ అవుతుంది. వర్తించే స్లాబ్ ప్రకారం అతను ఆదాయ పన్ను కట్టాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి 30 శాతం పన్ను శ్లాబ్‌లోకి వస్తే, బంగారం కొనుగోలు ధర, విక్రయించిన ధర మధ్య వ్యత్యాసాన్ని (లాభాన్ని) 30 శాతం పన్ను రేటుతో చెల్లించాలి.


ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54F కింద, ఇల్లు మినహా.. షేర్లు, బంగారం, బాండ్లను విక్రయించడం ద్వారా పొందిన దీర్ఘకాలిక మూలధన లాభంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. మీరు బంగారాన్ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో ఇంటిని కొనుగోలు చేస్తే లేదా ఇంటి నిర్మాణానికి ఖర్చు చేస్తే, ఆదాయపు పన్ను సెక్షన్ 54F కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.


బంగారాన్ని అమ్మడం ద్వారా వచ్చే లాభంపై పన్ను ఆదా చేయడానికి, దానిని ఇలా ఉపయోగించాల్సి ఉంటుంది:


1. బంగారాన్ని విక్రయించిన ఏడాది నుంచి రెండేళ్ల లోపు మీరు కొత్త నివాస ఆస్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


2. బంగారాన్ని విక్రయించడం ద్వారా పొందిన మొత్తంతో మూడు సంవత్సరాల లోపు కొత్త నివాస ప్రాపర్టీని నిర్మించుకోవాలి.


3. బంగారపు ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చే లాభం NHAI, REC బాండ్లలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను నుంచి తప్పించుకోవచ్చు. దీని కోసం, బంగారాన్ని విక్రయించిన ఆరు నెలల్లోపు ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టాలి. 54EC ప్రకారం బాండ్లలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 50,00,000.


4. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు (ITR Filing) చేసే తేదీ కంటే ముందు నాటి కల్లా ఇంటిని కొనుగోలు చేయడం లేదా నిర్మించడం కోసం బంగారంపై వచ్చిన లాభాన్ని ఖర్చు చేయలేరని మీరు అనుకుంటే... అటువంటి పరిస్థితిలో ఆ డబ్బును ఏదైనా ప్రభుత్వ బ్యాంకులోని మూలధన లాభం ఖాతాలో జమ చేయవచ్చు. దీనివల్ల మీకు మరికొంత సమయం కలిసి వస్తుంది. నిర్ణీత గడువు లోపు మీరు కొత్త నివాస ఆస్తిని కొనుగోలు చేయవచ్చు లేదా నిర్మించుకోవచ్చు.