Sukanya Yojana Rules Change: 


ఆడ పిల్లల భవిష్యత్తుకు ఆలంబనగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం సుకన్య సమృద్ధి యోజన! అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడేలా చదుకొనేందుకు ఈ పథకం సాయం చేస్తోంది. అలాగే పెళ్లిళ్లకు అవసరమైన డబ్బును సమకూర్చుకొనేందుకు అవకాశం కల్పిస్తోంది.


దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఎంతో మంది సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరిచారు. ప్రతి నెలా మదుపు చేస్తున్నారు. ఒక ఇంట్లో కేవలం ఇద్దరికే ఖాతా తెరిచేందుకు ఆస్కారం ఉంటుందని చాలామందికి తెలుసు. కొన్ని పరిస్థితుల్లో మూడు ఖాతాలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.


ముగ్గురికి ఎలా?


సుకన్య సమృద్ధి యోజనపై కేంద్ర ప్రభుత్వం 7.6 శాతం వడ్డీని అందిస్తోంది. చాలా బ్యాంకులతో పోలిస్తే ఇదెంతో ఎక్కువనే చెప్పాలి. అందుకే చాలా కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. సుదీర్ఘ కాలంలో భారీ మొత్తంలో డబ్బు చేతికి అందడమే కాకుండా పన్ను రహితం కావడం మరో ప్రయోజనం. అయితే మూడో కూతురికి పన్ను ప్రయోజనాల్లేవు. దానిని ఇప్పుడు సవరించారు.


మొదట ఒక అమ్మాయి పుట్టాక కవల అమ్మాయిలు జన్మిస్తే ముగ్గురి పేరుతో సుకన్య సమృద్ధి ఖాతాలు తెరవొచ్చు. మూడింట్లోనూ ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. మూడు ఖాతాలనూ ఆదాయపన్నులోని సెక్షన్‌ 80సీ కింద మినహాయించుకోవచ్చు. 


సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఎన్నాళ్లు డబ్బు డిపాజిట్‌ చేసుకోవచ్చు?


సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం ఖాతా తెరిచిన 15 ఏళ్ల వరకు డబ్బును డిపాజిట్‌ చేసుకోవచ్చు. పదేళ్లలోపు వయసున్న బాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షులు ఖాతా తెరవొచ్చు. ఉదాహరణకు బాలికకు తొమ్మిదేళ్లున్నప్పుడు ఖాతా తెరిస్తే 24 ఏళ్ల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 15 ఏళ్లు డబ్బు జమ చేయాలి. 'ఖాతా తెరిచిన 15 ఏళ్ల వరకు డిపాజిట్లు కొనసాగించాలి' అని ఎస్‌ఎస్‌వై నిబంధనలు పేర్కొంటున్నాయి. అలాగే 21 ఏళ్లకు ఖాతా మెచ్యూర్‌ అవుతుంది. 9 ఏళ్ల వయసులో తెరిస్తే ఆమెకు 30 ఏళ్లు నిండాకే మెచ్యూరిటీ వస్తుంది.


ఎస్‌ఎస్‌వై ఖాతాను ఎన్నాళ్లు ఆపరేట్‌ చేయాలి?


బాలికలకు 18 ఏళ్లు నిండేంత వరకే తల్లిదండ్రులు లేదా సంరక్షులు సుకన్య సమృద్ధి ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. 'ఖాతాదారుకు 18 ఏళ్లు నిండేంత వరకే సంరక్షులు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత ఖాతాదారు తన సొంత వివరాలను సమర్పించి ఖాతాను నిర్వహించుకోవచ్చు' అని నిబంధనలు చెబుతున్నాయి.


ప్రీమెచ్యూర్‌ క్లోజ్‌ చేయొచ్చా?


సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ముందుగానే ముగించొచ్చు. ఇందుకు ఖాతాదారుకు 21 ఏళ్లు నిండి ఉండాలి. ఆమె పెళ్లి కోసమే డబ్బు అవసరమని ధ్రువీకరించాలి. పెళ్లికి నెల రోజుల ముందు, మూడు నెలల తర్వాత మరే ఉద్దేశంతోనూ ఖాతాను క్లోజ్‌ చేసేందుకు వీల్లేదు.