Stock Market News in Telugu: పెట్టుబడిదార్లు రెండు రకాలు. మొదటి రకం... రిస్క్ తీసుకోవడానికి భయపడరు, రిస్కీ అసెట్ ఆప్షన్లలోనే డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. రెండో రకం... రిస్క్ జోలికి వెళ్లరు, సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లోనే మదుపు చేస్తారు.
రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, తక్కువ రిస్క్ తీసుకునే వాళ్లు గోల్డ్ వైపు చూస్తారు. స్టాక్ మార్కెట్లు Vs బంగారం-వెండి ఆప్షన్లలో ఏది మంచిది?, దేనిలో రిస్క్ తక్కువ. స్టాక్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు కొన్నిసార్లు ఉత్సాహాన్ని, కొన్నిసార్లు నిరాశను కలిగిస్తాయి. ఒత్తిడి, అనిశ్చితితో కూడిన వాతావరణం ఉన్నప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితంగా అనిపిస్తుంది. ఈ దీపావళి సందర్భంగా, ఈ రెండు ఎంపికలపై పెట్టుబడిదార్ల నుంచి చాలా ఆసక్తి కనిపించింది. ధన్‌తేరస్ నాడు గోల్డ్ షాపింగ్ చేశారు, దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో భారీగా షేర్లు కొన్నారు.
2013 దీపావళి నుంచి 2023 దీపావళి వరకు
గత 10 సంవత్సరాల్లో, దీపావళి నుంచి దీపావళి వరకు వీటి రాబడులను పరిశీలిస్తే... వృద్ధి పరంగా బంగారం & వెండి కంటే సెన్సెక్స్ ముందుంది. 10 సంవత్సరాల క్రితం దీపావళి (2013 దీపావళి) నుంచి BSE సెన్సెక్స్ 206 శాతానికి పైగా పెరిగితే, బంగారం ధర 100 శాతానికి పైగా పెరిగింది. NSE నిఫ్టీ కూడా గత పదేళ్లలో 200 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ఇది 10 సంవత్సరాల క్రితం 6,299 స్థాయి నుంచి ఇప్పుడు 19,400 స్థాయిని దాటింది.
కేడియా అడ్వైజరీ సమాచారం ప్రకారం, 2013 సంవత్సరంలో, దీపావళి నవంబర్ 3వ తేదీన వచ్చింది. ఆ రోజు MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.29,871. అదే రోజున, సెన్సెక్స్ 21,197 మార్కు వద్ద ఉంది. PTI ప్రకారం, నవంబర్ 10, 2023న, అంటే ఈ ఏడాది ధన్‌తేరస్ రోజున, MCXలో గోల్డ్ డిసెంబర్ మంత్లీ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.60,131గా ఉంది, దిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర రూ.61,200గా ఉంది. నవంబర్ 10న సెన్సెక్స్ 64,905 వద్ద ముగిసింది. ఈ డేటా ఆధారంగా, 2013 దీపావళి నుంచి 2023 దీపావళి వరకు, బంగారం ధర 100 శాతానికి పైగా ర్యాలీ చేసింది, సెన్సెక్స్ 206 శాతానికి పైగా జంప్ చేసింది.
వెండితో పోలిస్తే సెన్సెక్స్ ఎలా ఉంది?
నవంబర్ 3, 2013న... MCXలో వెండి ధర కిలోకు రూ.48,732గా ఉంది. నవంబర్ 10, 2023న రూ.71,045గా, దిల్లీ బులియన్ మార్కెట్‌లో వెండి స్పాట్ ధర కిలోకు రూ.74,000 వద్ద ఉంది. ఈ లెక్కల ప్రకారం, 2013 దీపావళి నుంచి 2023 దీపావళి వరకు, వెండి ధర దాదాపు 45-50 శాతం పెరిగింది.
గత ఏడాది కాలంలో ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చింది?
2022 దీపావళి నుంచి 2023 దీపావళి వరకు చూస్తే... బంగారం ధర దాదాపు 20 శాతం పెరిగింది. అక్టోబర్ 24, 2022, దీపావళి రోజున, MCXలో బంగారం 10 గ్రాములకు రూ.50,580గా ఉంది. అదే రోజున, MCXలో వెండి ధర కిలోకు రూ.57,748గా ఉంది, ఇది ఇప్పటివరకు దాదాపు 23 శాతం పెరిగింది. అదే సమయంలో, సెన్సెక్స్, 2022 దీపావళి నాటి 59832 స్థాయి నుంచి 2023 దీపావళి నాటికి దాదాపు 8.5 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: దేశంలో దిగొచ్చిన ద్రవ్యోల్బణం, EMIల భారం కూడా తగ్గే ఛాన్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial