IT Exemptions:
కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను విధానాన్ని (New Income Tax Regime) సరళీకరించింది. ఇందులో అత్యంత సునాయాసంగా ఐటీఆర్ ఫైల్ (ITR) చేయొచ్చు. పైగా రూ.7 లక్షల నికర ఆదాయాన్ని ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. స్థూల ఆదాయం రూ.7.5 లక్షల వరకు ఉన్నా ఇబ్బందేం లేదు. పాత పన్ను విధానంలోని సెక్షన్ 80సీ, ఇంటి రుణం వడ్డీ, అసలు చెల్లింపులు, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు ఇందులో ఉండవు. అయితే ఆరు రకాల పన్ను మినహాయింపులు (Tax Deductions) పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
స్టాండర్డ్ డిడక్షన్
పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deductions) ప్రయోజనం కల్పించే సంగతి తెలిసిందే. రూ.50వేల వరకు నేరుగా లబ్ధి పొందొచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ స్టాండర్డ్ డిడక్షన్ గతంలో అందరికీ వర్తించదు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు మాత్రమే అమలయ్యేది. వ్యాపారస్థులు, స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఉండదు. నూతన విధానంలో దీనిని అందరికీ వర్తింపజేశారు.
ఎన్‌పీఎస్‌లో యజమాని కాంట్రిబ్యూషన్
నూతన పింఛన్ వ్యవస్థలో (NPS) చేరినవాళ్లు పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీసీడీ (1బి) కింద రూ.50వేల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీలో రూ.1.5 లక్షలకు ఇది అదనం. కొత్త పన్ను విధానంలో ఎన్‌పీఎస్‌లో యజమాని కాంట్రిబ్యూషన్‌కు మినహాయింపు ఇచ్చారు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఉద్యోగి బేసిక్ పే, డీఏలో 10 శాతం వరకు మినహాయింపు వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు 14 శాతం వరకు పొందొచ్చు. అయితే ఒక ఏడాదిలో ఇది రూ.7.5 లక్షలు దాటకూడదు.
ఈపీఎఫ్‌లో యజమాని కాంట్రిబ్యూషన్
ఉద్యోగులంతా ఈపీఎఫ్‌లో ప్రతి నెలా డబ్బులు జమ చేసే సంగతి తెలిసిందే. ఉద్యోగితో పాటు యజమాని సైతం మూల వేతనంలో 12 శాతం వరకు ఈ నిధికి జమ చేస్తారు. కొత్త పన్ను విధానంలో దీనికి మినహాయింపు కల్పించారు. అయితే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఒక ఏడాదికి రూ.7.5 లక్షలు దాటకూడదు.
జీవిత బీమా మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్
అధిక ఆదాయ వర్గాలు పన్నుల నుంచి మినహాయింపులు పొందేందుకు పెట్టుబడి ఆధారిత జీవిత బీమాలు తీసుకుంటున్నారు. మెచ్యూరిటీ తీరాక భారీగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే 2021-22 నుంచి యులిప్ (Ulip) మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్‌పై ప్రభుత్వం పరిమితి విధించింది. రూ.2.5 లక్షల వరకు మినహాయింపు కల్పించింది. 2023 బడ్జెట్లో యులిప్ ఏతర బీమాల పైనా పరిమితి విధించింది. ఇలాంటి పాలసీల ప్రీమియం మొత్తం ఏడాదికి రూ.5 లక్షలు దాటితే పన్ను విధిస్తోంది. పాలసీదారు మరణించాక కుటుంబ సభ్యులు అందుకొనే బీమా సొమ్ముపై మినహాయింపు ఇచ్చింది.
అద్దె ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్
మీకు ఓ ఇల్లుంది. అద్దెకిచ్చారు. ఆ ఇంటి వార్షిక ఆదాయ విలువలో 30 శాతం వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందొచ్చు. అందుకున్న అద్దె లేదా మార్కెట్ రేట్ల ప్రకారం అద్దెలోంచి మున్సిపల్ పన్నులు కట్టగా మిగిలింది ఆ ఇంటి వార్షియ ఆదాయం అవుతుంది.
పీపీఎఫ్, సుకన్య మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్‌పై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఏటా ఇందులో జమ చేసే డబ్బుపై కొత్త ఆదాయ పన్ను విధానంలో మినహాయింపులు ఉండవు.